నిఘా నేత్రం

ABN , First Publish Date - 2021-10-07T04:40:09+05:30 IST

అన్ని పోలీస్‌స్టేషన్లు, సర్కిల్‌ కార్యాలయాలు, సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్లు, సబ్‌ డివిజన కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

నిఘా నేత్రం

అన్ని స్టేషన్లు, పోలీసు కార్యాలయాల్లో సీసీ కెమెరాలు

ఏపీలో గుంటూరు, కృష్ణా జిల్లాల పైలెట్‌ ప్రాజెక్టు

సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో పోలీసు అధికారులు ఉక్కిరిబిక్కిరి

గుంటూరు, అక్టోబరు 6: అన్ని పోలీస్‌స్టేషన్లు, సర్కిల్‌ కార్యాలయాలు, సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్లు, సబ్‌ డివిజన కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దీనిని పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేసి ఆ తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా దేశ వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆయా నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుతం అవి గుంటూరు అర్బన, రూరల్‌ పోలీసు అధికారులకు అందాయి. ఆయా ఆదేశాలను చూసిన పోలీసు అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా పోలీస్‌స్టేషన్లలో లాకప్‌లో ఎస్‌హెచఓ గదిలో, రికార్డు రూంలో, స్టేషన పరిసరాలు మొత్తం కనిపించేలాగా ఇలా స్టేషనలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఎవరు, ఎక్కడ ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు, పోలీసులు ఎవరిని తీసుకువచ్చారు. లాకప్‌లో ఎవరున్నారు, ఎవరిపైనైనా థర్డ్‌ డిగ్రీగానీ, అసభ్యకర ప్రవర్తనగానీ చేస్తే ఆయా వీడియోల్లో స్పష్టంగా కనిపించేలా కెమెరాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇటీవలకాలంలో వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించినట్టు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపటమేకాక సుప్రీంకోర్టు దృష్టికి కూడా వెళ్లిన విషయం విదితమే. అంతేగాక ఇటీవల పలు కేసుల్లో నిందితులను తీసుకువచ్చి రోజులతరబడి పోలీసులు అక్రమంగా నిర్బంధిస్తున్నారని, కోర్టులలో హెవియస్‌ కార్పస్‌ పిటీషన్లు దాఖలవుతుండటం, పోలీస్‌స్టేషన్లలో బాధితుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. అంతేగాక పోలీస్‌స్టేషనలో అవినీతి జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో పోలీస్‌స్టేషన్లలో రహస్యానికి తావులేకుండా చూసేందుకు సీసీ కెమెరాలే సరైన పరిష్కారమని సుప్రీంకోర్టు భావిస్తోంది. అయితే ఇది కేవలం పోలీస్‌స్టేషన్లకు మాత్రమే పరిమితం కాలేదు. అన్ని సర్కిల్‌ కార్యాలయాలలోనూ, సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్లలోనూ, సబ్‌ డివిజన కార్యాలయాల్లోనే గాక చివరకు జిల్లా ఉన్నతాధికారి అయిన ఎస్పీ కార్యాలయంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలొచ్చాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం పెద్ద అభ్యంతరకరం కానప్పటికీ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, ఆయా కెమెరాల సామర్ధ్యం వంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పేర్కొనటంతో పోలీసు అధికార యంత్రాంగం విస్మయం చెందుతోంది. చోరీ కేసుల్లో నిందితుల నుంచి సొత్తు రికవరీ చేయటం, 24 గంటల్లో సాధ్యమయ్యే పరిస్థితికాదు. నిందితులతోపాటు ముఠా సభ్యులందరిని అదుపులోకి తీసుకోవటం, వారిని పూర్తిస్థాయిలో విచారించి సొమ్ము రికవరీ చేయటానికి కొంతసమయం పడుతుంది. అలాకాకుండా అదుపులోకి తీసుకున్న వెంటనే కోర్టులో హాజరుపరిస్తే ఆ తర్వాత కస్టడీకి తీసుకున్నప్పటికీ నిందితుడు చోరీ సొత్తు వివరాలు వెల్లడించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ద్వారా పోలీసులు లాఠీలకు స్వస్తి చెప్పారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పరిస్థితులు ఎలా ఉంటాయోనని అయోమయానికి లోనవుతున్నారు. అయితే ప్రస్తుతం దీనిపై పోలీసు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం ఎన్ని కెమెరాలు అవసరమవుతాయి, పోలీస్‌స్టేషన, కార్యాలయాల వారీగా అవసరమయ్యే కెమెరాల సంఖ్య, వాటికి అయ్యే ఖర్చు తదితర వివరాలపై సాంకేతిక నిపుణులతో కలిసి అంచనాలు రూపొందించే పనిలో పడ్డారు. మొత్తం మీద సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పోలీసుల్లో, ప్రజల్లోను భిన్నాభిప్రాయాలకు దారి తీస్తుంది.

 


Updated Date - 2021-10-07T04:40:09+05:30 IST