బంధువునని నమ్మించి చోరీ చేసిన మహిళపై కేసు

ABN , First Publish Date - 2022-06-25T06:02:58+05:30 IST

బంధువునని నమ్మించి ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన ఓ మహిళను పట్టుకున్న స్థానికులు ఆమెను చెట్టుకుకట్టేసి దేహశుద్ధి చేయగా.. ఈ ఘటనలో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బంధువునని నమ్మించి చోరీ చేసిన మహిళపై కేసు
దొంగతనానికి పాల్పడిన మహిళను చీరపట్టి ఈడ్చుకెళుతున్న దృశ్యం

 ఇప్పటికే ఆమె పలు పోలీసుస్టేషన్లలో కేసులు

 కొత్త తరహా దొంగతనాలు ఆమెకు అలవాటు

 తాజాగా ఖమ్మం నగరం రుద్రమకోటలో దొంగతనం 

 పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసిన వైనం 

ఖమ్మం క్రైం, జూన్‌ 24 : బంధువునని నమ్మించి ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన ఓ మహిళను పట్టుకున్న స్థానికులు ఆమెను చెట్టుకుకట్టేసి దేహశుద్ధి చేయగా.. ఈ ఘటనలో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఖమ్మం నగర శివారులోని రుద్రమకోటలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవెల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ కొంతకాలం క్రితం భర్త చనిపోవడంతో చింతకాని మండలంలోని తన కూతురు ఇంటి వద్ద ఉంటోంది. ఆమెను కూతురు బాగానే చూసుకుంటున్నా దొంగతనాలకు అలవాటుపడిన ఆమె గురువారం మధ్యాహ్నం సమయంలో ఖమ్మం అర్బన్‌ పరిధిలోని రుద్రమకోటకు చెందిన తన దూరపు బంధువు అయిన పసుపులేటి శ్రీను ఇంటికి వెళ్లింది. ఇంట్లో వారు పనుల నిమిత్తం బయటకు వెళ్లారని పక్కన ఇంటి వారు చెప్పగా.. వారు తన బంధువులేనని, వచ్చిన తర్వాత కలిసి వెళతానని, అప్పటి వరకు ఇక్కడే కూర్చుంటా అంటూ వరండాలో కూర్చుంది. ఆ క్రమంలో కీటికి వద్ద ఇంటి తాళం కనిపించడండో.. ఆ తాళం తీసుకుని లోపలకు వెళ్లిన వీరమ్మ బీరువాలోని సుమారు రూ.90వేల నగదు, 8గ్రాముల బంగారం, 20గ్రాముల వెండిని దొంగిలించి బయటకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన యజమాని శ్రీనుకు ఎవ్వరో ఓ బంధువు వచ్చి ఇప్పుడే వెళ్లిందని చెప్పడంతో అనుమానం వచ్చిన శ్రీను వెంటనే ద్విచక్రవాహనంపై ఆమెను వెతుక్కుంటూ వెళ్లాడు. ఊరిబయట ఆ మహిళ కనిపించగా.. అప్పటికే ఆమె గురించి తెలిసిన శ్రీను.. ఆమెను ప్రశ్నించాడు. కానీ ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో స్థానికుల సాయంతో ఆమెను పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసి ఖమ్మం అర్బన్‌ పోలీసులకు అప్పగించారు. అయితే ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టిన వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్థానిక మహిళలు, ఓవ్యక్తి ఆ మహిళను బూతులు తిడుతూ.. చీర, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేయడం, అనంతరం మరో వ్యక్తి కాలుతో తన్నడం చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంపై ఖమ్మం అర్బన్‌ ఎస్‌ఐ మౌలానాను సంప్రదించగా ఆమెపై గతంలోనూ ముదిగొండ, ఖమ్మం రూరల్‌, రఘునాథపాలెం, చింతకాని పోలీ్‌సస్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. కుటుంబ సభ్యులు, పోలీసులు ఎంత చెప్పినా తీరు మార్చుకోని సదరు మహిళ.. తెలిసిన వారు, దూరపు బంధువుల ఇళ్లకు వెళ్లి చుట్టరికం, మాటలు కలిపి దొంగతనాలకు పాల్పడుతూ వస్తోందన్నారు. తాజా ఘటనలోనూ ఆమెను అదుపులోకి తీసుకున్నామన్నారు. అయితే ఈ విషయమై బాధితులు సదరు మహిళపై చోరీకి యత్నించిందని ఫిర్యాదు చేశారని, ఆమేరకే తాము కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 


Updated Date - 2022-06-25T06:02:58+05:30 IST