రద్దుచేసిన సెక్షన్లతో కేసులా!

ABN , First Publish Date - 2021-07-21T08:47:28+05:30 IST

చట్టాల అతీగతీ పట్టించుకోవాల్సిన ప్రజా ప్రతినిధులు ఎన్నికల తర్వాత రాజకీయాల్లో, స్వంత పనుల్లో, పార్టీ పనుల్లో తలమునకలై ఉంటున్నారు....

రద్దుచేసిన సెక్షన్లతో కేసులా!

చట్టాల అతీగతీ పట్టించుకోవాల్సిన ప్రజా ప్రతినిధులు ఎన్నికల తర్వాత రాజకీయాల్లో, స్వంత పనుల్లో, పార్టీ పనుల్లో తలమునకలై ఉంటున్నారు. దాంతో దిక్కుతోచని స్థితిలో సమాజ హితవుకోరే కొందరు పౌరులు పిటిషనర్లుగా మారి కాలం చెల్లిన చట్టాలపై కోర్టులకెక్కుతున్నారు. ఇంకా న్యాయస్థానాలు అంతగా కలుషితం కాకపోవటంవల్ల ప్రజలకు న్యాయం అందుతోంది. అందుకే మన ప్రజాస్వామ్యం కళ్ళు మూస్తూ తెరుస్తూ మనగలుగుతున్నది!


సెక్షన్‌ 66-ఏ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటి) ఏక్ట్‌ ప్రకారం ఆన్‌లైన్‌లో పోస్టు చేసే సమాచారం (ఇబ్బంది పెట్టేది, విమర్శించేది) ఏదైనా సరే శిక్షించదగినదే. ఈ కాలం చెల్లిన సెక్షన్‌ను 2015 మార్చి 24నే సుప్రీంకోర్టు రద్దు చేసింది. కానీ పాలకులు, ప్రభుత్వాలు, మీదుమిక్కిలి పోలీసులు ఆ రద్దును పరిగుణనలోకి తీసుకోకుండా ఎడాపెడా దేశమంతటా కొన్ని వేల కేసులు పెడుతునే ఉన్నారు, అరెస్టులు చేస్తూనే వున్నారు, ముద్దాయిలు కానివారిని జైలుకు పంపుతూ పైశాచికానందం పొందుతూనే ఉన్నారు. ఈ సెక్షన్‌ ఎప్పుడో రద్దయిందన్న సంగతి ఏలికలకు తెలిసేటప్పటికి చాలామంది నిష్కారణంగా దీని బారిన పడ్డారు. ఇదెక్కడి న్యాయం, ఇదేమి పాలన అని ప్రశ్నలు రేగేసరికి అత్యున్నత న్యాయస్థానం బాధితుల అక్కరకొచ్చింది! ఈ సెక్షన్‌ కింద నమోదైన కేసులన్నిటినీ వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీస్‌ చీఫ్‌లకు కేంద్రం ఆదేశాలు జారీచేయాల్సి వచ్చింది. సోషల్‌ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారనే నెపం మీద ఇప్పుడు పోలీసులు అత్యుత్సాహంతో అరెస్టు చేసే వీలు కోల్పోయారు. 


న్యాయ, చట్ట సంబంధమైన విషయాలను విశ్లేషిస్తున్నప్పుడు, చట్టాలను అమలుపర్చే పోలీసుల పాత్రను కూడా పరిగణనలోకి తీసుకోక తప్పదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలకు పోలీసులు కచ్చితంగా జవాబుదారీగా ఉండాలి! చాలా సందర్భాల్లో పోలీసులు దీనికి అనుగుణంగానే వ్యవహరిస్తారు. అయితే తాము రాజ్యాంగానికి, చట్టానికి కూడా జవాబుదారీగా ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో వారి పాత్ర గణనీయమన్నది పట్టించుకోవటం లేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలకులు రాజనీతిజ్ఞులు కావటం వల్ల పోలీసుల పనితీరు మరోవిధంగా వుండేది. ప్రభుత్వాల జోక్యం పరిమితులను మించకపోయేది! ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజనీతిజ్ఞులు కరువయ్యారు. రాజకీయ నాయకులే స్వలాభాపేక్షతో పోలీసులను విచక్షణారహితంగా వాడుకుంటున్నారు. 


చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఒక సీనియర్‌ ఐపీయస్‌ ఆఫీసర్‌ అక్కడ పోలీసులను ఇలాంటి విషయాల్లో ఏవిధంగా తీర్చిదిద్దుతున్నారో చెప్పారు. కొన్ని మార్గదర్శక సూత్రాలు అక్కడి పోలీసు యంత్రాంగం విధిగా పాటిస్తోంది: 1) రాజ్యాంగ విరుద్ధమైన సెక్షన్లతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ లను నమోదు చేయకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. పొరపాటున స్టేషన్ అధికారులు అలాంటి ఎఫ్‌ఐ‌ఆర్‌లు నమోదు చేసినా అలాంటి వారికి తగు విధంగా గైడెన్స్‌ ఇస్తున్నారు. 2) కావాలని అలాంటి కేసులుపెట్టే పోలీసులపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాదు కంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్టు కింద శిక్షించటంతో పాటు వారిపై డిపార్టుమెంట్ తరఫున చర్యలు కూడా తీసుకుంటున్నారు. 3) కావాలని ఇలాంటి తప్పులు చేసే పోలీసు అధికారులు కొత్తగా వచ్చిన 166-ఏ (ఐపీసీ) క్రింద రెండేళ్ళ జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తున్నది. 


అటార్నీ జనరల్‌ కె.కె. వేణుగోపాల్‌ ఇలాంటి సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకూడదని, సెక్షన్ల పక్కన బ్రాకెట్లలో తెలియచేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పటం గుమనార్హం. డిస్ట్రిక్ట్‌ క్రైమ్ రికార్డు బ్యూరో, స్టేట్‌ బ్యూరో, సెంట్రల్‌ క్రైమ్ రికార్డు బ్యూరో కూడా తగువిధంగా మార్గదర్శక సూత్రాలను రూపొందించటం అవసరం. ఇలాంటి చర్యలన్నీ ఒక ఎత్తు పోలీసులు తమ విద్యుక్త ధర్మాన్ని తూ.చ. తప్పకుండా నిర్వహించటం మరొక ఎత్తు! 

రావులపాటి సీతారాంరావు


Updated Date - 2021-07-21T08:47:28+05:30 IST