నేర నియంత్రణకోసం నిరంతర నిఘా

Jun 23 2021 @ 01:27AM
మల్లేశ్వరస్వామి ఆర్చీ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాలు

పట్టణంలో 15 సీసీ కెమెరాల ఏర్పాటు 

శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల ప్రత్యేక చర్యలు

పీసీపల్లి, జూన్‌ 22: నేరాల నియంత్రణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తులను గుర్తించి ఎన్నో కేసులను ఛేదిస్తున్నారు. ఇందులో ప్రధానంగా సీసీ కెమెరాలు దర్యాప్తులో పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకున్న పోలీసు ఉన్నతాధికారులు మండలాల్లో ప్రధాన గ్రామాలు ముఖ్య కూడళ్ళలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పీసీపల్లి మండలంలోనూ పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు.

సీఐ పాపారావు పర్యవేక్షణలో ఎస్సై బి.ప్రేమ్‌కుమార్‌ పెదఅలవలపాడులో 3,పెదయిర్లపాడులో 4, పీసీపల్లిలో 2, తలకొండపాడులో 2, లింగన్నపాలెంలో 2, గుంటుపల్లిలో 1, గంగమ్మ ప్రాంగణంలో 1 మొత్తం 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు పలు గ్రామాల్లో దేవాలయ ప్రాంగణాల్లోనూ సీసీ కెమెరాలను బిగించారు. ప్రత్యేక గదిలో మానిటర్‌ సిస్టంను ఏర్పాటు చేశారు. దాని ద్వారా అనుమానితులు, నేరగాళ్ళ కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పీసీపల్లి పోలీసులు నేరాల నియంత్రణతో పాటు శాంతిభధ్రతలను పర్యవేక్షిస్తున్నారు. 

ప్రజల సహకారం అవసరం

 బి.ప్రేమ్‌కుమార్‌, ఎస్సై

నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రజల సహకారం కూడా అవసరం. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరించినా ఏదైనా సంఘటన జరిగినా మనకెందుకులే అనుకోకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. దీంతోపాటు సంఘ వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. అట్టి సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. ప్రజలు సహకరించడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.