సీబీఎస్‌ఈపై.. సందేహాలు

ABN , First Publish Date - 2022-10-03T06:38:02+05:30 IST

పేదలు కూడా సీబీఎస్‌ఈలో బడుల్లో చదువుకోవాలి. ఆ విధంగా చేస్తాం.. వచ్చే విద్యా సంవత్సరంలోనే సీబీఎస్‌ఈ పాఠశాలలు అందుబాటులోకి తెస్తాం.. అని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి జిల్లాలో 14 పాఠశాలలను ఎంపిక చేసి సీబీఎస్‌ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.

సీబీఎస్‌ఈపై.. సందేహాలు
ప్రత్తిపాడు జడ్పీ ఉన్నత పాఠశాల

కమిటీ అనుమతిపై అనుమానాలు

జిల్లాలో 14 పాఠశాలల కోసం ప్రతిపాదనలు

సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం సౌకర్యాలు అంతంతే

త్వరలో పరిశీలనకు రానున్న సీబీఎస్‌ఈ కమిటీ సభ్యులు  

వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్‌ మార్పు జరిగేనా? 

గుంటూరు, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): పేదలు కూడా సీబీఎస్‌ఈలో బడుల్లో చదువుకోవాలి. ఆ విధంగా చేస్తాం.. వచ్చే విద్యా సంవత్సరంలోనే సీబీఎస్‌ఈ పాఠశాలలు అందుబాటులోకి తెస్తాం.. అని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి జిల్లాలో 14 పాఠశాలలను ఎంపిక చేసి సీబీఎస్‌ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అయితే ఆయా పాఠశాలల్లో ఉన్న పరిస్థితులు, వసతులను బట్టి చూస్తే సీబీఎస్‌ఈ కమిటీ అనుమతి ఇస్తుందో, లేదోనన్న సందేహాలు వ్యక్తమౌతోన్నాయి. ఇందుకు మూల కారణం సీబీఎస్‌ఈ నియమ, నిబంధనలు పకడ్బందీగా ఉంటాయి. విశాలమైన తరగతి గదులు, నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ప్లేగ్రౌండ్‌, ల్యాబ్‌లు వంటి అనేక సదుపాయాలు కలిగివుండాలి. అప్పుడే సీబీఎస్‌ఈ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్నీ సంతృప్తికరంగా ఉంటేనే ఆమోదం తెలుపుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిపాదించిన 14 జడ్పీ పాఠశాలల్లో ఎన్నింటికి అనుమతులు వస్తాయోనన్న సందేహాలు కలుగుతోన్నాయి.  జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న జిల్లాపరిషత్‌ హైస్కూళ్లలో వందల మంది విద్యార్థులు చదువులు సాగిస్తోన్నారు. వీరంతా తెలుగు మీడియంలోనే చదువుకుంటున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం  ప్రభుత్వ పాఠశాలను సీబీఎస్‌ఈలోకి మార్చేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో జిల్లాలో 14 స్కూళ్లని రాబోయే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ స్కూల్స్‌గా మార్చేందుకు ప్రతిపాదించింది. అయితే సీబీఎస్‌ఈ పాఠశాలలుగా గుర్తింపునకు కమిటీ నియమ, నిబంధనలు పకడ్బందీగా ఉంటాయి. ఆయా నియమ నిబంధనలు అన్నీ సక్రమంగా ఉంటేనే సీబీఎస్‌ఈ పాఠశాలలుగా గుర్తింపు ఇస్తోంది. లేదంటే లేదు. గుంటూరు నగరంలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యంలో కొనసాగుతోన్న సీబీఎస్‌ఈ స్కూళ్లని చేతివేళ్లతో లెక్కించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నల్లపాడులో కేంద్రీయ విద్యాలయం ఉన్నది. అలానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో భారతీయ విద్యాభవన్‌ ఉన్నది. మిగతావి మిషనరీస్‌, ప్రైవేటు విద్యా సంస్థలే. వాటిల్లో అకడమిక్‌ కరిక్యులమ్‌ వేరుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో  జిల్లాలోని ఏకంగా 14 జడ్పీ పాఠశాలలను సీబీఎస్‌ఈగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన ఆయా పాఠశాలల్లో సరైన వసతులు లేవు. భవనాలు సక్రమంగా ఉంటే సరైన సౌకర్యాలు ఉండవు. మరుగుదొడ్లు, తాగునీటి వసతి, విశాలమైన ప్రాంగణం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఉపాధ్యాయులు లేరు. ఇక ల్యాబ్‌లు అయితే మచ్చుకు కూడా కానరావు. మరుగుదొడ్లు ఉన్నా నీటి సౌకర్యం లేక పోవడంతో అవి అధ్వానంగా ఉంటాయి. ఇక గదులు ఉన్నా అవి ఇరుకుఇరుకుగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో సీబీఎస్‌ఈ కమిటీ పరిశీలనలో వీటిని పరిగణనలోకి తీసుకుంటే అనుమతిపై కష్టమేనని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం జడ్పీ హైస్కూళ్లలో తరగతులు బోదిస్తోన్న వారికి సీబీఎస్‌ఈ సిలబస్‌ గురించి అంతగా అవగాహన లేదు. జడ్పీ హైస్కూళ్లలో నాడు - నేడు కింద అంతంత మాత్రంగానే పనులు జరుగుతోన్నాయి. వాటిల్లో చాలావరకు మరమ్మతులే ఉంటోన్నాయి. అరకొరగా అదనపు తరగతి గదులు, డైనింగ్‌ హాల్‌, మరుగుదొడ్లకు నిధులు వెచ్చిస్తోన్నారు. బెంచీలు, బ్లాక్‌బోర్డులు వంటివి మాత్రమే ఏర్పాటు చేస్తోన్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణం కారణంగా పాఠశాలల్లో క్రీడా మైదానాల వైశాల్యం తగ్గిపోతోన్నది. ల్యాబ్‌లు భూతద్దం పెట్టి వెదికినా కనిపించవు. ఆయా సౌకర్యాల గురించి పట్టించుకోకుండా పొన్నూరులోని నిడుబ్రోలు, వేజండ్ల, వెనిగండ్ల, మంగళగిరిలో రేవేంద్రపాడు, నిడమర్రు అండ్‌ చినకాకాని, పెనుమాక స్కూళ్లని సీబీఎస్‌ఈ మార్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అలానే ప్రత్తిపాడు పరిధిలో జొన్నలగడ్డ, ప్రత్తిపాడు, తుళ్లూరు మండలంలో తుళ్లూరు, మేడికొండూరు మండలంలో సిరిపురం, తాడికొండలో రావెల, తెనాలిలో సంగంజాగర్లమూడి జడ్పీ హైస్కూళ్లని ప్రతిపాదించింది. అయితే వీటిల్లో ఎక్కువ స్కూళ్లలో సీబీఎస్‌ఈ నిబంధనలకు సరితూగేవి లేవన్నది ఉపాధ్యాయవర్గాల అభిప్రాయం. కాగా త్వరలో సీబీఎస్‌ఈ బృందం జిల్లాకు వచ్చి ఆయా స్కూళ్లని పరిశీలించనున్నది. ఆ తర్వాతే వాటి భవితవ్యం తేలుతుంది. జిల్లాలో ప్రస్తుతం సీబీఎస్‌ఈ స్కూళ్ల సంఖ్య చాలా పరిమితంగా ఉన్నది. 


Updated Date - 2022-10-03T06:38:02+05:30 IST