ఇటు‘కేసి’ చూడరా..?

ABN , First Publish Date - 2022-07-07T07:09:41+05:30 IST

కేసీ కాలువ జిల్లాలోని పురా తన కట్టడాల్లో ఒకటి.

ఇటు‘కేసి’ చూడరా..?
ఎస్‌బీఐ ఆఫీసర్స్‌ కాలనీ సమీపంలో కేసీ కాలువలో కలుస్తున్న మురుగునీరు

దుర్గంధ ప్రవాహంగా మారిన వైనం
నగరంలోని మురుగంతా అందులోకే
పట్టించుకోని నగరపాలక, జలవనరుల ఇంజనీర్లు

 కర్నూలు, జూలై 6 (ఆంధ్రజ్యోతి):  కేసీ కాలువ జిల్లాలోని పురా తన కట్టడాల్లో ఒకటి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు నికర జలాల కేటా యింపు ఉన్న ప్రాజెక్టు అది.  156 ఏళ్ల  కింద 1866లో తుంగభద్ర-పెన్నా నదులను అనుసంధానం చేస్తూ ఈ కాల్వ  నిర్మించారు. మద్రాస్‌ ఇరిగేషన్‌ కంపెనీ నిర్మించిన కాలువను 1882లో బ్రిటీష్‌ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. ఇలాంటి కేసీ నేడు దుర్గంధ ప్రవాహంగా మారిపోయింది. కేసీ పారినంత మేర పరిసర కాలనీ వాసులు దుర్గంధం అనుభవించాల్సి వస్తోంది. దీనికి కార ణం నగరంలోని పలు కాలనీల మురుగునీరు కేసీలో కలవడమే. దీన్ని నివారించాల్సిన కార్పొరేషన్‌ ఇంజనీర్లు పట్టించుకోవడం లేదు. దీంతో సాగు, తాగునీరు అందించే కాలువ విషతుల్యమైపోయింది. చివరికి జలవనరుల శాఖ ఇంజనీర్లు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
కర్నూలు నగర జనాభా రోజు రోజుకూ పెరుగుతూ 6లక్షలు దాటింది. జనాభాతో పాటు నగరం కూడా విస్తరిస్తోంది. రైల్వే స్టేషన్‌ ఆవలి వైపున అశోక్‌నగర్‌, వెంకటరమణ కాలనీ, లేబర్‌ కాలనీ, టీచర్స్‌ కాలనీ, కప్పలనగర్‌ వంటి కాలనీలు విస్తరించాయి. వివిధ కాలనీలకు చెందిన ముగురునీటిని పైపులైన్లు, డ్రైయినేజీల ద్వారా దూరంగా తరలించాల్సిన కర్తవ్యం కార్పొరేషన్‌ పాలకులపై ఉంది. మంచినీటి సరఫరా చేసే కాలువలు, నదులలో మురుగునీరు విడుదల చేయరాదని పర్యావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. ఇందుకు విరుద్ధంగా ఆశోక్‌ నగర్‌, ఎస్‌బీఐ ఆఫీసర్స్‌ కాలనీ సమీపంలో వివిధ కాలనీలకు చెందిన మురుగునీటిని కేసీ కాలువలో వదులుతున్నారు. రోజుకు సరాసరి 5 మిలియన్‌ లీటర్లు (ఎంఎల్‌డీ) మురుగునీరు కేసీలో కలుస్తోంది. అంటే.. కోటి లీటర్లు అన్నమాట. నెలకు 150 ఎంఎల్‌డీ చొప్పున ఏడాదికి దాదాపుగా 1,800 మిలియన్‌ లీటర్ల మురుగునీరు కేసీ కాలువలో కలుస్తున్నట్లు అంచనా. ప్రత్యేక పైపులైన్లు, డ్రైయినేజీలు ఏర్పాటు చేసి కాలువలో మురుగునీరు కలవకుండా చూడాల్సిన కార్పొరేషన్‌ ఇంజనీర్లు ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యం. ఇందుకు ప్రధాన కారణం నిధుల కొరతే అని తెలుస్తోంది.

 కలుషితం అవుతున్న సాగు, తాగునీరు

 తుంగభద్ర నదికి వరద చేరగానే సుంకేసుల  జలాశయం నుంచి కేసీ కాలువకు 2 వేల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కాలువ కింద ఉమ్మడి కర్నూ లు, కడప జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాల  ఆయకట్టు ఉంది. అంతేకాకుం డా పలు పట్టణాలు, గ్రామాలకు తాగునీరు అందుతోంది. నగర పాలక సంస్థ పాలకుల బాధ్యతారాహిత్యం కారణంగా మంచినీటి కాలువలో మురుగునీరు  విడుదల చేయడంతోపాటు  పాలిథిన్‌ వ్యర్థాలు డ్రైయినేజీల ద్వారా నేరుగా కాలువలో చేరుతున్నాయి. ప్లాస్టిక్‌లో ఉండే విషపూరిత రసాయనాల వల్ల కేసీ ప్రమాదభరితంగా మారింది.  మురుగునీటి ద్వారా వచ్చే ప్రమాదకర ఆర్సినిక్‌, కోలాల్ట్‌, నికెల్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌.. వంటి ప్రమాదకరమైన విషపదార్థాలు కలిసి సాగు, తాగునీరు కలుషితం అవుతున్నాయి. ఈ స్థితి మీద పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

పట్టించుకోని జలవనరుల శాఖ ఇంజనీర్లు

 నగరంలో కేసీ కాలువ 8.5 కి.మీలు ప్రవహిస్తోంది. దీని సంరక్షణ బాధ్యత జలవనరుల శాఖ ఇంజనీర్లదే. కేసీ కాల్వ గట్లు, విలువైన స్థలాలు కబ్జాకు గురి కాకండా సంరక్షించడంతో పాటు కాల్వలోకి మురుగునీరు కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నగరపాలక ఇంజనీర్లకు నోటీసులు జారీ మురుగునీరు చేరకుండా అడ్డుకట్ట వేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.


Updated Date - 2022-07-07T07:09:41+05:30 IST