సీబీఎస్‌ఈ మాజీ అధికారులపై సీబీఐ కేసు

ABN , First Publish Date - 2020-09-26T19:23:42+05:30 IST

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ)లో ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు..

సీబీఎస్‌ఈ మాజీ అధికారులపై సీబీఐ కేసు

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు మాజీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఓ జాయింట్ సెక్రటరీ, ఇద్దరు అసిస్టెంట్ సెక్రటరీలు, మరో అధికారిపై కేసు నమోదు చేసినట్టు సీబీఐ వెల్లడించింది. అధికారాల దుర్వినియోగం, రిజర్వేషన్ నిబంధనలను అతిక్రమించడం, ఫోర్జరీ, నకలీ సర్టిఫికెట్లు వినియోగం సహా నిందితులపై పలు అభియోగాలు నమోదయ్యాయి. నిందితుల్లో ఎస్పీ రాణా (జాయింట్ సెక్రటరీ) సస్పెన్షన్‌లో ఉండగానే రిటైర్ కాగా... అసిస్టెంట్ సెక్రటరీ బబితా రాణి, అసిస్టెంట్ సెక్రటరీ శిఖా తోమార్, అసిస్టెంట్ ప్రోగ్రామర్ రుచిన్ తోమార్‌లను డిస్మిస్ చేశారు. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న దాని ప్రకారం... జాట్ వర్గానికి చెందిన రాణి, శిఖా తోమార్‌లకు 2012- 2014 మధ్య అప్పటికి రిజర్వేషన్ లేకపోయినప్పటకీ రాణా ఉద్యోగాల్లో చేర్చుకున్నారు. తన అన్న కోడలు శిఖా తోమార్‌ను అసిస్టెంట్ కమిషనర్‌గా రాణా నియమించారు. ఇందుకోసం ఓ నకిలీ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ కూడా పుట్టించారు. కనీసం కుల ధ్రువీకరణ పత్రం, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా లేకుండా ఆమెను ఉద్యోగంలోకి తీసుకున్నట్టు గుర్తించారు. రాణి నియామకం కోసం 2012లో రాణా పలుమార్లు సిఫారసులు పంపినట్టు సీబీఐ ప్రాథమిక విచారణలో తేలడంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Updated Date - 2020-09-26T19:23:42+05:30 IST