కరోనా : 10,193

ABN , First Publish Date - 2020-08-08T08:54:04+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ కట్టలు తెంచుకుంది. అధికారులు ఎన్ని నియంత్రణ చర్యలు చేపడుతున్నా.. రోజురోజుకూ వైరస్‌ విజృంభిస్తోంది.

కరోనా : 10,193

జిల్లాలో పదివేలు దాటేసిన ‘పాజిటివ్‌’ బాధితుల సంఖ్య

వలస కూలీల ప్రాంతాల్లోనే అత్యధికంగా కేసుల నమోదు 



(కలెక్టరేట్‌): జిల్లాలో కరోనా వైరస్‌ కట్టలు తెంచుకుంది. అధికారులు ఎన్ని నియంత్రణ చర్యలు చేపడుతున్నా.. రోజురోజుకూ వైరస్‌ విజృంభిస్తోంది. పల్లె.. పట్టణం అనే తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా వ్యాపించేసింది. శుక్రవారం 449 పాజిటివ్‌  కేసులు నమోదుకాగా, మొత్తంగా బాధితుల సంఖ్య 10,193కు చేరింది. అధికారుల అంచనాలను కూడా కరోనా వృద్ధి రేటు దాటేస్తోంది. దీంతో జిల్లావాసుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు కొవిడ్‌ ఆస్పత్రులు, పునరావాస కేంద్రాల్లో (కేర్‌ సెంటర్లు) అరకొర సౌకర్యాలు, వైద్య సేవలపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘పాజిటివ్‌’ ఉన్నట్టు నిర్ధారణ అయినా.. ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులకు వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు. అత్యవసరమైతేనే ఆస్పత్రి బాట పడుతున్నారు. లేదంటే హోం క్వారంటైన్‌లో ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. 




జిల్లాలో కరోనా వైరస్‌ గాలి కంటే వేగంగా వ్యాపిస్తోంది. కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య పదివేలకు దాటేసింది. జిల్లాలో ఇప్పటివరకూ 1,83,084 మందికి కరోనా పరీక్షలు చేయగా, 10,193 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. శుక్రవారం ఒక్కరోజే 3,575 నమూనాలు సేకరించగా.. 449 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ ప్రారంభ దశలో రాష్ట్రమంతా వ్యాపించినా.. జిల్లాలో చాలా రోజుల వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో సిక్కోలు వాసులంతా సంబరపడ్డారు.  ఏప్రిల్‌ 23న పాతపట్నంలో తొలి కరోనా కేసు నమోదైంది. ఆ నెల చివరి వారం రోజుల వ్యవధిలో మరో నలుగురిలో పాజిటివ్‌  లక్షణాలు బయటపడ్డాయి. మే నెలలో 142 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జూన్‌ నుంచి వైరస్‌ వ్యాప్తితో మరో 403 కేసులు పెరిగాయి. జూలైలో ఏకంగా 6,128 కేసులు బయటపడ్డాయి. ఈ నెలలో ఇప్పటివరకూ  (వారం రోజుల వ్యవధిలో) 3,515 పాజిటివ్‌ కేసులు నిర్ధారణయ్యాయి. మొత్తంగా కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య జిల్లాలో 10,193కి చేరింది.


దీంతో జిల్లావాసుల్లో కలవరం రేగుతోంది. ఎన్ని చర్యలు చేపడుతున్నా.. కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో అధికారుల్లోనూ అలజడి రేగుతోంది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా వలస కూలీల రాకతోనే జిల్లాలో కరోనా ప్రభావం పెరిగింది. విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలంతా బస్సులు, రైళ్లలో స్వగ్రామాలకు చేరుకున్నారు. ఈ సమయంలో కరోనా వ్యాప్తి చెంది... ఇప్పుడు విజృంభిస్తోంది. కరోనా కట్టడికి అధికారులు అహర్నిశలూ శ్రమిస్తున్నా ఫలితం లేకపోతోంది. వలస కూలీలు చేరుకున్న ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా నియంత్రణపై అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. కొంతమంది జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. భౌతికదూరం పాటించకపోవడం, మాస్క్‌లు ధరించకుండా విచ్చలవిడిగా తిరిగేస్తుండడంతో  పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేయాల్సిన అవసరం ఉందని మేథావులు అభిప్రాయపడుతున్నారు. 


తప్పుదారి పట్టించిన సర్వేలు 

 కరోనా ప్రారంభ దశ నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో జిల్లా ఉన్నతాధికారులు సర్వే బృందాలు ఏర్పాటు చేసి సమాచారం సేకరించారు. ఈ బృందాల్లో ఏఎన్‌ఎం, ఆరోగ్య కార్యకర్త, ఆశావర్కర్లను నియమించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారి వివరాలు సేకరించి సమాచారం అందించాలని ముందుగా ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటివద్దనే ఉండి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సమాచారం సేకరించి అందించారు. తప్పుడు సమాచారం అందించటంతో జిల్లా ఉన్నతాధికారులు కూడా అంతగా శ్రద్ధ చూపలేదు. దీంతో క్రమేపీ కరోనా వ్యాప్తి పెరిగింది. ఇటీవల ఫీవర్‌ సర్వే చేపట్టాలని ఆ బృందాలకు జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి సప్తవర్ణ స్టిక్కర్లు అతికించి.. జ్వరాలు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో.. లేవో.. తెలుసుకోవాలని సూచించారు. ఫీవర్‌ సర్వే కూడా తూతూమంత్రంగా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే వల్ల ఉపయోగం లేదని, కేవలం కరోనా పరీక్షలు చేస్తేనే.. పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు అధికారులు ఎటువంటి చర్యలు చేపడతారనే చర్చనీయాంశమవుతోంది. 



జిల్లాలో కరోనా కేసులు ఇలా.. 

నెల పాజిటివ్‌ 

ఏప్రిల్‌ 5

మే 142

జూన్‌ 403

జూలై 6,128

ఆగస్టు 3,515

(ఇప్పటివరకూ)

మొత్తం 10,193

Updated Date - 2020-08-08T08:54:04+05:30 IST