ధాన్యం కొనుగోలు తిప్పలు

ABN , First Publish Date - 2022-04-24T07:18:47+05:30 IST

జిల్లాలో దాన్యం కొనుగోలు వ్యవహారం రైతులకు కొత్తచిక్కులు తెచ్చి పెట్టే అవకాశం ఉందంటున్నారు.

ధాన్యం కొనుగోలు తిప్పలు
లక్ష్మణచాంద మండలం చామన్‌పెల్లి గ్రామంలో ధాన్యంను ఆరబోసిన రైతులు

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై  రైతులకు దడ 

వెంటాడుతున్న వాతావరణం 

గోనెసంచులు, గిడ్డంగుల కొరతతో చిక్కులు 

ఇప్పటి వరకు స్పష్టత లేని విధానం

సకాలంలో పూర్తవుతుందా అని సందేహాలు

నిర్మల్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో దాన్యం కొనుగోలు వ్యవహారం రైతులకు కొత్తచిక్కులు తెచ్చి పెట్టే అవకాశం ఉందంటున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ఇటీవలే స్పష్టతనిచ్చిన నేపథ్యంలో సం బంధిత అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టింది. అయితే జిల్లాలో ధాన్యం కోతలు పూర్తిస్థాయిలో మొదలుకానప్పటికీ సంబంధిత పౌరసరఫరాలశాఖ అధికారులు మాత్రం కొనుగోళ్లకు సంబంధించిన ఏ ర్పాట్లను చేపట్టారు. దీని కోసం గాను జిల్లా అంతటా 196 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే వరికోతలు మొదలుకావడంతో ధాన్యం నిల్వలు కల్లాలకు చేరుకొని అక్కడి నుంచి కొనుగోలు కేంద్రాలకు రానున్నాయి. దీంతో అధికారులు గిట్టుబాటు ఽధర కల్పిస్తూ జిల్లావ్యాప్తంగా 196 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన పర్యటన సందర్భంగా ధాన్యం కొనుగోళ్లను చేపడతామం టూ హామీ సైతం ఇచ్చారు. కాగా ఇప్పుడిప్పుడే కోతలు మొదలై ధాన్యం నిల్వలు కల్లాలకు చేరుకుంటున్నాయి. ఒకటి రెండురోజుల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి జిల్లావ్యాప్తంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రక్రియను ప్రారంభించనున్నారు. అయితే ఈ సారి జిల్లాలో కేవలం 62 వేల ఎకరాల్లో మాత్రమే వరిధాన్య సాగుచేశారు. 1.50 లక్షల యంటీఎస్‌ల ధాన్యం దిగుబడి రావచ్చని అధికారులు స్పష్టం చేశారు. అయితే రెండు, మూడురోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిరానున్న నేపథ్యంలో సంబంధిత యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు సైతం చేపడుతోంది. ధాన్యాన్ని పకడ్భందీగా కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు తరలించాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో ఇప్పటి వరకు గోనెసంచులు పూర్తిస్థాయిలో చేరుకోలేదు. జిల్లా వ్యాప్తంగా 38 లక్షల గోనెసంచులు అవసరం కాగా ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ వద్ద కేవలం 4 లక్షల గోనెసంచులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో 34 లక్షల గోనెసంచులు అవసరం కానున్నాయంటున్నారు. దీంతో పాటు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగానే ఈ కొనుగోలు చేసిన ఽధాన్యాన్ని జిల్లాలో భద్రపర్చేందు కోసం తగిన సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోవడం ఇబ్బందులకు కారణం కానుందంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం వేర్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలోని 38 గోదాములు మొన్నటి ఖరీఫ్‌ పంటలతో నిండిపోయి ఉన్నాయి. అయితే ప్రస్తుతం కొనుగోలు చేసే ధాన్యాన్ని నిల్వచేయడం కష్టతరం కాబోతుందంటున్నారు. ప్రస్తుతం గోదాముల కొరత, గోనెసంచుల కొర త వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను ఇబ్బందులకు గురి చేసే అవకా శం ఉందంటున్నారు. 

కీలకశాఖల దృష్టి ఽధాన్యం కొనుగోళ్లపైనే

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సన్నద్దం చేస్తున్న అధికార యం త్రాంగమంతా ఇక ఈ ప్రక్రియను సక్సెస్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది. జిల్లాలో 196 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో పా లిథీన్‌ కవర్లతో పాటు ప్యాడిక్లీనర్‌లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. వ్యవసాయశాఖతో పాటు మార్కెటింగ్‌శాఖ, రెవెన్యూ, పోలీసుశాఖలు సమిష్టిగా ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాన్ని పరిశీలించనున్నాయంటున్నారు. అధికారులు ధాన్యం కొనుగోళ్లను విజయవంతం చేసి తరుచుగా వస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని భావిస్తున్నాయంటున్నారు. 

గోనెసంచులు, గోదాములే సమస్య

ఒకటి రెండురోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశాలున్న కారణంగా యంత్రాంగం ఆ దిశగా దృష్టి కేంద్రీకరిస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్భందీ చర్యలు చేపట్టింది. కాగా ధాన్యం కొనుగోలు వ్యవహారంతో గోనెసంచులు, గోదాముల కొరత కొనుగోలు ప్రక్రియపై ప్రభావం చూపే ప్రభావం ఉందంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 196 కొనుగోలు కేంద్రా లకు గాను 38 లక్షల గోనెసంచులు అవసరం కాగా కేవలం 4 లక్షల గోనెసంచులు మాత్రమే అందుబాటులో ఉండడం ఆందోళన కలిగిస్తోం ది. మరో 34 లక్షల గోనెసంచులు అవసరం కానున్నాయంటున్నారు. కొనుగోలు ప్రక్రియ ప్రారంభం అయ్యేలోగా ఇంత పెద్దమొత్తంలో గోనె సంచులను అందుబాటులో ఉంచడం సంబంధిత అధికారులకు ప్రాణసంకటంగా మారనుందంటున్నారు. దీంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ ఉంచడం కూడా యంత్రాంగానికి సవాలుగా మారుతోంది. ప్రస్తుతం జిల్లాలో 30 గోదాములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ గోదాముల్లో గత ఖరీఫ్‌, రబీలకు సంబంధించిన పంటలను నిల్వ చేయడంతో ఎక్కడా కూడా ఖాళీగా లేకపోవడం సమస్యకు కారణం కానుందంటున్నారు. గోదాములన్నీ నిండిపోవడంతో ప్రస్తుతం కొనుగోలు చేసే ధాన్యాన్ని ఎక్కడ నిల్వ ఉంచాలనే అంశం చర్చకు కార ణం కానుందంటున్నారు. 

వెంటాడుతున్న వాతావరణ పరిస్థితులు

వరిధాన్యం కొనుగోలు ప్రక్రియపై వాతావరణ పరిస్థితులు తీవ్రప్రభావం చూపే అవ కాశం ఉంది ఇప్పుడిప్పుడే వరికోతలు మొదలవుతున్నాయి. ఈ  క్రమంలో వర్షాలు కురుస్తుండడం రైతాంగాన్ని బెంబెలేత్తిస్తోంది. ఒక రోజు ఎండ తీవ్రత పెరగడం, మరో రోజు వర్షం కురియడం, వాతావరణం చల్లబడడం లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో దాన్యాన్ని ఆరబెట్టే విషయంలో ఆందోళనకు లోనవుతున్నారు. ప్రకృతి వైఫరీత్యాల కారణంగా ఏ నిమిషం ఏం జరుగుతుందోనంటూ భయపడుతున్నారు..

త్వరగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేయాలి. గతంలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా రైతులు లాభపడ్డారు. ఈ సారి కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం చాలా సంతోషం. కానిన త్వర గా ఏర్పాటు చేయకుంటే దళారుల చేతిలో రైతులు మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి త్వరగా ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. 

- గంగారెడ్డి , రైతు , చామన్‌పెల్లి 

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి

మా గ్రామంలో పదిహేను రోజుల కిందటే వరి కోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించాం. రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇకనైనా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేలా సంబందిత అధికారులు చర్యలు తీసుకోవాలి. 

- కట్టరాజారెడ్డి, రైతు, అబ్దుల్లాపూర్‌ 

Updated Date - 2022-04-24T07:18:47+05:30 IST