‘ఎమ్మెల్యే అనుచరుల అవినీతికి.. వైసీపీ ఎంపీ బలయ్యారు’

ABN , First Publish Date - 2021-08-06T16:50:13+05:30 IST

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..

‘ఎమ్మెల్యే అనుచరుల అవినీతికి.. వైసీపీ ఎంపీ బలయ్యారు’

ఫోర్జరీ దరఖాస్తుతో ఎంపీ మాగుంటపై పోలీస్‌ కేసు

సోమిరెడ్డి వెల్లడి

కాకాణి హస్తం ఉందని ఆరోపణ


అమరావతి(ఆంధ్రజ్యోతి): ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి వెల్లడించారు. ఎంపీకి తెలియకుండా ఆయన పేరుతో గ్రావెల్‌ తవ్వకాలకు వైపీసీ నేతలు ఫోర్జరీ దరఖాస్తు పెట్టిన ఫలితంగా ఈ కేసు నమోదైందని, దీని వెనుక సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గురువారం అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ‘సర్వేపల్లి రిజర్వాయర్‌లో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై మా పార్టీ కొంతకాలంగా బలంగా పోరాడుతోంది. ఆ చుట్టుపక్కల గ్రామస్ధులు సీసీ కెమేరాలతో తవ్వకాలను రికార్డు చేసి మరీ అధికారులకు ఇచ్చారు. దీంతో తప్పని పరిస్ధితుల్లో ఇరిగేషన్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానితో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారిస్తూ ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో రెండో నిందితుడిగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును చేర్చారు. ఐపిసి 427 సెక్షన్‌ కింద ఆయనపై ఈ కేసు పెట్టారు.


ఆయనను మాగుంట ఆగ్రో ఫార్మ్స్‌ సంస్ధ అధినేతగా పేర్కొంటూ ఈ కేసు పెట్టారు. గ్రావెల్‌ తవ్వకాలకు ఎంపీ దరఖాస్తు తీసుకొని అనుమతి తీసుకొన్నారని, కాని అనుమతికి మించి అక్రమ తవ్వకాలు చేశారని ఇరిగేషన్‌ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. మాగుంట కుటుంబం పెద్ద పారిశ్రామిక కుటుంబం. వాళ్ళు సాధారణ మట్టి తవ్వకాలకు దరఖాస్తు చేస్తారా... అక్రమ తవ్వకాలు చేస్తారా లేదా అన్నది కనీసం ఆలోచించకుండా కేసు పెట్టారు’ అని ఆయన వివరించారు. ఎంపీకి తెలియకుండా ఆయన సంతకం ఫోర్జరీ చేసి గ్రావెల్‌ తవ్వకాలకు దరఖాస్తు చేసి అనుమతి తీసుకొన్నారని, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ఉన్నారని సోమిరెడ్డి ఆరోపించారు.


‘మట్టి తవ్వకాల కోసం పెట్టిన మూడు దరఖాస్తుల్లో చేతి రాత ఒకే విధంగా ఉంది. ఎంపీ దరఖాస్తు చేస్తారా లేదా అన్నది కనీసం ఆలోచన లేకుండా ఇరిగేషన్‌ అధికారులు అనుమతులు ఇచ్చేశారు. తర్వాత అక్రమ తవ్వకాలు చేశారని అదే దరఖాస్తుల్లో ఉన్న వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు తెలియకుండా చీమ కూడా చిటుక్కుమనదు. ఆయన అనుంగు అనుచరుడే మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆయన పేరుతో తవ్వకాలకు అనుమతులు తీసుకొన్నాడు. కాకాణి అనుచరుల అవినీతికి, అక్రమ తవ్వకాలకు వైసీపీ ఎంపీ బలయ్యారు’ అని సోమిరెడ్డి చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే సొంత పార్టీ ఎంపీని ఇరికించినా ఆ పార్టీలో ఎవరూ మాట్లాడలేని నిస్సహాయత నెలకొందని, ఎమ్మెల్యేలు ఏం చేసినా మాట్లాడవద్దని ఇటీవల జిల్లాకు వచ్చిన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఆదేశం ఆ పార్టీపై పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.


అధికార పార్టీ ఎంపీపై తప్పుడు కేసు నమోదు కావడం ప్రభుత్వానికి సిగ్గుచేటని, ఈ ప్రభుత్వంలో వ్యవస్ధలు ఎలా పనిచేస్తున్నాయో ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారితోపాటు ఎంపీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఎమ్మెల్యే అనుచరుడిపైనా... అతనికి సహకరించిన ఎమ్మెల్యేపైనా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎంపీ పేరుతో దరఖాస్తు వచ్చినప్పుడు నిజమో కాదో విచారించకుండా అనుమతులు ఇచ్చిన అధికారులు... మళ్ళీ ఎంపీ అక్రమ తవ్వకాలు చేశాడని ఫిర్యాదు ఇచ్చిన అధికారులు, కేసు నమోదు చేసిన పోలీస్‌ అధికారులపై కూడా క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. అక్రమ మైనింగ్‌ జరిగిందని అధికారులే నిర్దారించినందువల్ల దానిపై పోరాటం చేసిన వారిపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-08-06T16:50:13+05:30 IST