కేసీ కాల్వ ఆధునికీకరణ

ABN , First Publish Date - 2021-11-24T05:48:08+05:30 IST

కేసీ కెనాల్‌ ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది.

కేసీ కాల్వ ఆధునికీకరణ
పాములపాడు వద్ద లింకింగ్‌ లేక కేసీ దుస్థితి

ఏడీబీ నుంచి రూ.513 కోట్లు
రాష్ట్ర వాటా నిధులు 11 శాతం8 కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లేఖ

 
 కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 23: కేసీ కెనాల్‌ ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. కేసీ కాల్వ అడుగడుగునా దెబ్బతినడంతో స్థిరీకరించిన 2.65 లక్షల ఎకరాలకు అరకొరగానే నీరు అందుతోంది. ఈ సమస్యపై జిల్లా మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు పంపిన నివేదికకు  కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆర్థిక, సాంకేతిక సహకారంతో, సపోర్ట్‌ ఫర్‌ ఇరిగేషన్‌ మోడ్రనైజేషన్‌ ప్రోగ్రామ్‌ కింద మొదటి దశలోనే కేసీ కెనాల్‌ ఆధునికీకరణకు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. ఈ పథకం కింద దేశంలోని భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను నాలుగు దశల్లో అభివృద్ధి చేస్తారు. కేసీ కాలువ ఆధునికీకరణ పనులకు అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదన మేరకు మొదటి దశలోనే కేసీ కెనాల్‌ను ఎంపిక చేశారని జిల్లా మైనర్‌ ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. దీనిపై తదుపరి చర్యలకు వీలుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదాన్ని ఈ నెల 30లోపు పంపాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్రం నుంచి 5 ప్రాజెక్టుల ఆధునికీకరణకు ప్రతిపాదనలు పంపించామని, మొదటి జాబితాలో కేసీ కాల్వకు చోటు దక్కిందని అధికారులు తెలిపారు. మొదట్లో జిల్లా నీటి పారుదల శాఖ కేసీ కెనాల్‌ ఆధునికీకరణకు రూ.1,107 కోట్లతో ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణ సాయం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మొదటి దశలోనే నిధులు కేటాయించేందుకు ఏడీబీ అంగీకారం తెలిపేలా నివేదిక పంపాలని సూచించడంతో రెండోసారి రూ.513.400 కోట్లతో నివేదికను పంపారు.

ప్రాజెక్టు వివరాలు: కేసీ కాల్వ కింద జిల్లాలో 1.73 లక్షలు, కడపలో 92 వేల ఎకరాలను స్థిరీకరించారు. 2007, 2009 వరదల కారణంగా గండ్లు పడి కాల్వ దెబ్బతింది. లైనింగ్‌లు పాడైపోయాయి. కర్నూలులో 235 కి.మీ. నుంచి కడపలో 71 కి.మీ. వరకు ఉన్న ప్రధానకాల్వతోపాటు పంపిణీ కాల్వలను ఎస్‌ఐఎంపీ కింద ఆధునికీకరించాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. కేసీ కెనాల్‌కు నీరందించే ప్రధానమైన సుంకేసుల జలాశయం కూడా వరదలకు దెబ్బతినింది. 130 ఏళ్ల క్రితం తవ్విన కాల్వల ద్వారా ఆయకట్టు స్థిరీకరణకు జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది.

కాల్వ దెబ్బతినడంతో..

మొత్తం పనులకు రూ.513.400 కోట్లు ఖర్చు అవుతుందని జలవనరుల శాఖ జిల్లా అధికారులు నివేదికను పంపించారు. కేసీ కెనాల్‌ ద్వారా 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలంటే సుంకేసుల జలాశయం నుంచి కేసీ కెనాల్‌కు 3,750 క్యూసెక్కుల నీటిని అందించాలి. ఈ నీరు కడప జిల్లాలోని చివరి వరకు ఆయకట్టు వరకూ చేరాలి. వరదల కారణంగా దెబ్బతిన్న కేసీ కాలువలో ఈ మొత్తం నీటిని విడుదల చేసే అవకాశం లేదు. ప్రస్తుతం కేవలం 2 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే సుంకేసుల నుంచి విడుదల చేస్తున్నారు.

11 శాతం భరించాలి..
ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆర్థిక సాయానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం 11 శాతం నిధులను ఈ పనులకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి వెంటనే 11 శాతం నిధులు వచ్చే అవకాశం ఉందని ఎస్‌ఈ ఖబీర్‌ బాషా తెలిపారు.

Updated Date - 2021-11-24T05:48:08+05:30 IST