24 మందిని బలిగొన్న ఆక్సిజన్ లీక్ వీడియోకు చిక్కింది!

ABN , First Publish Date - 2021-04-23T20:46:16+05:30 IST

నాసిక్‌లోని జాకిర్ హుస్సేన్ మునిసిపల్ ఆసుపత్రిలో 24 మంది కొవిడ్ రోగుల మరణానికి కారణమైన ఆక్సిజన్

24 మందిని బలిగొన్న ఆక్సిజన్ లీక్ వీడియోకు చిక్కింది!

ముంబై: నాసిక్‌లోని జాకిర్ హుస్సేన్ మునిసిపల్ ఆసుపత్రిలో 24 మంది కొవిడ్ రోగుల మరణానికి కారణమైన ఆక్సిజన్ లీకేజీ వీడియోకు చిక్కింది. ఆక్సిజన్ లీక్ కావడంతో దాదాపు 30 నిమిషాలపాటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఆసుపత్రిలో 150 మంది వెంటిలేటర్లపై ఉన్నారు. తాజాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆక్సిజన్ లీకేజీ జరిగిన ప్రదేశం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. లీకేజీ జరిగిన ప్రాంతంలో తెల్లని పొగలు కమ్ముకున్నాయి.  


సిలిండర్ల నుంచి ఓ గొట్టం ద్వారా ఆసుపత్రిలోకి ఆక్సిజన్ సరఫరా అవుతోంది. సిలిండర్ల నుంచి గ్యాస్ ఒక్కసారిగా లీక్ అవుతుండడంతో అప్పటి వరకు అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తుల భయంతో పరుగులు తీయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. లీకేజీ ఘటనపై దర్యాప్తు కోసం నాసిక్ డివిజనల్ కమిషనర్ రాధాకృష్ణ గామే సారథ్యంలో ఏడుగురు సభ్యుల బృందాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు, గుర్తుతెలియని వ్యక్తులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Updated Date - 2021-04-23T20:46:16+05:30 IST