అంత్యక్రియల్లోనూ కులవివక్ష‌!

ABN , First Publish Date - 2022-05-12T09:26:23+05:30 IST

‘‘నిచ్చెనమెట్ల సమాజంలో అట్టడుగున ఉన్న దళితులకు అంత్యక్రియలు చేసుకోవటానికి కూడా తగిన స్థలాలు లేవన్నది కాదనలేని కఠోర నిజం. ఇంకా దారుణం– ఆ ‘అంత్యజుల’ శవయాత్ర ‘తమ దారి’లో, తమ భూములగుండా...

అంత్యక్రియల్లోనూ కులవివక్ష‌!

‘‘నిచ్చెనమెట్ల సమాజంలో అట్టడుగున ఉన్న దళితులకు అంత్యక్రియలు చేసుకోవటానికి కూడా తగిన స్థలాలు లేవన్నది కాదనలేని కఠోర నిజం. ఇంకా దారుణం– ఆ ‘అంత్యజుల’ శవయాత్ర ‘తమ దారి’లో, తమ భూములగుండా వెళ్ళటానికి అగ్రకులాలవారు అనుమతించకపోవటం’’. ఇవి, 2021 డిసెంబర్‌లో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆర్. మహదేవన్ వెలువరించిన ఒక తీర్పులోని మాటలు. చావులో కూడా ఈ అసమానతలు, వివక్ష ఏమిటి? అని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.


మద్దూరు గ్రామ అరుంధతీయులకు (ఎస్సీ) ‘ప్రత్యేక’ శ్మశానవాటిక ఏర్పాట్లకై 2021 జూన్ 15న ఆదేశాలు జారీచేశామని, దగ్గరలో తగిన ప్రభుత్వ భూమి లభించలేదని, సేకరిస్తామని, అవసరమైతే ప్రైవేటు భూమినైనా కొంటామని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకి తెలియజేసింది. దీనికి జస్టిస్ మహదేవన్ సమ్మతించలేదు. ‘చావులోనూ వివక్షా? ప్రభుత్వభూముల్లో కులమతాలకు అతీతంగా, వివక్ష లేకుండా, ఊరుమ్మడి భూముల్లో ఏర్పాట్లు రాజ్యాంగ సూత్రాల నిర్దేశమూ, ప్రభుత్వ బాధ్యత కూడా’ అని జస్టిస్ మహదేవన్ నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకంగా పది సూచనలు చేశారు. రాష్ట్రమంతటా శ్మశానవాటికల్లో ‘ఇది ఫలానా కులానికి చెందినది’ అన్న బోర్డులను తొలగించాలన్నది మొదటిది. ‘అన్ని కులాలవారినీ ఎలాంటి వివక్షా లేకుండా ఉమ్మడిగా మొత్తం శ్మశానవాటికలో అనుమతించాల’ని ఆయన సలహా ఇచ్చారు. అలాంటి ఉమ్మడి (కామన్) వసతులను అన్ని గ్రామాల్లో నిర్మించి నిర్వహించాలని జస్టిస్ మహదేవన్ స్పష్టం చేశారు.


ప్రాథమిక హక్కుల్లో (ఆర్టికల్ 14, 15, 25) ఇవి ఉన్నాయని, ఫలాన కులంవారు నిర్వహిస్తున్నారనే పేరిట కూడా ఇతరులను అనుమతించకపోవటం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందనీ, భవిష్యత్తులో ఇటువంటి వివక్ష కొనసాగరాదని జస్టిస్ మహదేవన్ నొక్కి చెప్పారు. గతంలో కొన్ని కేసుల్లో ఆ మేరకు తీర్పులు (ఇవీ మద్రాస్ హైకోర్టు ఇచ్చినవే) ఉన్నా అమలుచేయటం లేదని ఆయన అన్నారు. ఆ తీర్పులు ఏమిటో కూడా ఆయన పేర్కొన్నారు. వేర్వేరు శ్మశానవాటికలకు స్వస్తి పలకాలని, కనీసం ‘ఇహలోకం నుంచి వెళ్లిపోయేటప్పుడైనా ఐక్యత, సమానత్వం’ ఉండాలనీ, భవిష్యత్తులోనైనా వేర్వేరు షెడ్ల కేటాయింపు ఉండరాదనీ, ‘ఉమ్మడి’ ఏర్పాటు ఉండాలని లోగడ మధురై (నగర) కార్పొరేషన్‌కు ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ మహదేవన్ ఉటంకించారు.


మద్దూరు గ్రామం కేసులో ఎస్సీలైన ‘అరుంధతీయులు’ స్వయంగా కోర్టుకి రాలేదని, ఆ దుస్థితిని కూడా రికార్డు చేయాలని న్యాయమూర్తి అన్నారు. తమ ప్రైవేటు భూమి అని అడ్డు చెప్పినవారు వేసిన కేసు అది. రాజ్యాంగపరంగానే కాక, సామాజికశాస్త్ర పరిధిలో కూడా పరిశీలించాల్సిన అవసరముందని అన్నారు. ‘పుటక నుంచి చావుదాకా ప్రతి జీవనరంగంలోనూ సమాన గౌరవం, డిగ్నిటీ అన్నవి అందరి హక్కు’ అని ఆయన నొక్కి చెప్పారు. ఈ హక్కులు చనిపోయాక, శవయాత్రకూ వర్తిస్తాయని తీర్పులో పేర్కొన్నారు. ఈ శవయాత్ర ప్రస్తావనకు పూర్వరంగం మద్రాస్ హైకోర్టే వెలువరించిన మరో తీర్పులోనే ఉన్నది. 2019 ఆగస్టు 17న వెల్లూరు జిల్లా వనియంబాడి గ్రామ దళితులు 45ఏళ్ల కుప్పన్ పాడెను తాళ్లతో కట్టి వంతెన మీంచి కింది నదిలోకి దించుతున్న వీడియో వైరల్ కావటంతో ఆ కేసు పిఐఎల్ రూపంలో మద్రాసు హైకోర్టు ముందుకి వచ్చింది. అటూ ఇటూ ఉన్న సవర్ణ హిందువులు దళితుల శవాలను తమ భూముల గుండా పోనివ్వరని, తమ శ్మశానవాటికకు చేరుకోవటం గత 20ఏళ్లుగా కష్టంగా తయారైందని దళితులు చెప్పారు.


ఇలా పాడెను వంతెన మీంచి దించటం ఏళ్ల తరబడిగా సాగుతున్నదని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అలాటి పరిస్థితి ఏమీలేదనీ, కొందరి పట్టా భూములు దారిలో ఉన్నాయని, అడిగితే వారైనా సమ్మతించి దారి ఇచ్చేవారేనని ప్రభుత్వం కోర్టులో చెప్పింది. అదే నిజమైతే పాడెను అలాదించటమెందుకని జస్టిస్ మణికుమార్, జస్టిస్ సుబ్రమణ్యస్వామిలతో కూడిన బెంచి ప్రశ్నించింది. నిజానికి అగ్రకులాలవారు తమ భూముల పక్కనున్న దారిని కూడా దురాక్రమించారని దళితులు వెల్లడించారు. ఆ గ్రామ దళితుల కోసం ‘వేరే’ ప్రభుత్వ భూమిని కేటాయించామని తహసిల్దారు కోర్టులో చెప్పటంతో ప్రభుత్వ భూమిలోనే వివక్ష ఏమిటని కోర్టు ప్రశ్నించింది. జవాబు లేదు. అది ఊరుమ్మడి భూమేననీ, ఆ దారి తరతరాలుగా తాము నడిచిందేనని, దానికి ఇటీవలి కాలంలోనే ఫెన్సింగు కట్టారని; వాటిని తప్పించుకుంటూ చుట్టూ తిరిగి, శవాల్ని వంతెన మీంచి దింపుతామని మృతుడి బంధువులు చెప్పారు. 15ఏళ్ల కిందటిదాకా  –ఈ వంతెన రాకముందు – శవాల్ని నీళ్లలో వదిలేసే వారమని, ఇప్పుడు వంతెనమీంచి దింపి పాతిపెడుతున్నామని చెప్పారు. ‘చాలా ఏళ్లుగా మాకు పరిష్కారం చూపమని అధికారులను కోరుతున్నా’ సమస్య అలాగే ఉందని అన్నారు. గ్రామ శ్మశానంలో చోటులేక, పాలారు నది తీరంలో నాలుగేళ్లుగా ఇదే చేస్తున్నామన్నారు.


స్థానిక పోలీసు అధికారి ఒకరు సూటిగా చెప్పారు. ‘ఈ ప్రాంతంలో సవర్ణులు – ముఖ్యంగా వెల్లాలగౌండర్లు, వన్నియార్లు  –తమ భూముల మధ్య నుంచి పంచముల శవయాత్రను అనుమతించర’ని విలేఖర్లతో అన్నారు. తమిళనాడు ప్రభుత్వం కులవివక్షను కప్పిపుచ్చటానికి కోర్టులో బుకాయించిందన్నది స్పష్టమే. ఇదే కాదు. వందలాది దళిత యువకుల పరువుహత్యలనూ లెక్కల్లోకి రాకుండా ఇలాగే కప్పిపుచ్చారు. అవి పత్రికల్లోనే కాదు, ప్రభుత్వ క్రైం లెక్కల్లోనూ కన్పించవు. డజన్లలో హత్యలున్నప్పుడు సైతం నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరోలో తమిళనాడు నుంచి ఒక్క కేసూ నమోదు కాలేదు. 


మదురై జిల్లాలో 2012లో జరిపిన ఒక సర్వేలో 83శాతం గ్రామాల్లో – (149గ్రామాల్లో) 463 టీషాపుల్లో దళితులకు వేరే గ్లాసు– రెండు గ్లాసుల పద్ధతి – కొనసాగుతున్నదని తేలింది. ఈ పద్ధతి నేరమని 2011 ఏప్రిల్‌లో హైకోర్టు తీర్పులో చెప్పిన తర్వాత ఈ సర్వే నిర్వహించారు. ఇంకా వాటిల్లో ఇతర వివక్షలూ ఉన్నాయి. జస్టిస్ రమణ చెప్పినట్టు కోర్టుతీర్పులున్నా ‘ఆత్మగౌరవ ఉద్యమ’ ప్రభుత్వాలే అమలుచేయని పరిస్థితి ఉంది. ఇదొక ఉదాహరణ మాత్రమే. తీర్పులు అమలుకావు.. అందుకే వివక్షలో, ఇలాటి హత్యాకాండలో తమిళనాడు ప్రభుత్వాలు పాలుపంచుకోటం గురించి బయటపెట్టాలని హక్కుల ఉద్యమనేత ఆనంద్ తెల్తుంబుడే దశాబ్దం క్రితమే పిలుపునిచ్చారు.


బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం పేరిట నేటికీ సవర్ణులు ‘గాలిలో యుద్ధం’ చేస్తున్నా, బ్రాహ్మణేతర ఫ్యూడలు వర్గాల, పెత్తందార్ల దాష్టీకాలనూ, కులవివక్షనూ ప్రశ్నించే గొంతులు దాదాపు లేకుండా పోయాయి. అలాంటి శక్తులతో – ఉభయ ద్రవిడపార్టీలు ఎన్నికల కూటములు కడుతున్నాయి. పీఎంకే నేత రామదాస్ యుపిఏ, ఎన్‌డిఏ ప్రభుత్వాలు రెండిటా కేంద్రమంత్రి అయ్యారు. పెరియార్‌ని జపిస్తూ విగ్రహపూజలు, సామాజిక న్యాయం పేరిట ఉపన్యాసాలు ఒకవైపు, బాల్యం నుంచి చావుదాకా బాహాటంగా కులవివక్షలు, కులహత్యలు మరోవైపు.. తమిళనాడులో సర్వసామాన్యమయ్యాయి. మతం మారినా ఇవి తప్పటం లేదు. తిరుచిరాపల్లి నగర క్రైస్తవ శ్మశానవాటికలో దళితుల విభాగాన్ని వేరుచేస్తూ 60ఏళ్ల క్రితం కట్టిన గోడే అందుకు ప్రత్యక్ష సాక్షి.

యం. జయలక్ష్మి

Read more