నిఘా లేక.. దగా

ABN , First Publish Date - 2020-08-08T10:27:47+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంజీరా నదిపై హవేళీఘణపూర్‌ మండలంలోని సర్దన గ్రామంలో రెండు

నిఘా లేక.. దగా

ఇసుక క్వారీల్లో కనిపించని సీసీ కెమెరాలు

రెండు నెలలైనా ఏర్పాటు చేయని కాంట్రాక్టర్లు

నిబంధనల అమలు పట్టని అధికారులు

ఇసుక తవ్వకాలు, రవాణాపై కానరాని పర్యవేక్షణ

సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశించాం : పీవో


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, ఆగస్టు 7: తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంజీరా నదిపై హవేళీఘణపూర్‌ మండలంలోని సర్దన గ్రామంలో రెండు చోట్ల ఇసుక క్వారీలను ఏర్పాటు చేశారు. తవ్వకాల పనులను టెండర్‌ విధానంలో కాంట్రాక్టర్లకు అప్పగించారు. టన్ను ఇసుకకు రూ. 650 చొప్పున సీనరేజీ వసూలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఇరిగేషన్‌, డబుల్‌ బెడ్రూం, ఉపాధి హామీ సీసీ రోడ్లు, ఇతరత్రా ప్రభుత్వ పనులకు ఇక్కడి నుంచే ఇసుకను తరలించేవారు. కొన్నిరోజులుగా ప్రైవేటు నిర్మాణాల కోసం కమర్షియల్‌ విక్రయాలకు కూడా అనుమతలు ఇచ్చారు.  


3.5 లక్షల క్యూబిక్‌ మీటర్లకు అనుమతి 

రెండు రీచ్‌లలో మూడున్నర లక్షల క్యూబిక్‌ మీటర్ల చొప్పున ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది. సర్దన-1 క్వారీని నెలన్నర క్రితం ప్రారంభించగా... ఇప్పటి వరకు 40 వేల క్యూబిక్‌ మీటర్ల మేర ఇసుక తరలించారు. సర్దన-2 క్వారీని రెండు నెలల క్రితం అందుబాటులోకి తేగా ఇప్పటి దాకా సుమారు 85 వేల క్యూబిక్‌ మీటర్ల మేర ఇసుక తవ్వకాలు జరిగాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నదిలో నీరు చేరడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. అయితే అప్పటికే తవ్విన ఇసుకను ఒడ్డున పోసి విక్రయాలు కొనసాగిస్తున్నారు. కానీ అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ లోతు తవ్వుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 


కనిపించని సీసీ కెమెరాలు

ఇసుక తవ్వకాలు ప్రారంభించిన తొలిరోజు నుంచే సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని నిబంధనల్లో స్పష్టం పేర్కొన్నారు. సిసీ కెమెరాలతో నిఘా ఉంచడంతో లారీ లేదా టిప్పర్‌ రీచ్‌లోకి వచ్చినప్పటి నుంచి ఇసుక లోడ్‌ చేసుకొని బయటకు వెళ్లే వరకు ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉంటుందనేది సర్కారు ఉద్దేశం. అంతేకాకుండా సీసీ కెమెరాలతో టీఎ్‌సఎండీసీ అధికారులు హైదరాబాద్‌ నుంచి ఎప్పటికప్పుడు పరిశీలించే అవకాశముంటుంది. వాహనాల్లో సామర్థ్యానికి మించి తరలించడానికి వీలుండదు. రెండు ఇసుక రీచ్‌ల్లోనూ ఇంతటి కీలకమైన సీసీ కెమెరాల ఏర్పాటును కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు.


క్వారీలు అందుబాటులోకి వచ్చి నెలలు గడుస్తున్నా నిఘా ఊసే కానరావడం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇదిగో.. అదిగో.. అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. నెలల తరబడి ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరుగుతున్నా సీసీ కెమెరాలను మాత్రం ఏర్పాటు చేయలేదు. పైనుంచి ఒత్తిడి కారణంగా టీఎ్‌సఎండీసీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. దీనిపై టీఎ్‌సఎండీసీ పీవో రామకృష్ణను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా రీచ్‌లలో సీసీ కెమెరాలు లేని విషయం వాస్తవమేనని, కాంట్రాక్టర్లను ఆదేశించామని, త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. ఇసుక విక్రయాల్లో ఎటువంటి అవకతవకలు లేవని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-08-08T10:27:47+05:30 IST