వింటే కాసులు.. లేకుంటే కేసులు

ABN , First Publish Date - 2021-03-03T06:16:58+05:30 IST

ఇదీ.. నంద్యాల మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులకు అధికార పార్టీ అభ్యర్థుల నుంచి వస్తున్న ఆఫర్‌లు, బెదిరింపులు. ఒప్పుకుంటే క్యాష్‌.. లేదంటే కేస్‌..! ఎన్నికల రాజకీయంలో కొత్త కోణం ఇది.

వింటే కాసులు.. లేకుంటే కేసులు

  1. ఏకగ్రీవం కోసం అభ్యర్థుల టార్గెట్‌
  2. అభ్యర్థుల బంధువులపైనా ఒత్తిడి
  3. కొందరు అభ్యర్థుల అజ్ఞాతవాసం


‘పోటీలో ఎవరూ ఉండకూడదు. మేం ఏకగ్రీవం కావాలి. చెప్పిన మాట విని నామినేషన్‌ వెనక్కు తీసుకోండి. కావాల్సినంత క్యాష్‌ తీసుకోండి. లేదు.. పోటీలో ఉంటాం అంటారా..? కేసులకు సిద్ధంగా ఉండండి. మీ ఒక్కరినే కాదు. మీ ఇంట్లోవారిని, బంధువులను.. ఎవరు దొరికితే వారిని బుక్‌ చేస్తాం..’ 


నంద్యాల టౌన్‌, మార్చి 2: ఇదీ.. నంద్యాల మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులకు అధికార పార్టీ అభ్యర్థుల నుంచి వస్తున్న ఆఫర్‌లు, బెదిరింపులు. ఒప్పుకుంటే క్యాష్‌.. లేదంటే కేస్‌..! ఎన్నికల రాజకీయంలో కొత్త కోణం ఇది. అధికారపార్టీ నాయకులు కొందరు నేరుగా  నామినేషన్‌ వేసినవారి దగ్గరకు వెళుతున్నారు. ఒప్పించి.. లేదా బెదిరించి మరీ విత్‌ డ్రా చేయిస్తున్నారు. పోటీలో కొనసాగాలని నిర్ణయించుకున్న వారి బంధువుల్లో ఎవరైనా ఉద్యోగులు ఉంటే.. వారిని టార్గెట్‌ చేసి వేధిస్తున్నారు. ఎన్నికల బరి నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు తప్పుకుంటే రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆఫర్‌ చేస్తున్నారు. స్వతంత్రులకు స్థాయిని బట్టి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఇస్తామని అంటున్నారు. నంద్యాలలో ఈ బేరసారాలు, బెదిరింపులు జోరుగా సాగుతున్నాయి. ఒత్తిడి తట్టుకోలేనివారు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేవారకూ పట్టణాన్ని వదిలి అజ్ఞాతంలోకి వెళ్లుతున్నారు.


భారీగా నామినేషన్లు

నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 42 వార్డులు ఉన్నాయి. 373 మంది నామినేషన్‌ వేశారు. మొత్తం 1,86,365 మంది ఓటర్లు ఉన్నారు. అధికార పార్టీ అభ్యర్థులు అన్ని వార్డులలో కలిపి 119 మంది నామినేషన్లు వేశారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం నుంచి అన్ని వార్డులకు 106 మంది నామినేషన్‌ వేశారు. బీజేపీ నుంచి 17 వార్డులకు 26 మంది, జనసేన నుంచి మూడు వార్డుల కు ముగ్గురు, స్వతంత్రులు 86 మంది, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు 30 మంది, సీపీఎం తరపున ఇద్దరు, సీపీఐ తరపున ఇద్దరు నామినేషన్లు వేశారు.


కొన్ని గంటలే..

మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే గడువు ఉంది. అందుకే అధికార పార్టీ వర్గీయులు ప్రత్యర్థులను దారికి తెచ్చుకునే ప్రక్రియను వేగవంతం చేశారు.  ఈ కొన్ని గంటలు వారికి కనిపించకపోతే సరి అని.. కొందరు సెల్‌ స్విచ్ఛాఫ్‌ చేసి పట్టణం నుంచి మాయమయ్యారు.


తప్పుకోవాలని ఒత్తిడి

మున్సిపల్‌ ఎన్నికల బరిలో దిగినవారిపై అధికార పార్టీ నాయకుల మానసిక దాడి పెరిగింది. ఎలాగైనా పోటీ నుంచి తప్పించాలని ప్రయత్నిస్తున్నారు. కాసులు వల విసురుతున్నారు. కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నారు. అయినా దారికి రాకపోతే అభ్యర్థుల బంధువులపై ఒత్తిడి తెస్తున్నారు. వారి బంధువుల్లో ఉద్యోగులు ఉంటే.. వారిని  టార్గెట్‌ చేస్తున్నారు. దీంతో పలువురు ఉద్యోగులు పట్టణం వదలి వెళ్లుతున్నారు. చాలా మంది సెల్‌ ఫోన్లను స్వీచ్‌ ఆఫ్‌ చేసి, ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు సమాచారం. ప్రముఖుల నుంచి తమకు ఫోన్‌కాల్స్‌ వస్తే లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థుల బంధువులు అజ్ఞాతవాసానికి మొగ్గుచూపుతున్నారు. చాలామంది అభ్యర్థులను దారికి తెచ్చుకునేం దుకు వారి బంధువులపై ఉన్న పాత కేసులును బయటకు తీసి మరీ బెదిరిస్తున్నారు. ఈ వ్యవహారాలు పట్టణంలో చర్చనీయాం శంగా మారాయి. అధికారం కోసం మరీ ఇలా ప్రవర్తించడం ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇదిగో.. ఇలా ఒత్తిడి..

నంద్యాలలోని కీలక వార్డుకు చెందిన అధికార పార్టీ అభ్యర్థి ఏకగ్రీవం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఉపసంహరణకు తెలుగుదేశం అభ్యర్థి ఒప్పుకోకపోవడంతో ఉద్యోగి అయిన ఆయన తండ్రిని టార్గెట్‌ చేశారు. దారికి రాకపోతే ఆయనను సస్పెండ్‌ చేయిస్తామని బెదిరిస్తున్నట్లు తెలిసింది. 

19వ వార్డులో టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో ఏకగ్రీవం  కోసం మరో పార్టీకి చెందిన అభ్యర్థికి భారీగా డబ్బు ఆఫర్‌ చేసినట్లు తెలిసింది.

27, 36, 41 వార్డులకు చెందిన వివిధ పార్టీల అభ్యర్థులచేత నామినేసన్లను విత్ల్‌డ్రా చేయించడానికి అధికారపార్టీవారు ఒత్తిడి చేసినట్లు సమాచారం.

39వ వార్డుకు నామినేషన్‌ వేసిన టీడీపీ అభ్యర్థిని ఆదివారం కొందరు బెదిరించడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

పట్టణంలోని ఓ వార్డుకు నామినేషన్‌ వేసిన టీడీపీ అభ్యర్థిని టార్గెట్‌ చేశారు. బంధువులపై ఉన్న పాత కేసులను చూపించి బెదిరిస్తునట్లు తెలిసింది. ఉపసంహరించుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.

టీడీపీ తరుపున నామినేషన్‌ వేసిన ఒక అభ్యర్థిని స్థలం విషయంలో బెదిరించినట్లు సమాచారం.

8, 14, 15, 19, 22, 32 వార్టుల్లో అభ్యర్థుల చేతి నామినేషన్లను విత్‌ డ్రా చేయించడానికి అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

36వ వార్డు వైసీపీ అభ్యర్థి చైర్మన్‌ రేస్‌లో ఉన్నారు. దీంతో ఆ వార్డు ఎన్నికల బరిలో నిలిచిన ఇతర పార్టీల అభ్యర్థుల చేత విత్‌ డ్రా చేయించ డానికి భారీగా వరాలు ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది.


ఎంతకావాలో చెప్పండి..

ఎన్నికలల్లో గెలిచేందుకు ఒక్కొక్క అభ్యర్ధికి రూ.40 లక్షలు నుంచి రూ.60 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. అందుకే.. వార్డు ఎన్నికల బరి నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులను తప్పించడానికి బేరసారాలకు దిగుతున్నారు. టీడీపీ అభ్యర్థులను ఎన్నికల బరి నుంచి తప్పించడానికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇస్తామని బేరం పెట్టినట్లు తెలిసింది. బీజేపీ, జనసేన అభ్యర్థులను కూడా పోటీ నుంచి తప్పిం చడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీ అభ్యర్థులు విరమిం చుకోని వార్డులలో స్వతంత్ర, ఇతర పార్టీల అభ్యర్థుల మద్దతు కోసం రూ.లక్ష నుంచి రూ.2 లక్షల ఇచ్చేందుకు సిద్ధమని ఆఫర్‌ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 


మొదటి రోజు 221 నామినేషన్లు విత్‌డ్రా

కర్నూలు, మార్చి 2(ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం మొదలైంది. జిల్లాలో కర్నూలు కార్పొరేషన్‌, ఏడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఉన్నాయి. వీటన్నింటిలో 302 వార్డులుండగా.. మొదటి రోజు 221 నామినేషన్లు ఉపసంహరిం చుకున్నారు. కర్నూలు కార్పొరేషన్‌లో 52 వార్డులకు 22 మంది, నంద్యాల 42 వార్డులుండగా 41 మంది, ఎమ్మిగనూరులో 34 వార్డుల్లో 22 మంది, డోన్‌లో 32 వార్డులకు గాను 46 మంది, నందికొట్కూరులో 29 వార్డులకు 12 మంది, ఆళ్ళగడ్డలో 27 వార్డులుండగా 17 మంది, గూడూరులో 20 వార్డులుండగా నలుగురు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిటర్నింగ్‌ అధికారులకు తెలిపారు. ఆత్మకూరులో 36 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు


పార్టీల వారీగా ఉపసంహరణలు

ఉపసంహరణల్లో అధికంగా వైసీపీకి చెందినవే  ఉన్నాయి. వార్డుల్లో తమకు ఎక్కువగా పట్టు ఉందనుకున్న వారు, టికెట్‌ తమకే వస్తుందనుకున్న వారు నామినేషన్లు దాఖలు చేశారు. మరికొంత మంది రెబల్‌ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. అయితే ముఖ్య నాయకులు రెబల్‌ అభ్యర్థులను బుజ్టగించి ఎన్నికలయ్యాక తగిన ప్రాధాన్యమిస్తామని నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు. వైసీపీ 78 నామినేషన్లను విత్‌డ్రా చేసుకోగా, టీడీపీ 33, బీజేపీ 14, ఇండిపెండెంట్లు 41 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక జనసేన, కాంగ్రెస్‌, ఇతరులు 19 మంది నామినేషన్లను ఉపసంహరించుకు న్నారు. ఆళ్ళగడ్డలో 8, డోన్‌లో 12, నంద్యాలలో 4, నందికొట్కూరులో ఒక వార్డు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది

Updated Date - 2021-03-03T06:16:58+05:30 IST