ఎన్నికల హామీగా నగదు బదిలీ

ABN , First Publish Date - 2022-02-01T06:05:38+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలో ఓటర్లకు ఉచితాల హమీలను వర్షించడంలో రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. ప్రజలు ఇప్పటికే ఉచిత విద్యను పొందుతున్నారు...

ఎన్నికల హామీగా నగదు బదిలీ

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలో ఓటర్లకు ఉచితాల హమీలను వర్షించడంలో రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. ప్రజలు ఇప్పటికే ఉచిత విద్యను పొందుతున్నారు; రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ అందుబాటులో ఉంది. గృహిణులకు ఉజ్వల పథకం ద్వారా వంటగ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. మరి ఈ ఉచితాలు రాజకీయ పార్టీలకు నిజంగా ఓట్లనిస్తాయా? అదేమో గానీ, ప్రజలకు స్థిరమైన, దీర్ఘకాలిక ఆదాయాన్ని కల్పించేందుకు ఆ ఉచిత హామీలు ఏ మాత్రం తోడ్పడవు. గమనించవలసిన వాస్తవమేమిటంటే ఇది కృత్రిమ మేధ, రోబోల కాలం. ఈ అత్యాధునిక సాంకేతికతలు ఉద్యోగాలను హరిస్తున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీతో, ఉద్యోగాల కల్పవల్లులు అయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఉద్యోగాలు లేనప్పుడు ఆదాయాలు ఎలా సమకూరుతాయి? అలమటిస్తున్న అసంఖ్యాక ప్రజలకు కనీస సంక్షేమం సమకూర్చేందుకు నగదును ఉచితంగా పంపిణీ చేయవలసి ఉన్నది. అయితే ఈ వితరణకు అభ్యంతరాలు తక్కువేమీ కాదు.


పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీ ప్రభుత్వానికి మోయలేని ఆర్థిక భారమవుతుందనేది మొదటి ఆక్షేపణ. నగదును చెప్పుకోదగ్గ విధంగా పంపిణీ చేసేందుకు అవసరమైన ఆదాయం ప్రభుత్వానికి ఉన్నదా? ప్రభుత్వ వ్యయాలు మూడు రకాలుగా ఉంటాయి. అవి: నగదు పంపిణీ లేదా ధన రూపంలో కాకుండా వస్తు రూపంలో పంపిణీ; రెండు-– ప్రభుత్వ వినియోగం; మూడు– ప్రభుత్వ పెట్టుబడులు. నగదు బదిలీని ముమ్మరంగా జరిపితే ప్రభుత్వ వినియోగం లేదా ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించుకోవలసి ఉంటుంది. ప్రభుత్వ వినియోగం తగ్గిపోతే ఉచిత పంపిణీలు సులభసాధ్యమవుతాయి. ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోతే ఉచిత పంపిణీలు ఆచరణ సాధ్యం కావు. కనుక నగదు బదిలీ అన్ని విధాల అనుసరణీయం.


ఉచితాల పంపిణీ వల్ల పన్ను రాబడి దుర్వినియోగమవుతుందనేది రెండో అభ్యంతరం. నిజానికి పన్ను రాబడిలో అత్యధిక భాగం ఉన్నత వర్గాల వారి నుంచే లభిస్తుంది. పన్నుల ఆదాయాన్ని, ఉచితాల పంపిణీకి ఉపయోగించడమంటే సంపదను ధనికుల నుంచి పేదలకు బదిలీ చేయడమే. సంక్షేమ రాజ్య లక్ష్యం కూడా ఇదే కదా. కార్పొరేట్ సంస్థలు తమ లాభాలలో కొంత భాగాన్ని ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ కార్యక్రమాలకు వినియోగించాలని ప్రభుత్వం నిర్దేశిస్తోంది. అదే విధంగా ప్రభుత్వం కూడా తన పన్ను రాబడిలో కొంత భాగాన్ని ప్రజలకు ఉచితంగా అందించాలి. ఈ వితరణ ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ను నిర్వహించడం వంటిదే.


ఉచిత పంపిణీలకు సంబంధించి అసలు సమస్యేమిటంటే ఉచిత పంపిణీ ధన రూపంలో చేయాలా లేక వస్తు రూపంలో చేయాలా అనేదే ఉచిత పంపిణీలకు సంబంధించిన అసలు సమస్య. ఎరువులు, ఆహార ధాన్యాలపై సమకూర్చే సబ్సిడీలు వస్తు రూప పంపిణీ కిందకు వస్తాయి. నిర్దిష్ట సరుకుపై ఇచ్చే సబ్సిడీల వల్ల ప్రజలు ఆ సరుకును మరింత అధికంగా ఉపయోగించడానికి దోహదం చేస్తుందనేది వస్తు రూప పంపిణీ వెనుక ఉన్న భావన. ఉదాహరణకు 1960 దశకంలో వరుస కరువులతో దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకై ప్రభుత్వం ఎరువులపై రైతులకు సబ్సిడీలు కల్పించింది. ఈ రాయితీల వల్ల రైతులు మరింతగా ఎరువులను ఉపయోగించి అధిక దిగుబడులు సాధిస్తారనేది పాలకుల భావన. అలాగే ఉచిత విద్యను అందించడం వల్ల పేద తల్లిదండులు తమ పిల్లలను మరింత ఎక్కువగా పాఠశాలలకు పంపుతారని పాలకులు విశ్వసిస్తున్నారు. ఎరువులను విధిగా ఉపయోగించాల్సిన, పిల్లలను తప్పకుండా పాఠశాలలకు పంపాల్సిన ఆవశ్యకతను ప్రజలు గుర్తించకపోవడం వల్లే ఈ సబ్సిడీలు కల్పించాల్సిన అవసరమేర్పడిందనేది పాలకవర్గాల భావనగా ఉంది. ఇది పూర్తిగా తప్పుడు అభిప్రాయం, సందేహం లేదు. ప్రజలు మౌలికంగా వివేకవంతులు అని ప్రజాస్వామ్య దార్శనికత విశ్వసిస్తుంది. ఎవరిని ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలనే వివేకం ఉన్నవారు అధికోత్పత్తికి ఎరువులు తప్పక ఉపయోగించాలని, అలాగే పిల్లలకు భద్రమైన భవిష్యత్తును కల్పించేందుకై వారికి మంచి విద్యను సమకూర్చాలన్న వాస్తవాన్ని అర్థం చేసుకోలేరా?


1960లలో ప్రభుత్వం సబ్సిడీలు సమకూర్చకపోయినా రైతులు ఎరువులను ఉపయోగించి ఉండేవారని నేను గట్టిగా భావిస్తున్నాను. ఎరువుల వాడకం వల్ల దిగుబడులు పెరిగి అధికాదాయం వస్తుంది కనుక రైతులు తప్పకుండా ఎరువులను ఉపయోగించి ఉండేవారు. వస్తు రూపేణా సబ్సిడీలు కల్పించడానికి కారణం నిర్దిష్ట రీతిలో వ్యవహరించేలా ప్రజలను ప్రోత్సహించడమనేది కానే కాదు. అసలు కారణం ప్రభుత్వ ఉద్యోగులకు సమకూరే లబ్ధి. ఉదాహరణకు ఆహారధాన్యాల కొనుగోలు, నిల్వ, విక్రయంలోనూ, అలాగే ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించిన రేషన్ కార్డుల విషయంలోనూ ప్రభుత్వోద్యోగులకు అదనపు ఆదాయ అవకాశాలు సమృద్ధంగా ఉంటాయి. కనుక తమ ప్రయోజనాల కోసమే ఉచితాల పంపిణీని వస్తు రూపేణా జరపాలనేది ప్రభుత్వాధికారుల వాదన. వస్తు రూపేణా పంపిణీ చేయాలనే భావనకు స్వస్తి చెప్పి నగదు పంపిణీ చేయడం అన్ని విధాల శ్రేయస్కరం. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాకు నిర్దిష్ట మొత్తంలో నగదు బదిలీ చేస్తే ప్రజలు ఆ మొత్తాన్ని తమ అవసరాలకు వినియోగించుకుంటారు.


సమస్త ప్రజలకు సంక్షేమాన్ని సమకూర్చడానికి ఆదర్శ మార్గం ఆర్థికాభివృద్ధి నమూనాను మార్చి ఉద్యోగాలను పెద్ద సంఖ్యలో సృష్టించడమే. ఇది సాధ్యంకాని పక్షంలో ప్రజలకు నగదు పంపిణీ చేయాలి. ఆ మొత్తాన్ని తమ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకునేందుకు వారికి సాధికారత కల్పించాలి. వస్తురూపేణా పంపిణీ అనేది అంతిమ పరిష్కార మార్గం మాత్రమే. అయితే, ముందే చెప్పినట్టు, దీనివల్ల అధికంగా లబ్ధి పొందేది ప్రభుత్వోద్యోగులు మాత్రమే. ప్రజలకు నామమాత్ర ప్రయోజనాలే దక్కుతాయి. ఎన్నికల సమయంలో ల్యాప్‌టాప్‌లు, సైకిళ్ళు మొదలైనవి కాకుండా నగదును ఉచితంగా పంపిణీ చేస్తామనే హామీని అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వాలి. ప్రత్యక్ష నగదు బదిలీ మాత్రమే సరైన సంక్షేమ విధానం.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2022-02-01T06:05:38+05:30 IST