కరోనా కమ్మేస్తుంది.. వ్యాక్సిన్‌ ఊరిస్తుంది..!

ABN , First Publish Date - 2021-05-11T05:11:12+05:30 IST

కరోనా ఉగ్ర రూపానికి పట్టణం నుంచి పల్లెల వరకు హడలిపోతు న్నాయి.

కరోనా కమ్మేస్తుంది.. వ్యాక్సిన్‌ ఊరిస్తుంది..!
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ కోసం క్యూ (పాత చిత్రం)



 పట్టణాల నుంచి పల్లెల వరకూ కుదుపు

పలుచోట్ల కాటు

ఎందరో అనారోగ్యంపాలు


నక్కపల్లి/ఎస్‌.రాయవరం, మే 10 : కరోనా ఉగ్ర రూపానికి పట్టణం నుంచి పల్లెల వరకు హడలిపోతు న్నాయి. ఈ మహమ్మారి కాటుకు కొందరు బలవుతుండగా, ఎందరో అనారోగ్యం బారినప డుతున్నారు. దీంతో ఈ కష్టదశ నుంచి గట్టెక్కడం ఎలా అన్న ఆలోచన అందరిలో మొదలైంది.  గత ఏడాది కొవిడ్‌ ప్రారంభ సమయంలో ఈ లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకునేందుకు భయపడేవారు. ఎవరికైనా కాస్త జ్వరం, జలుబు, దగ్గు వంటివి ఉంటే.. తెలిసిన వైద్యులు, మెడికల్‌ షాపుల నుంచి మందులు తెచ్చుకుని వాడేవారు.  మొదటి దశలో నక్కపల్లి, ఎస్‌.రాయవరం  మండలాల్లో కొవిడ్‌ మరణాలు నాలుగైదు మినహా ఎక్కువ లేవనే చెప్పాలి. కానీ సెకండ్‌ వేవ్‌ మాత్రం గ్రామాలను సైతం కుదిపేస్తోంది. ఈ రెండు మండలాల్లో పలువురు కొవిడ్‌ బాధితులు మృత్యువాత పడుతుండడంతో ప్రజల్లో భయం నెలకొంది. ఇప్పుడు టెస్ట్‌లు చేయించుకుందామన్నా, వ్యాక్సిన్‌ పొందాలనుకున్నా అంత తేలిగ్గా అయ్యే పనికాకపోవడంతో ఆందోళనకు లోనవుతున్నారు.మండల కేంద్రమైన నక్కపల్లిలో గడచిన 48 గంటల వ్యవధిలోనే భార్యా, భర్త  మృత్యువాత పడ్డారు. కరోనా కారణంగానే చనిపోయినట్టు అందరూ చెబుతున్నారు. ఇప్పటికే ఈ మండలంలోని ఓ హైస్కూల్‌ పీఈటీ, మరో ఎలిమెంటరీ స్కూల్‌ హెచ్‌ఎం వైరస్‌తో మృత్యువాత పడ్డారు. ఇవి అధికారిక గణాంకాలు మాత్రమే.. అనధికారికంగా మరికొన్ని మరణాలు కూడా సంభవించాయని ప్రచారంలో ఉంది. ఎస్‌.రాయవరం మండలం కర్రివానిపాలెంలో ఆదివారం కొవిడ్‌ లక్షణాలతో ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ మోకిన బుల్లబ్బాయి దొర మృతి చెందారు. చాలా మంది కొవిడ్‌ లక్షణాలున్నా, టెస్ట్‌ చేయించుకున్నాక పాజిటివ్‌ అని నిర్ధారణ అయినా, హోం ఐసోలేషన్‌ పేరుతో సొంత వైద్యం పొందుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని తెలుస్తోంది.  అధికారులు నక్కపల్లి సీహెచ్‌సీలో పదిహేను పడకలతో, దార్లపూడిలో నియోజకవర్గస్థాయిలో 100 పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలెవ్వరికీ వీటి గురించి సమాచారం లేకపోవడంతో చాలా మంది బాధితులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఆర్థికంగా ఉన్నవారు మాత్రం విశాఖలోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు.  


 టీకా ఎప్పుడు.. ఎక్కడేస్తారో తెలియని దుస్థితి!

నర్సీపట్నం : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ గంద రగోళంగా మారుతోంది. ఎప్పుడు వేస్తారు.. ఏది వేస్తారు.. తదితర సమాచారం వ్యాక్సిన్‌ వేయించుకోనున్న జనానికి ఎలాగూ తెలియడం లేదు. కనీసం అధికారులు, వైద్య వర్గాలకైనే సకాలంలో సమాచారం అందుతుందా.. అంటే అదీలేదాయె. ఫలితంగా చాలా మంది ఆయా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నర్సీపట్నంలో వ్యాక్సినేషన్‌ నిలిచిపోయి మూడు రోజులవుతుంది. జిల్లా కేంద్రం నుంచి వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుంది.. ? ఏరకం వేస్తారు..? అన్న ప్రశ్నలకు ఎవ్వరి వద్ద సమాధానం లభించడం లేదు. ఇది తెలియని చాలా మంది వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద ఉదయం నుంచి బారులుతీరి నిలుస్తున్నారు. దీంతో అప్పుడప్పుడు తోపులాటలు జరుగుతుండడం కూడా వైరస్‌ వ్యాప్తికి ఒక కారణంగా చెపుతున్నారు. ఇదిలావుంటే, ఈ నెల 10వ తేదీ నుంచి నెలాఖరు వరకు సెకెండ్‌ డోస్‌ వారికి మాత్రమే వ్యాక్సిన్‌ వేస్తారని, ఫస్ట్‌ డోస్‌ వేయరని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్టు ప్రచారంలో ఉంది. అయితే ఎవరికి, ఎప్పుడు వేస్తారనేది సబ్‌ కలెక్టర్‌, వైద్య ఆరోగ్య అధికారులకు దీనికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం నుంచి అధికారికంగా చేరలేదని సమాచారం. దీంతో వ్యాక్సిన్‌ కోసం ఎదరు చూస్తున్నవారు మంగళవారం టీకా వేస్తారా ? అని స్థానిక అధికారులను అడిగితే సమాచారం చెప్పలేకపోతున్నారు. రెండు రోజుల క్రితం వరకు ప్రాంతీయ ఆస్పత్రిలో కొవాగ్జిన్‌ రెండో డోసు వారికి వేశారు. పెదబొడ్డేపల్లి అర్బన్‌ సెంటర్‌లో కొవిషీల్డ్‌ వేశారు. మంగళవారం నుంచి వ్యాక్సిన్‌ వేస్తారా.. లేదా.. అన్న సందిగ్దం అందరిలో నెలకొంది. 

Updated Date - 2021-05-11T05:11:12+05:30 IST