Advertisement

కుల కరోనా..!

Mar 21 2020 @ 00:00AM

ఇతర కులాల వారిలో కమ్మవారిపై ద్వేషాన్ని వ్యాపింపజేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు కూడా ఆ కులంవారిని అంటరానివారుగా చూస్తున్నారు. ఆ కులంపై కక్షతోనే రాజధాని తరలింపు నిర్ణయాన్ని తీసుకున్న ఆయన.. అంతటితో ఆగకుండా అడుగడుగునా వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ కమ్మవాడే కావొచ్చు గానీ చంద్రబాబుకు, ఆయనకు సరిపడదు. అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ కారణంగానే రమేశ్‌కుమార్‌ ఆ పదవిలో నియమితులయ్యారే గానీ చంద్రబాబు చాయిస్‌ కాదు. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, కమ్మవాళ్లు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారు. అయినా.. ఆ కులాలవారు నూటికి నూరు శాతం ఒకేలా ఉండరు. కొంతమంది రెడ్లు తెలుగుదేశం పార్టీకి, కొంతమంది కమ్మవాళ్లు వైసీపీకి ఓట్లు వేశారు. అది వారి ఇష్టం. అంత మాత్రాన తెలుగుదేశం పార్టీవారు రెడ్లను, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీవారు కమ్మవాళ్లను ద్వేషించడం సమంజసం ఎలా అవుతుంది?


నేను ముఖ్యమంత్రిని అయితే నన్ను అడ్డుకోవడానికి వీళ్లంతా ఎవరు? అన్నట్టుగా జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. అధికారుల్లో జంకు ఉంది గనుక సరిపోయింది గానీ, లేకపోతే హైకోర్టు ఆదేశాలను సైతం జగన్మోహన్‌రెడ్డి ధిక్కరించేవారు. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన కొన్ని ఆదేశాలను అమలు చేయడం లేదు. అయితే రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ భయపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అధికారం లేదు కనుక సరిపోయింది గానీ, లేకపోతే తన కంట్లో నలుసుగా మారిన హైకోర్టును కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రద్దు చేసి ఉండేవారేమో తెలియదు!


రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా ‘‘మీరు కమ్మవాళ్లయితే మీకు పని కాదు.. మాకు ఆ మేరకు ఆదేశాలున్నాయి’’ అని అధికారులు మొహమాటం లేకుండా చెబుతున్నారు. పాత బిల్లుల చెల్లింపు విషయంలో కూడా ఇదే వైఖరి! జగన్‌ సన్నిహితులు అనబడేవారిని ఆశ్రయించినా ‘‘మీకు బిల్లులు ఇవ్వకూడదని మా వాడు చెప్పాడు. అంతగా ప్రాధేయపడుతున్నారు కనుక 30 శాతం కమీషన్‌ ఇస్తే ప్రయత్నిస్తాం’’ అని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి రావలసిన బిల్లులను ఇప్పించడంలో సాయం చేయవలసిందిగా ఒక కమ్మ వ్యాపారి ఒక స్వామిని ఆశ్రయించగా.. ‘‘మీరు కమ్మవాళ్లు కదా? మీరంటే ముఖ్యమంత్రికి గిట్టదు. నేనేమీ సహాయం చేయలేను’’ అని మొహం మీదే చెప్పారట. ఇదీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి! తెలుగునాట ఇలా ఒక కులాన్ని టార్గెట్‌ చేయడం ఇదే ప్రథమం. తమ్మినేని సీతారాం అంటున్నట్టుగా రాష్ట్రానికి కమ్మ వైరస్‌ పట్టుకోలేదు.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే కమ్మ ద్వేషం అనే వైరస్‌ పట్టుకుంది.


‘‘మనమంతా ప్రజా సేవకులం.. ప్రజలు అధికారమిచ్చింది వారికి సేవ చేయడానికి మాత్రమే’’.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్న మాటలివి. పది నెలలు గడిచేసరికి ‘అధికారమంతా నాదే.. మరే ఇతర రాజ్యాంగబద్ధమైన సంస్థకు కూడా అధికారాలు ఉండవు’ అని హూంకరిస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రజలు తనకు అధికారమిచ్చారనీ, తన అధికారాన్ని మరెవ్వరూ ప్రశ్నించకూడదనీ, తాను ఏమి చేసినా చెల్లుతుందనీ ఆయన ఇప్పుడు విర్రవీగుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించడంతో జగన్మోహన్‌రెడ్డికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అహం దెబ్బతిన్న ఆయన రమేశ్‌కుమార్‌కు కులాన్ని ఆపాదించి మరీ తిట్టిపోయడమే కాకుండా ఆయన నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లి భంగపడ్డారు. వివాదం చిలికిచిలికి గాలి వానై, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందనీ, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలనీ రమేశ్‌కుమార్‌ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రితో పాటు స్పీకర్‌, మంత్రులు, శాసనసభ్యులు తనపై తీవ్ర విమర్శలు చేయడాన్ని రమేశ్‌కుమార్‌ తన లేఖలో గుర్తుచేశారు. స్థానిక ఎన్నికల సందర్భంగా విపక్షాలను కట్టడి చేసి తప్పుడు కేసులు పెట్టారనీ, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కూడా సక్రమంగా పనిచేయలేని పరిస్థితులు ఉన్నాయనీ ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్రం వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని సంజాయిషీ కోరడం జరిగింది. వాస్తవం ఇది కాగా, రమేశ్‌కుమార్‌ లేఖ రాయలేదనీ, ఎవరో ఆకాశరామన్న రాసిన లేఖను తెలుగుదేశం అనుకూల మీడియాలో ప్రసారం చేసి, ప్రచురించారనీ తొలుత వితండవాదం చేసిన జగన్‌ అండ్‌ కో ఆ తర్వాత ఆ లేఖ లీక్‌ కావడానికి కారకులెవరో గుర్తించి శిక్షించాలంటూ అర్థంపర్థంలేని వాదనలు చేసింది. ఈ మేరకు వైసీపీ నాయకులు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఊరూపేరు లేని లేఖలను మాత్రమే ఆకాశరామన్న లేఖలు అంటారు. అలాంటిది రమేశ్‌కుమార్‌ పేరిట ఆయన సంతకంతో ఉన్న లేఖను ఆకాశరామన్న లేఖ అని ప్రచారం చేయడం వైసీపీ నాయకులకే చెల్లుతుంది. రమేశ్‌కుమార్‌ లేఖ రాసిన విషయం వాస్తవమేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించడంతో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని స్థితిలో ఉన్న వైసీపీ నాయకులు.. ‘‘రమేశ్‌కుమార్‌ అలా ఎలా లేఖ రాస్తారు?’’ అంటూ తిట్ల దండకం మొదలెట్టారు. తప్పులు ఎత్తి చూపితే చాలు.. మీడియాను నిందించడం వారికి ఫ్యాషనైంది. ఈ విషయం అలా ఉంచితే, కేంద్ర ఎన్నికల కమిషన్‌ తరహాలోనే రాష్ట్రాల ఎన్నికల కమిషన్‌ వ్యవస్థను కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేశారు.


ఎన్నికల సమయంలో ఈ కమిషన్లు పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. ప్రభుత్వ అధికార యంత్రాంగమంతా ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వెళ్లిపోతుంది. అందరికీ తెలిసిన ఈ విషయం ముఖ్యమంత్రి, మంత్రులకు మాత్రం తెలియడం లేదు. ప్రజలు మాకు తిరుగులేని అధికారం ఇస్తే.. మధ్యలో మీరెవ్వరు? అని ప్రశ్నించడానికి తెగబడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ప్రభుత్వంలో భాగమని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తాజాగా సెలవిచ్చారు. విద్యా సంస్థలు నిర్వహిస్తున్న ఆయన పిల్లలకు ఇలాగే బోధిస్తున్నారేమో తెలియదు. రమేశ్‌కుమార్‌కు కమ్మ కులగజ్జి పట్టుకుందని తిట్టిపోసిన స్పీకర్‌.. ‘‘వెధవలకు పదవులు, గాడిదలకు కొమ్ములొచ్చినా ప్రమాదమే’’ అని కూడా అన్నారు. అయితే ఈ మాటలను ఎవరికి అన్వయించాలి అన్నదే ఇప్పుడు ప్రశ్న! రాష్ట్రస్థాయి ఎన్నికల కమిషన్‌పై ఒక రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా తిరుగుబాటు చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. స్థానిక ఎన్నికలు, సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల కమిషన్లు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయని రాజకీయ పార్టీలు విమర్శించడం కొత్త ఏమీ కాదు. అయితే ఎన్నికల కమిషనర్లకు కులాన్ని ఆపాదించే దుష్ట సంప్రదాయానికి ఇప్పుడే తెర తీశారు. గత ఏడాది సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు ఎన్నికల ప్రధానాధికారితోపాటు ఇంటెలిజెన్స్‌ డీజీని, చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్‌ బదిలీ చేసింది. అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ నేతల్లాగా దిగజారి ఎన్నికల కమిషన్‌పై నిందారోపణలు చేయలేదు. ఎన్నికల కమిషన్‌ స్వతంత్ర ప్రతిపత్తిని అప్పుడు పూర్తిగా వాడుకున్న జగన్‌ అండ్‌ కో ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కూడా అంతే స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందని అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ కూడా కొన్ని తప్పులు చేశారు.


ఎన్నికల తేదీలను తాను ప్రకటించక ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని అభ్యంతరపెట్టవలసింది. నామినేషన్ల దాఖలు సందర్భంగా ప్రతిపక్షాల అభ్యర్థులను అడ్డుకున్నప్పుడే చర్యలు తీసుకుని ఉండాల్సింది. నిష్పక్షపాతంగా వ్యవహరించని అధికారులను అప్పుడే బదిలీ చేసి ఉండాల్సింది. ఈ అంశాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఆయన ఆయా ఘటనలు జరిగినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియదు. అధికారులు తన అదుపులో లేరు అని భావించారేమో! సాధారణ ఎన్నికల సందర్భంగా తాము ఆదేశించినా, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావును బదిలీ చేయడంలో తాత్సారం చేసినందుకు అప్పటి సీఎస్‌ అనిల్‌చంద్ర పునేఠను కేంద్ర ఎన్నికల కమిషన్‌ బదిలీ చేసి ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. ఇప్పుడు కూడా రెండు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయాలనీ, ఒకరిద్దరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్‌ చేయాలనీ తాను జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమలుచేయకపోయినా ఎన్నికల కమిషనర్‌ మౌనంగా ఎందుకున్నారో తెలియదు. నిజానికి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పరిధిలోనే పనిచేయాలి. అయినా బహుశా ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా కాబోలు.. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రధాన కార్యదర్శి ఏకంగా ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఇలా చేయడం కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌కు విరుద్ధం. ఇందుకు పాల్పడిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చర్య తీసుకునే అధికారం కూడా ఎన్నికల కమిషన్‌కు ఉంటుంది. అలాంటిది ఎన్నికల కమిషనర్‌కు రక్షణ కల్పించడానికి కేంద్ర బలగాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో స్పష్టమవుతోంది. జగన్మోహన్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రులు వస్తారనే కాబోలు రాజ్యాంగ నిర్మాతలు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి వ్యవస్థకు చెక్‌ పెట్టే విధంగా ఏర్పాట్లు చేశారు. చట్టసభలలో ఆమోదించే చట్టాలను సైతం సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు కల్పించారు. ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అధికారం కూడా ఉన్నందున జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలను రాష్ట్ర హైకోర్టు అడ్డుకోగలుగుతున్నది. ఎన్నికల కమిషన్‌ పరిధి దాటి వ్యవహరించిన పక్షంలో సరిదిద్దే అధికారం కూడా న్యాయ వ్యవస్థకు కల్పించారు.


రాష్ట్ర ప్రభుత్వాలు అరాచకంగా వ్యవహరించే అవకాశం ఉంటుందన్న అనుమానంతోనే రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లకు కూడా పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో ఏ వ్యవస్థ కూడా తనకు తిరుగులేదని భావించడానికి వీలు లేకుండా రాజ్యాంగంలోనే కట్టుబాట్లు నెలకొల్పారు. న్యాయమూర్తులు అక్రమాలకు పాల్పడితే వారిని అభిశంసించే అధికారాన్ని పార్లమెంటుకు కట్టబెట్టారు. అదే సమయంలో పార్లమెంట్‌ నిర్ణయాలను సమీక్షించే అధికారాన్ని న్యాయ వ్యవస్థకు కల్పించారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వ్యవస్థల మధ్య అప్పుడప్పుడు ఘర్షణ చోటుచేసుకుంటూనే ఉంది. శాసనసభల స్పీకర్లకు ఎవరూ ఆదేశాలు జారీ చేయలేని వెసులుబాటు రాజ్యాంగంలో ఉంది. ఈ పరిస్థితిని పలు రాష్ట్రాల్లో దుర్వినియోగం చేస్తున్నందున సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చక్కదిద్దుతోంది. ఈ విషయాలన్నీ తెలిసినా వాటిని అంగీకరించడానికి ఇష్టపడని జగన్‌ అండ్‌ కో కనీస సంస్కారం లేకుండా ప్రవర్తిస్తోంది. నేను ముఖ్యమంత్రిని అయితే నన్ను అడ్డుకోవడానికి వీళ్లంతా ఎవరు? అన్నట్టుగా జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. అధికారుల్లో జంకు ఉంది గనుక సరిపోయింది గానీ, లేకపోతే హైకోర్టు ఆదేశాలను సైతం జగన్మోహన్‌రెడ్డి ధిక్కరించేవారు. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన కొన్ని ఆదేశాలను అమలు చేయడం లేదు. అయితే రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ భయపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అధికారం లేదు కనుక సరిపోయింది గానీ, లేకపోతే తన కంట్లో నలుసుగా మారిన హైకోర్టును కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రద్దు చేసి ఉండేవారేమో తెలియదు! స్థానిక ఎన్నికలను వాయిదా వేసినప్పుడు.. ‘‘రాష్ట్రంలో కరోనా వైరస్‌ లేదు. పారాసిటమాల్‌ వేసుకుని, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుకుంటే సరిపోయేదానికి ఎన్నికలు వాయిదా వేస్తారా?’’ అంటూ జగన్మోహన్‌రెడ్డి కన్నెర్రజేశారు. ఆయనకు తగ్గట్టే ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. జ్వరం వస్తే 650 గ్రాములు పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకొమ్మని డాక్టర్‌ పీవీ రమేష్‌ సెలవిచ్చారు. ఆ పరిమాణంలో పారాసిటమాల్‌ వేసుకుంటే మనుషులు చచ్చి ఊరుకుంటారు! ఇప్పుడు అదే ముఖ్యమంత్రి రాష్ట్రంలో సినిమా హాళ్లను, పాఠశాలలను, ఇతర సంస్థలను మూసివేయాలని ఆదేశించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా శాసనసభలో కరోనాకు పారాసిటమాల్‌ వేసుకుంటే సరిపోతుంది అని ప్రకటించి నవ్వులపాలయ్యారు. కొన్నింటిలో ఆయనను ఆదర్శంగా తీసుకునే జగన్‌ కూడా పారాసిటమాల్‌ మంత్రం పఠించారు. అదనంగా బ్లీచింగ్‌ పౌడర్‌ను జత చేశారు. కరోనా విషయంలో ఇంత హడావుడి పడుతున్న జగన్‌ అండ్‌ కో ఇదే వైరస్‌ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని ఎలా తప్పుబట్టగలరు? ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ వారిలో అహం కనిపిస్తోంది గానీ, పరిపక్వత మచ్చుకైనా కనపడటం లేదు. కరోనా కారణంగా మన దేశం మాత్రమే కాదు.. ప్రపంచమే హడలిపోతోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. ఈ తీవ్రతను అర్థం చేసుకోలేని జగన్మోహన్‌రెడ్డి తాను అనుకున్న సమయానికి ఎన్నికలు జరగకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. రాచరికంలో లేం’’ అన్న వాస్తవాన్ని గుర్తించడానికి కూడా జగన్‌ అండ్‌ కో సిద్ధంగా లేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ నవ్వులపాలవుతోంది.


కమ్మ ద్వేషం!

స్థానిక సంస్థల ఎన్నికలు ఇవ్వాళ కాకపోతే రేపు జరుగుతాయి. రాష్ట్రప్రభుత్వం మాత్రం తన నైజాన్ని బయటపెట్టుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి, ఆయన అనుయాయులకు కమ్మ కులస్థులపై ఏ స్థాయిలో ద్వేషం ఉందో ఈ ఉదంతంతో మరింత తేటతెల్లం అవుతోంది. ఇతర కులాల వారిలో కమ్మవారిపై ద్వేషాన్ని వ్యాపింపజేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు కూడా ఆ కులంవారిని అంటరానివారుగా చూస్తున్నారు. ఆ కులంపై కక్షతోనే రాజధాని తరలింపు నిర్ణయాన్ని తీసుకున్న ఆయన.. అంతటితో ఆగకుండా అడుగడుగునా వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ కమ్మవాడే కావొచ్చు గానీ చంద్రబాబుకు, ఆయనకు సరిపడదు. అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ కారణంగానే రమేశ్‌కుమార్‌ ఆ పదవిలో నియమితులయ్యారే గానీ చంద్రబాబు చాయిస్‌ కాదు. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, కమ్మవాళ్లు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారు. అయినా.. ఆ కులాలవారు నూటికి నూరు శాతం ఒకేలా ఉండరు. కొంతమంది రెడ్లు తెలుగుదేశం పార్టీకి, కొంతమంది కమ్మవాళ్లు వైసీపీకి ఓట్లు వేశారు. అది వారి ఇష్టం. అంత మాత్రాన తెలుగుదేశం పార్టీవారు రెడ్లను, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీవారు కమ్మవాళ్లను ద్వేషించడం సమంజసం ఎలా అవుతుంది? రెడ్డి కులానికి చెందిన జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో తీవ్రంగా విభేదించడం లేదా? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నలుగురు రెడ్లకు మంత్రి పదవులు ఇచ్చారు. ఏ కులానికి చెందినవారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కులానికి చెందినవారికి ఎంతో కొంత అధిక ప్రాధాన్యం లభించడం ఎప్పటినుంచో ఉంది. అంతెందుకు.. స్థానిక సంస్థల ఎన్నికలను రమేశ్‌కుమార్‌ వాయిదా వేయగానే ఎప్పుడో పదవీ విరమణ చేసిన తెలంగాణకు చెందిన రమాకాంత్‌రెడ్డిని పిలిపించుకుని జగన్మోహన్‌రెడ్డి మంతనాలు జరపలేదా? అలాగే అజేయ కల్లం చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కాలేదా? ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్‌లో కీలక పదవుల్లో ఉన్నవాళ్లు, జగన్‌ చుట్టూ ఉన్నవాళ్లంతా రెడ్లు కాదా? జగన్మోహన్‌రెడ్డికి తన కులం పట్ల అభిమానం ఉంటే ఉండవచ్చు గానీ, ఇతర కులాల వారిని ద్వేషించడం ఏమిటి? కమ్మవాళ్లు దేశద్రోహులు ఏమీ కాదే! రాష్ట్రాభివృద్ధిలో వారి కృషిని విస్మరించగలరా? కమ్మ కులానికి చెందిన ఎంతో మంది అభ్యుదయ భావాలు, వామపక్ష భావాలు కలిగి ఉండేవారు.


స్వాతంత్ర్యోద్యమ సమయంలో జైళ్లకు వెళ్లారు. ఆస్తులను విరాళంగా ఇచ్చారు. ఒకప్పటి కమ్యూనిస్ట్‌ పార్టీ అగ్ర నేతలు చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య స్వతహాగా భూస్వాములు అయినప్పటికీ అన్నీ వదులుకుని కమ్యూనిస్ట్‌ ఉద్యమం కోసం పాటుబడ్డారు. పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి వంటివారు కూడా ఈ కోవలోకే వస్తారు. నక్సల్బరీ ఉద్యమంలో కూడా ఎంతోమంది కమ్మవాళ్లు అగ్రభాగాన నిలిచి ప్రాణాలొడ్డి పోరాడారు. కమ్మవాళ్లు కష్టపడతారు. ఆస్తులను పెంచుకుంటారు. వ్యాపార సంస్థలు, పరిశ్రమలు నెలకొల్పి ఎంతో మందికి, ఎన్నో కులాల వారికి ఉపాధి కల్పించారు. ‘‘కమ్మవాళ్లని ద్వేషించడం ఎందుకు? వాళ్లకు పది లక్షలు ఇస్తే.. ఆ మొత్తాన్ని పది కోట్లకు పెంచుతారు’’ అని ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. అంతెందుకు.. దివంగత రాజశేఖర్‌రెడ్డి కూడా ఒక సందర్భంలో కమ్మ కులానికి చెందిన ఒక డాక్టర్‌తో మాట్లాడుతూ.. ‘‘మీవాళ్లు ఐదారు శాతం లాభం వచ్చినా సంతృప్తిపడతారు. కష్టపడతారు. అందుకే ప్రైవేట్‌ ఆసుపత్రులను మీరు మాత్రమే నడపగలరు. మా రెడ్లకు ఐదారు శాతం లాభం వచ్చినా వ్యాపారం వర్కవుట్‌ కాదు. సంతృప్తి ఉండదు. ప్రతాప్‌రెడ్డి అపోలో ఆసుపత్రి ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు’’ అని అభిప్రాయపడ్డారు. అలా భావించిన రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా కమ్మవాళ్లను రోహింగ్యాల కంటే హీనంగా చూస్తున్నారు. చంద్రబాబు హయాంలో కొన్ని పదవులలో నియమితులైన వారిని రాజీనామా చేయాలని వేధిస్తున్నారు. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఉదయభాస్కర్‌కు కూర్చోవడానికి సీటు కూడా లేని పరిస్థితి కల్పించారు. ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ దామోదరనాయుడు రాజీనామా చేయడానికి నిరాకరించినందున ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. ‘‘మీరు రాజీనామా చేస్తే మా వాళ్లను వేసుకుంటాం’’ అంటూ ఎంతో మందిని వేధిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ను ‘‘కమ్మ కులగజ్జి వెధవ..’’ అని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి దూషించగా, ‘‘రాష్ట్రానికి కరోనా వైరస్‌ సోకిందా? కమ్మ వైరస్‌ సోకిందా?’’ అని స్పీకర్‌ పదవిలో ఉన్న తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. తన మాదిరిగానే రమేశ్‌కుమార్‌ కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారనే విషయాన్ని తమ్మినేని విస్మరించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కులం పేరు పెట్టి విమర్శలు చేయడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. రెడ్లను ఏదో అన్నాడని జన సేనాని పవన్‌కల్యాణ్‌ నాలుక కోస్తామని రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు క్షణం ఆలస్యం చేయకుండా హెచ్చరించారు. కమ్మ కులం వారిని పోలీసు శాఖలో వేధిస్తున్నా, ఇతర స్థానాల్లో ఉన్న అధికారులను మానసికంగా కుళ్లబొడుస్తున్నా కమ్మ సంఘాలు మాత్రం నోరు మెదపలేదు. అది సంస్కారమో, పిరికితనమో తెలియదు.


ఆస్తులపై అంతులేని మమకారం ఉంటుంది కనుకే కమ్మవాళ్లు ఎన్ని అవమానాలనైనా భరిస్తారు అని అంటారు. కమ్మవాళ్లు ఎంతకైనా దిగజారతారు అని చెప్పడానికే వల్లభనేని వంశీ, కరణం బలరామ్‌ వంటి వారిని పార్టీలో చేర్చుకున్నామని వైసీపీకి చెందిన రెడ్డి నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిలో కమ్మ ద్వేషం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి మరో ఉదాహరణ! ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులకు ఉన్న భద్రతను.. తాను అధికారంలోకి రాగానే జగన్‌ ఉపసంహరించడం. దీనిపై కేంద్ర హోం శాఖ అధికారులు రాష్ట్ర డీజీపీకి తలంటారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి వంటి పదవులలో ఉన్నవారి కుటుంబసభ్యులకు కూడా భద్రత కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులకు మాత్రం ఇప్పటికీ భద్రత కల్పించలేదు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా ‘‘మీరు కమ్మవాళ్లయితే మీకు పని కాదు.. మాకు ఆ మేరకు ఆదేశాలున్నాయి’’ అని అధికారులు మొహమాటం లేకుండా చెబుతున్నారు. పాత బిల్లుల చెల్లింపు విషయంలో కూడా ఇదే వైఖరి! జగన్‌ సన్నిహితులు అనబడేవారిని ఆశ్రయించినా ‘‘మీకు బిల్లులు ఇవ్వకూడదని మా వాడు చెప్పాడు. అంతగా ప్రాధేయపడుతున్నారు కనుక 30 శాతం కమీషన్‌ ఇస్తే ప్రయత్నిస్తాం’’ అని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి రావలసిన బిల్లులను ఇప్పించడంలో సాయం చేయవలసిందిగా ఒక కమ్మ వ్యాపారి ఒక స్వామిని ఆశ్రయించగా.. ‘‘మీరు కమ్మవాళ్లు కదా? మీరంటే ముఖ్యమంత్రికి గిట్టదు. నేనేమీ సహాయం చేయలేను’’ అని మొహం మీదే చెప్పారట. ఇదీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి! తెలుగునాట ఇలా ఒక కులాన్ని టార్గెట్‌ చేయడం ఇదే ప్రథమం. తమ్మినేని సీతారాం అంటున్నట్టుగా రాష్ట్రానికి కమ్మ వైరస్‌ పట్టుకోలేదు.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే కమ్మ ద్వేషం అనే వైరస్‌ పట్టుకుంది. ‘కులం కాదు.. గుణం ముఖ్యం’ అని పెద్దవాళ్లు చెప్పేవారు. గుణం లేనివాడే ‘కులం.. కులం..’ అని కలవరిస్తుంటాడు!


ఆర్కే

 యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.