‘రిపోర్టు’ రాజ్యమేలుతోంది! ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రత్యేక కరోనా ఆంక్షలు

ABN , First Publish Date - 2021-05-10T05:25:28+05:30 IST

‘రిపోర్టు’ రాజ్యమేలుతోంది! ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రత్యేక కరోనా ఆంక్షలు

‘రిపోర్టు’ రాజ్యమేలుతోంది! ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రత్యేక కరోనా ఆంక్షలు

ఏ శస్త్రచికిత్సకైనా, వైద్యం కోసమైనా నిర్ధారణ తప్పనిసరి..

లేదంటే ఆసుపత్రులు, ఆపరేషన్‌ థియేటర్లలోకి నో ఎంట్రీ

పాజిటివ్‌ వచ్చిందా.. ఇక ఆసుపత్రి బిల్లు మోతే.. 

‘రిస్కీ ఆపరేషన్‌’ కింద అదనంగా వసూలు చేస్తున్న వైద్యులు

ఫలితంగా ఎలాంటి లక్షణాలు లేకున్నా క్యూల్లో..

ఖమ్మం, మే 9 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి ప్రారంభరోజుల్లో దానికి సంబంధించిన లక్షణాలు.. అంటే జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి ఇలాంటి కనిపిస్తేనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని చెప్పేవారు వైద్యులు. ఆ తర్వాత సెకండ్‌వేవ్‌ వ్యాప్తిలో చాలామందిలో లక్షణాలు కనిపించకపోయినా.. ఆయాసం, ఊపిరాడకపోవడం లాంటి లక్షణాలుంటే వెంటనే టెస్టులు చేయించుకుని చికిత్స పొందాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా రోగులతో అటు ప్రభుత్వ ఇటు ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. రూ.లక్షలు వెచ్చిస్తామన్నా పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం కష్టంగా మారింది. ఇక ఆక్సిజన్‌ బెడ్‌ దొరకాలి అంటే ఎంతో పుణ్యం చేసి ఉండాల్సిందే మరి. ఇలాంటి సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొందరికి మాత్రం వారికి ఎలాంటి అనారోగ్యం లేకపోయినా, లక్షణాలు లేకపోయినా ఖచ్చితంగా కరోనా టెస్టు రిపోర్టు కావాల్సి వస్తోంది. అది లేకుండా జిల్లాలోని ఏ ప్రైవేటు ఆసుపత్రిలో మెట్టు కూడా ఎక్కనివ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక శస్త్రచికిత్సలకైతే చెప్పాల్సిన అవసరమే లేదు. కరోనా వేళ సాధారణ రోగుల విషయంలో కూడా కరోనా రిపోర్టు రాజ్యమేలుతోందని రోగుల బంధువులు చర్చించుకుంటున్నారు. 

రిపోర్టు లేకుంటే.. అడుగుకూడా పెట్టని డాక్టర్లు..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో చికిత్సకు అనుమతులున్న ఆసుపత్రులు దానిపేరిట అందినకాడికి దండుకుంటుంటే.. కరోనా చికిత్సకు అనుమతులు లేని ఆసుపత్రుల యాజమాన్యాలు, డాక్టర్లు మాత్రం కరోనా టెస్టుల పేరిట దోచుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనాయేతర చికిత్స లేదంటే శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తే.. అదీ అత్యవసర శస్త్రచికిత్స అయితే కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల వారికి కాసుల పండగేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు నిర్వాహాకులైతే తమ ఆసుపత్రిలో చేరేందుకు వచ్చిన వారికి ముందుగా కరోనా టెస్టు చేయించుకుని రావాలని చెబుతుండగా.. మరికొందరు డాక్టర్లు కడుపులోనొప్పి, నరాలకు సంబంధించిన వ్యాధులు, ప్రసవం, గర్భసంచి సమస్యలు ఇలా ఒకటేంటి ఎలాంటి చికిత్సకు, శస్త్ర చికిత్సకు అయినా సరే కరోనా రిపోర్టు అడుగుతున్నారు. అది లేకుండా చికిత్స మొదలుపెట్టలేమని ఖరాఖండిగా చెబుతున్నారు. ఇక ఆపరేషన్ల విషయాలైతే వారు ఆ రిపోర్టు లేకుండా థియేటర్లలో అడుగు కూడా పెట్టడం లేదు. కొన్ని సందర్భాల్లో అయితే ముందు రోజుకానీ, రెండు రోజుల ముందుకానీ టెస్టు చేయించుకుని వచ్చినా రోగిని థియేటర్లలోకి తీసుకెళ్లిన తర్వాత కూడా మరోసారి శాంపిల్స్‌ సేకరించి బిల్లులు వేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇంకొందరు డాక్టర్లయితే కమీషన్లపై కక్కుర్తితో అవసరం లేని వాటికి కూడా కరోనా టెస్టులు చేయించుకుని రావాలని చెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

నెగిటివ్‌ వస్తే ఓ రేటు.. పాజిటివ్‌ వస్తే మరోరేటు..

కాసుల కక్కుర్తి ఒక్కచోటుతో ఆగడం లేదు. రోగులు చేయించే టెస్టుల్లోనూ తాము చెప్పిన ల్యాబ్‌లకే వెళ్లాలని సూచించడం గమనార్హం. అది కూడా సాధారణ ర్యాపిడ్‌ టెస్టు రిపోర్టు అయితే చెల్లదు. వారు చెప్పిన సెంటర్‌కి వెళ్లి సిటీస్కాన్‌ చేయించుకుని వస్తేనే ఆసుపత్రుల్లో చేర్చుకోవడం కానీ, శస్త్రచికిత్సల చేయడంకాని. డెలివరీలు, ఇతర ఎమర్జెన్సీ ఆపరేషన్ల విషయంలో సంబంధిత వ్యక్తులకు టెస్టు రిపోర్టులో పాజిటివ్‌ వస్తే ఓ రేటు, నెగిటివ్‌ వస్తే మరో రేటును నిర్ణయించి దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాజిటివ్‌ కేసు అయితే తమ ప్రాణాలు కూడా పణంగా పెట్టాల్సి వస్తుందని, ఇతర డాక్టర్లు ఎవరూ ఆపరేషన్‌ చేయరని, తామైనా రిస్కీ ఆపరేషన్‌ కింద చేస్తామని చెప్పి రూ.లక్షల్లో బిల్లులు వేసి అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పనిసరిగా ఆపరేషన్‌ చేయాల్సి రావడంతో ఆయా రోగుల కుటుంబసభ్యులు కూడా ప్రాణం కంటే ఏదీ ఎక్కువకాదనుకుని.. వారు అడిగినంత చెల్లిస్తున్నారు. 

లక్షణాలు లేకపోయినా క్యూల్లో.. 

వైద్యులు, ఆసుపత్రుల నిర్వాహకులు ఖచ్చితంగా కరోనా టెస్టు రిపోర్టులు కావాలి అని చెబుతుండటంతో ఎలాంటి లక్షణాలు లేని ఇతర సమస్యలతో బాధపడుతూ కూడా క్యూలలో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారికి కరోనా లక్షణాలు లేకపోయినా కరోనా రోగుల మధ్యలో టెస్టుల కోసం గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని, ఈ క్రమంలో తమకెక్కడ ఆ వైరస్‌ వ్యాప్తి చెందుతుందోనని రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా టెస్టుల కోసం వెళ్లి కూడా కరోనా బారిన పడుతున్న వారూ ఉన్నారు. ఇలా 

ఒకవైపు కరోనా అనుమానితులు, మరోవైపు ఇతర రోగులు కూడా కరోనా టెస్టుల కోసం సెంటర్ల వద్దకు పరుగులు పెట్టడంతో ఆయా ప్రైవేటు ల్యాబుల వద్ద బారీగా క్యూలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై ప్రైవేటు ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని ప్రజలు కోరుతున్నారు. 

మూలుగుతున్న మన్యం

పెరుగుతున్న పాజిటివ్‌ రేటు

కొత్తగూడెం : భద్రాద్రి జిల్లా ఏజెన్సీ పరిధిలో ఇటీవల కాలంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గూడేల్లో వైరస్‌ ప్రభావంతో గిరిజనులు మంచంపడుతున్నారు. గత 20 రోజుల నుంచి జిల్లాలో నిత్యం 250 నుంచి 300 వరకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. 18 ఏళ్ల నుంచి 45 సంవత్సరాల వయస్సులోపు ఉన్న యువకులకు వ్యాక్సిన్‌ సరఫరా లేకపోవడంతో వారు వైరస్‌తో  మృత్యువాత పడుతున్నారు. నిత్యం జిల్లాలో ఐదారుగురు మృత్యువాత పడుతున్నారు. వ్యాక్సిన్‌ పంపిణీలో వేగిరం లేకపోవడం కూడా ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఆస్పత్రుల్లో పడకలు ఉన్నప్పటికీ అంతకు మించి బాధితులు వస్తుండటంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయి.  

కోల్‌బెల్ట్‌లో కార్మికుల బెంబేలు

ఇల్లందు : సింగరేణి కోల్‌బెల్ట్‌ ప్రాంతాల్లో కరోనా ఉధృతితో కార్మిక కుటుంబాలు బెంబేలెత్తుతున్నాయి. కరోనా రోజు రోజుకు పెరగడంతో బొగ్గుగనుల్లో విధులకు వెళ్లిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులు ఏ క్షణంలో కరోనా భారిన పడతారోనన్న ఆందోళన వారి కుటుంబాల్లో వ్యక్తమవుతోంది.   సింగరేణి ఏరియాల్లో ఐసోలేషన్‌ కేంద్రాలు, వ్యాక్సిన్‌ కేంద్రాలు, వ్యాఽధి నిర్ధారణ పరీక్షలకు యాజమాన్యం ఏర్పాట్లు చేసినపట్టికి కరోనా భారిన పడకుండా గనుల్లో కట్టుదిట్టంగా ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. కోల్‌బెల్ట్‌లో 50శాతం కూడా వ్యాక్సినేషన్‌ పూర్తి కాలేదు. ప్రధానంగా అండర్‌గ్రౌండ్‌ గనుల్లో కరోనా ప్రమాదం తీవ్రంగా పొంచి ఉంది. యుద్ధ ప్రాతిపదికన సింగరేణి వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను పెంచాలని, అన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్‌, వెంటిలేటర్ల సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని కార్మికులు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-10T05:25:28+05:30 IST