NSE fraud case : ఢిల్లీ, ముంబైలలో సీబీఐ సోదాలు

Published: Sat, 21 May 2022 14:08:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
NSE fraud case : ఢిల్లీ, ముంబైలలో సీబీఐ సోదాలు

న్యూఢిల్లీ : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)కి సంబంధించిన మోసం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) శనివారం ఉదయం ఢిల్లీ, ముంబై, నోయిడా, గురుగ్రామ్, తదితర ప్రాంతాల్లో 10 చోట్ల సోదాలు నిర్వహించింది. మార్కెట్ ఎక్స్ఛేంజ్‌లలోని కంప్యూటర్ సర్వర్ల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని స్టాక్ బ్రోకర్లకు అక్రమంగా పంపించినట్లు 2018లో FIR (ప్రథమ సమాచార నివేదిక) దాఖలైన సంగతి తెలిసిందే. 


ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ చిత్ర రామకృష్ణ (Chitra Ramakrishna) ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరు. ఆమె ఓ ‘హిమాలయన్ యోగి’తో ఈ-మెయిల్ సంభాషణలు జరిపినట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఓ నివేదికలో వెల్లడించింది. ఎన్ఎస్ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (GOO) ఆనంద్ సుబ్రహ్మణ్యం (Anand Subrahmanian) ఈ కేసులో మరొక ప్రధాన నిందితుడు.  మార్చి ఆరున చిత్రను అరెస్టు చేయగా, ఆనంద్‌ను ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. వీరిద్దరూ ఎన్ఎస్ఈకి చెందిన ట్రేడింగ్ సిస్టమ్‌లోని వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశాన్ని చట్టవిరుద్ధంగా ఢిల్లీలోని స్టాక్ బ్రోకర్ ఓపీజీ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని యజమాని సంజయ్ గుప్తాలకు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 


చిత్ర రామకృష్ణకు బెయిలు ఇచ్చేందుకు ఇటీవల ఢిల్లీలోని ప్రత్యేక  సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఆమె ఎన్ఎస్ఈ వ్యవహారాలను ఓ ప్రైవేటు క్లబ్‌తో సమానంగా నడుపుతున్నట్లు కనిపిస్తోందని జడ్జి సంజీవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. గాయకుడు, రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత బాబ్ డైలాన్ 1964లో విడుదల చేసిన ఓ పాటలోని భాగాన్ని జడ్జి ప్రస్తావించారు. డబ్బుకు పలుకుబడి ఉంటుందని, అంతేకాకుండా దానికి చాలా గొప్ప పలుకుబడి ఉంటుందని, ప్రజల మీద అత్యంత వికృత ప్రభావం చూపుతుందని ఈ పాట సారాంశమని చెప్పారు. ఆమెపై అభియోగపత్రాన్ని సీబీఐ గత నెలలో దాఖలు చేసింది. 


SEBI ఫిబ్రవరిలో ఇచ్చిన నివేదికలో, అంతుబట్టని ఓ హిమాలయన్ యోగి మార్గదర్శకత్వంలో చిత్ర రామకృష్ణ కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఆనంద్ సుబ్రహ్మణ్యమే ఆ యోగి అనే ఊహాగానాలు ఉన్నప్పటికీ, సీబీఐ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. ఆనంద్ మొదట చిత్రకు సలహాదారుగా నియమితులయ్యారు. ఆ తర్వాత పదోన్నతి పొందారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.