రేషన్‌కు కరోనా బ్రేక్‌!

ABN , First Publish Date - 2021-05-10T05:29:10+05:30 IST

రేషన్‌కు కరోనా బ్రేక్‌!

రేషన్‌కు కరోనా బ్రేక్‌!

భయంతో దుకాణాలు తెరిచేందుకు అనాసక్తి

పలువురు డీలర్లకు పాజిటివ్‌.. నలుగురు మృత్యువాత

థర్డ్‌ పార్టీ అథెంటికేషన్‌ కోసం ఎదురుచూపు

రేషన్‌ అందక వినియోగదారుల ఆందోళన

ఖమ్మం కలెక్టరేట్‌/ కల్లూరు, మే 9: రేషన్‌బియ్యం పంపిణీపై కరోనా ప్రభావం పడింది. ఖమ్మం జిల్లాలో ఇటీవల నలుగురు రేషన్‌డీలర్లు కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో రేషన్‌పంపిణీ అంటేనే డీలర్లు భయపడుతున్నారు. ఈ నెల ఇప్పటి వరకు రేషన్‌దుకాణాలు తెరుచుకోక పోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతు న్నారు. డీలర్లు థర్డ్‌ అథంటికేషన్‌కు అవకాశం ఇస్తే బియ్యం పంపిణీ చేస్తామని, ఆ అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ఉన్నతాధికారులు మాత్రం దీనిపై ఏలాంటి నిర్ణయాన్ని ప్రకటించక పోవడంతో రేషన్‌ పంపిణీ నిలిచిపోయింది. 

ఖమ్మం జిల్లాలో 669 రేషన్‌దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 4,04,909 ఆహారభద్రతా కార్డులున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 300 దుకాణాలు ఉండగా.. వీటి పరిధిలో మే నెలకు సరుకులను ఇప్పటి వరకు ఏ డీలర్‌కూడా పంపిణీ చేయడంలేదు. వాస్తవానికి ప్రతి నెలా ఒకటో తారీకు నుంచి 15వరకు పంపిణీ చేయాలి.. కానీ ఈ నెల 10వ తేదీ కూడా వచ్చినా రేషన్‌దుకాణాలు తెరుచుకోవడంలేదు. వినియోగ దారులకు బియ్యం ఇతర సరుకులు ఇవ్వాలంటే విధిగా ప్రతీ కార్డుదారుని ఐరిష్‌ స్కానింగ్‌ ద్వారా గుర్తించి ఈ పోస్‌ మిషన్‌లో కార్డుదారుని వివరాలు నమోదు చేసి బియ్యం ఇవ్వాలని. ఈ విధానంలో వినియోగదారుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే అది ఈ ప్రక్రియద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని భయపడతు న్నారు. ఇప్పటికే కూసుమంచి, ఖమ్మం నగరంతో పాటు ఇటీవల నేలకొండపల్లి రేషన్‌డీలర్‌ ఒకరు కొవిడ్‌తో మృతి చెందారు. అంతే కాకుండా కోవిడ్‌ బాధిత డీలర్లు చాలామంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. దీంతో డీలర్లు రేషన్‌ ఇవ్వాలంటే ఆందోళన చెందుతున్నారు. రేషన్‌డీలర్లు కరోనాతో మృతి చెందుతున్నా, వందల కొద్దీ కోవిడ్‌ బారిన పడుతున్నా ప్రభుత్వం కానీ, పౌరసరఫరాల శాఖ కానీ డీలర్లను ఆదుకోవడంలేదు. కరోనా బారినుంచి కాపాడుకునేందుకు కనీస పరికరాలు పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు ఇవ్వడం లేదు. సొంత ఖర్చులతో దుకాణాల వద్ద ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోదని, కరోనాతో ప్రాణనష్టం జరిగినా ఆదుకోవడం లేదని, ఈక్రమంలో డీలర్లు వినియోగదారులకు బియ్యం పంపిణీ చేసి తామెందుకు నష్టపోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మే నెలకు సంబంధించిన బియ్యం అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

థర్డ్‌ పార్టీ అథెంటికేషన్‌కు అనుమతివ్వాలి.. 

గతేడాది మొదటి దశ కరోనా వ్యాప్తి సమయంలో ప్రభుత్వం థర్ట్‌పార్టీ అథెంటికేషన్‌తో బియ్యం పంపిణీ చేసిందని తద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమేకాక తమకు కూడా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని డీలర్లు అభిప్రాయపడుతున్నారు. ఈసారి కూడా థర్ట్‌పార్టీ అథెంటికేషన్‌ విధానంలో బియ్యం పంపిణీకి అనుమతి ఇవ్వా లని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే విష యమై ఇటీవల జిల్లావ్యాప్తంగా పలు మండలాల రెవెన్యూ కార్యాలయాల్లో, సివిల్‌ సప్లయీస్‌ అధికారులకు జిల్లా, మండల అసోసి యేషన్ల ఆధ్వర్యంలో వినతిపత్రాలు కూడా అందించారు. చౌకదుకాణాల్లో బియ్యం పంపిణీ విషయమై థర్ట్‌ పార్టీ అథెంటికేషన్‌ విధానం అమలుచేసే విషయంపై ప్రభుత్వ ఆదేశాల కోసం జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన డీలర్లు ఎదురుచూపులు చూస్తున్నారు.   ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ వైరస్‌ను కట్టడి చేసే క్రమంలో కరోనా నిబంధనలకనుగుణంగా థర్ట్‌ పార్టీ అథెంటికేషన్‌పై త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది.

థర్ట్‌పార్టీ అథెంటికేషన్‌ మా పరిధిలోది కాదు 

రాజేందర్‌, డీఎస్‌వో

చౌకదుకాణాల్లో థర్ట్‌ పార్టీ అథెంటికేషన్‌ విధానాన్ని అమలు చేసే విషయం మా పరిధిలోది కాదు. రాష్ట్ర ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకో వాల్సి ఉంటుంది. అయినా జిల్లాలో ఇప్పటికే 289షాపుల్లో బియ్యం పంపిణీ ప్రారంభమైంది. మిగిలినవి కూడా తెరుచుకొనేలా చర్యలు తీసుకుంటాం. 

థర్డ్‌పార్టీ గుర్తింపునకు అవకాశమివ్వాలి..

జానీమియా, రేషన్‌డీలర్ల సంఘం నాయకులు

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రేషన్‌డీలర్లకు థర్డ్‌ పార్టీ అథెంటికేషన్‌ విధానానికి అనుమతి ఇవ్వాలి. ప్రస్తుతం కరోనాతో పలువురు డీలర్లు మృత్యువాత పడుతున్నారు. ఇది డీలర్ల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతోంది. ఈ సమయంలో థర్డ్‌ అథంటికేషన్‌ ద్వారా కొంత ఊరట పొందొచ్చు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. కానీ నిర్ణయాన్ని వెల్లడించలేదు. దీంతో బియ్యం పంపిణీ జాప్యం జరుగుతోంది. వెంటనే థర్డ్‌పార్టీ అథెంటికేషన్‌పై నిర్ణయాన్ని వెల్లడించాలి. 

Updated Date - 2021-05-10T05:29:10+05:30 IST