Sameer Wankhede: పుట్టుకతో ముస్లిం కాదంటూ క్లీన్ చిట్

ABN , First Publish Date - 2022-08-13T21:15:28+05:30 IST

నకిలీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారన్న కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో..

Sameer Wankhede: పుట్టుకతో ముస్లిం కాదంటూ క్లీన్ చిట్

ముంబై: నకిలీ కుల ధ్రువీకరణ పత్రం (Fake caste certificate) సమర్పించారన్న కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు ఊరట లభించింది. ఆయనకు క్యాస్ట్ స్క్రూటినీ కమిటీ (caste scrutiny committee) క్లీన్ చిట్ ఇచ్చింది. నకిలీ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. దీనిపై విచారణ జరిపిన ప్యానల్ ఆయన పుట్టుకతో ముస్లిం కాదని, హిందూ దళిత కమ్యూనిటీకి చెందిన మహర్ వర్గానికి చెందిన వారని చెప్పింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వ సమాజిక న్యాయ శాఖ శుక్రవారంనాడు ఆదేశాలు జారీ చేసినట్టు ఒక అధికారి తెలిపారు.


సత్యమేవ జయతే..

పుట్టుకతో తాను ముస్లిం కాదంటూ క్యాస్ట్ స్క్రూటినీ కమిటీ తనకు క్లీన్ చిట్ ఇవ్వడంపై వాంఖడే సంతోషం వ్యక్తం చేశారు. ''సత్యమేవ జయతే'' అంటూ ట్వీట్ చేశారు. వాంఖడేపై వచ్చిన ఫిర్యాదులపై ముంబై జిల్లా క్యాస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కమిటీ సమీక్షించి, అదే రోజు ఉత్తర్వులు జారీ చేసింది. వాంఖడే, ఆయన తండ్రి జ్ఞాన్‌దేవ్ వాంఖడే హిందూయిజాన్ని విడిచిపెట్టి ఇస్లాంలోకి మారలేదని, వీరిరువురూ షెడ్యూల్డ్ కులానికి చెందిన వారని, మెహర్-37 వర్గంలోకి వస్తారని ఆ ఆదేశాల్లో కమిటీ పేర్కొంది. నవాబ్ మాలిక్, తదితరులు చేసిన కులం ఫిర్యాదులో ఎలాంటి నిజం లేనందున ఫిర్యాదును తోసిపుచ్చుతున్నట్టు స్పష్టం చేసింది.


 ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి అయిన వాంఖడే కులం ప్రస్తావనను మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ గతంలో లేవనెత్తారు. మాలిక్‌తో పాటు, మనోజ్ సాన్సరె, అశోక్ కాంబ్లె, సంజయ్ కాంబ్లే తదితరులు ఈ ప్రశ్నను లేవనెత్తారు. కాగా, 2021 అక్టోబర్‌లో ముంబై క్రూయిజ్‌పై ఎన్‌సీబీ దాడులు జరపడంతో వాంఖడే పేరు ఒక్కసారిగా ప్రచారంలోకి వచ్చింది. ఈ దాడుల్లో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్, మరో 19 మందిని అరెస్టు చేయడంతో పాటు మాదకద్రవ్యాలను సైతం స్వాధీనం చేసుకుంది. ఆ తదనంతర క్రమంలో ఆర్యన్ ఖాన్‌కు ఎన్‌సీబీ క్లీన్‌చిట్ ఇచ్చింది.

Updated Date - 2022-08-13T21:15:28+05:30 IST