YSRCP MP విజయసాయికి సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2021-08-27T03:36:48+05:30 IST

వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు...

YSRCP MP విజయసాయికి సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. విదేశాలకు వెళ్లేందుకు ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను రెండు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరగా.. ఇవాళ రాత్రి కోర్టు అనుమతిచ్చింది. అక్టోబరులోగా రెండు వారాలు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. కాగా.. దుబాయ్, బాలి, మాల్దీవులకు వెళ్లేందుకు విజయసాయి అనుమతి కోరారు. తీర ప్రాంత అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు వెళ్తున్నట్లు కోర్టుకు ఎంపీ తెలియజేశారు. దీంతో రూ.5లక్షల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని విజయసాయిరెడ్డిని సీబీఐ కోర్టు ఆదేశించింది.


ఇవాళ ఆయన ట్వీట్ ఇదీ..

ఇదిలా ఉంటే.. కోర్టు ఆదేశాలకు ముందు ట్విట్టర్ వేదికగా కొన్ని సంచలన, ఆసక్తికర ట్వీట్లు విజయసాయి పోస్ట్ చేశారు. ‘లిటిగేషన్‌కు వెళ్లాలంటే ఏ స్థాయి లాయర్లను పెట్టుకోవాలి..? ఎంత ఫీజుకు సిద్ధపడాలి..? అని కక్షిదారులు ఆలోచిస్తారు. గంటకు కోటి తీసుకునే ప్లీడర్‌ను నియమించుకోవడం ఒక ఎత్తయితే కోవర్టుకు కక్షిదారు వేషం వేసి లక్షల యూరోలు చెల్లించడం నయా శకుని చంద్రానికే చెల్లింది’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ కౌంటర్‌లు ఇస్తున్నారు.


తీర్పు వాయిదా..

కాగా.. అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (ఏ2)కు దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పును సీబీఐ ప్రత్యేక కోర్టు వాయిదావేసిన విషయం విదితమే. బుధవారం తీర్పు వెలువరిస్తుందన్న వార్తల నేపథ్యంలో.. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు వద్ద ఉదయం 10 గంటల నుంచే హైడ్రామా నెలకొంది. లాయర్లు, మీడియా ప్రతినిధులు, జగన్‌ వర్గీయులు, మఫ్టీలో ఉన్న పోలీసులు భారీ స్థాయిలో చేరుకున్నారు. బెయిల్‌ రద్దవుతుందో లేదోనన్న ఉత్కంఠ.. కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు అక్కడి వారిలో కనబడింది. విచారణ సుమారు మూడు గంటలకు పైగా సాగడంతో ఉత్కంఠ మరింత తీవ్రమైంది. చివరికి సెప్టెంబరు 15న తీర్పు వెలువరిస్తామని కోర్టు ప్రకటించింది.

Updated Date - 2021-08-27T03:36:48+05:30 IST