‘కొవిడ్‌ టీకాను సద్వినియోగం చేసుకోవాలి’

ABN , First Publish Date - 2021-03-01T04:56:41+05:30 IST

కొవిడ్‌-19 టీకాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు.

‘కొవిడ్‌ టీకాను సద్వినియోగం చేసుకోవాలి’
మాట్లాడుతున్న మేడ్చల్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కొవిడ్‌-19 టీకాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా టాస్క్‌పోర్స్‌ కమిటీ మీటింగ్‌ను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి నుంచి సాధారణ ప్రజలకు ప్రభుత్వపరంగా ఉచితంగా టీకా వేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లాలో ప్రభుత్వ పరంగా రెండు ఆసుపత్రులు, ప్రైవేట్‌కు సంబంధించి 4 ఆసుపత్రులను గుర్తించినట్లు చెప్పారు. మొత్తం 6 ఆసుపత్రుల్లో కొవిడ్‌ టీకా వేస్తారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎప్పుడైనా వెళ్లి టీకా వేసుకోవచ్చని ఆయన చెప్పారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో రూ.250 కొవిడ్‌-19 వాక్సినేషన్‌ చేయనున్నట్లు చెప్పారు. ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రిజిస్టర్‌ చేసుకున్న వారికి మాత్రమే టీకా వేయనున్నట్లు తెలిపారు. 60 ఏళ్లు దాటిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా టీకా వేసుకోవచ్చని ఆమె తెలిపారు. 


నేటి నుంచి మూడోవిడత..

వికారాబాద్‌ : వికారాబాద్‌ జిల్లాలో మార్చి 1 నుంచి మూడో విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నట్లు కలెక్టర్‌ పౌసుమి బసు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్‌ సెంటర్‌లో 200 మందికి ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే వికారాబాద్‌ పట్టణంలోని మహావీర్‌ ఆసుపత్రిలో రూ. 250 చెల్లించిన 150 మందికి వ్యాక్సిన్‌ వేస్తారని చెప్పారు. 45 నుంచి 59 సంవత్సరాలు ఉన్నవారికి డాక్టర్‌ ద్వారా సర్టిఫికెట్‌ జారీ చేసిన వారికి మాత్రమే టీకా వేస్తారని తెలిపారు. కొవిడ్‌ 2.0 జీవోవీ ఇన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే వాక్సినేషన్‌ చేయబడుతుందన్నారు. సోమవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూచించిన కేంద్రాల్లో టీకా ఇస్తారని చెప్పారు. ప్రతిఒక్కరూ తప్పకుండా ఆధార్‌ కార్డు తీసుకొని రావాలని కలెక్టర్‌ సూచించారు.


మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో..

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా టీకాలు వేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆదివారం టీకా పంపిణీపై వైద్యాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 60 సంవత్సరాలు పైబడినవారు, 45 సంవత్సరాలు పైబడిన, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా టీకా వేసేందుకు సోమవారం నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. నేటినుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా కరోనా టీకాను అందిస్తున్నట్లు, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా టీకాలను వేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఒక్కో డోసుకు రూ.250గా నిర్ణయించిందని తెలిపారు. వ్యాక్సిన్‌ ధర రూ.150 కాగా, ఇతర సేవలకుగానూ రూ.100 చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో మెడికల్‌ కేర్‌ మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌సైన్స్‌, మల్లారెడ్డి ఆస్పత్రి, మమతా అకాడమీ ఆఫ్‌మెడికల్‌ సైన్సెన్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం టీకా వేసేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ జాన్‌శ్యాంసన్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మల్లికార్జున్‌, అధికారులు పాల్గొన్నారు. 


రంగారెడ్డి జిల్లాలోటీకా వేసే ప్రభుత్వ ఆసుపత్రులు ఇవే..

  • ఏరియా ఆసుపత్రి - కొండాపూర్‌
  • ఏరియా ఆసుపత్రి - వనస్థలిపురం


ప్రైవేట్‌ ఆసుపత్రులివే..

  • భాస్కర జనరల్‌ ఆసుపత్రి - మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌
  • బ్రిస్టిల్‌కోన్‌ ఆసుపత్రి - హయత్‌నగర్‌
  • కాంటినెంటల్‌ ఆసుపత్రి
  • కామినేని ఆసుపత్రి  



Updated Date - 2021-03-01T04:56:41+05:30 IST