Banjara Hills KBR Park: నిఘా నేత్రాలకు అంధత్వం

ABN , First Publish Date - 2021-11-17T17:50:48+05:30 IST

కేవలం ఈ ఘటనల్లోనే కాకుండా.. దర్యాప్తులో వారధిగా ఉండాల్సిన నిఘా నేత్రాలు చాలా ప్రాంతాల్లో పని చేయడం లేదు. దీంతో అనేక కేసుల్లో ఆధారాలు దొరక్క రోజుల తరబడి దర్యాప్తు సాగుతోంది. అంతర్జాతీయ పోలీసింగ్‌లో

Banjara Hills KBR Park: నిఘా నేత్రాలకు అంధత్వం

వీఐపీ ప్రాంతంగా పేరుపొందిన బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్కులో సినీ నటి చౌరాసియాపై దుండగుడు దాడి చేసి సెల్‌ఫోన్‌ లాక్కొని పారిపోయాడు. దర్యాప్తు నిమిత్తం పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా, ఒక్కటి కూడా పనిచేయడం లేదని తేలింది. సంఘటన జరిగిన మూడు రోజులు అవుతున్నా ఇంత వరకు ఒక్క ఆధారం కూడా లభించలేదు. 


ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా హిమాయత్‌నగర్‌ పరిధిలో వెనుక నుంచి భారీ వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. అతడు తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి అలంకారప్రాయమే కావడంతో అతన్ని ఢీ కొట్టింది ఎవరనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. 


పనిచేయని సీసీ కెమెరాలు 60 శాతం పైనే

లక్ష్యసాధనలో విఫలం

కొన్ని చోట్ల విరిగిపోయిన..

మరికొన్ని చోట్ల కేబుళ్లను కొరికేసిన ఎలుకలు 


హైదరాబాద్/బంజారాహిల్స్‌: కేవలం ఈ ఘటనల్లోనే కాకుండా.. దర్యాప్తులో వారధిగా ఉండాల్సిన నిఘా నేత్రాలు చాలా ప్రాంతాల్లో పని చేయడం లేదు. దీంతో అనేక కేసుల్లో ఆధారాలు దొరక్క రోజుల తరబడి దర్యాప్తు సాగుతోంది. అంతర్జాతీయ పోలీసింగ్‌లో భాగంగా నగరంలో లక్ష నిఘా నేత్రాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యం పెట్టుకున్న పోలీసు బాస్‌లు వాటి నిర్వహణపై అంతగా దృష్టి పెట్టడం లేదు. దీంతో కేసుల దర్యాప్తు పెద్ద సవాలుగా మారుతోంది. ప్రైవేటు నిర్వాహణలో ఉన్న కెమెరాలపై ఆధార పడాల్సి వస్తోంది. ప్రైవేటు కెమెరాలను యజమానులు తమకు అనుకూలంగా ఏర్పాటు చేసుకుంటుండటంతో అనేక సందర్భాల్లో సంఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డు కావడం లేదు. సినీనటిపై దాడి లాంటి సంఘటనలపై చర్చ జరుగుతుంటుంది. ఈ సమయంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న విషయం వెలుగులోకి రావడంతో భద్రతలో డొల్లతనం వెల్లడైంది.


ఉన్నవి అంతంత మాత్రమే..

నగరంలో కనీసం లక్ష కమ్యూనిటీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు ఉన్నతాధికారులు. టార్గెట్‌ కోసం ఠాణీల వారీగా పోలీసుల మెడలు వంచి మరీ పని చేయించారు. అయినా లక్ష్యం సగానికి చేరడం గగనంగా మారింది. దీంతో ‘నేను సైతం’ అనే నినాదంతో ప్రైవేటు వ్యాపార సముదాయాలు, అపార్ట్‌మెంట్‌లు, ఇళ్లలో పెట్టుకున్న కెమెరాలను జియో టాగింగ్‌ ద్వారా కమ్యూనిటీ సీసీ కెమెరాల్లో కలుపుకొని హమ్మయ్య అనుకున్నారు. వ్యయప్రయాసాలతో కెమెరాలు ఏర్పాటు చేసినా అవి పని చేయకపోవడంతో అనేక కేసుల్లో దర్యాప్తు ముందుకు సాగడం లేదు. 


నిర్వాహణ ఎవరిదంటే..

కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటు సమయంలో పోలీసు శాఖ కొన్ని ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. కమ్యూనిటీ అంటే కాలనీ అసోసియేషన్‌, లేదా బస్తీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో 15 లేదా అంతకన్నా ఎక్కువ కెమెరాలు ఒకేసారి ఏర్పాటు చేయడం. నిర్వాహకులు ఖర్చులో యాభై శా తం ముందుగా చెల్లించాలి. బిగించడం పూర్తయిన ఏడాది 25 శాతం, మరుసటి ఏడాది 25 శాతం చొప్పున మిగతా డబ్బు కట్టాల్సి ఉంటుంది. కెమెరాలు ఇచ్చే కంపెనీ ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతను పర్యవేక్షించాల్సి ఉంటుంది. కమ్యూనిటీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వస్తున్న నిర్వాహకులు మొదటి దఫా డబ్బు కట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. మిగతా డబ్బు కట్టకపోవడంతో కంపెనీలు  నిర్వాహణను పట్టించుకోవడం లేదు. ఫలితంగా నిఘా నేత్రాలకు చీకట్లు అలుముకుంటున్నాయి. అనేక చోట్ల కెమెరాలు విరిగిపోతున్నాయి. మైదానాలు, పార్కులు ఉన్న చోట్ల కేబుళ్లను ఎలుకలు కొరికేస్తున్నాయి. కేబీఆర్‌ పార్కు వద్ద ఉన్న  కెమెరాలు ఎలుకల కారణంగానే పనిచేయడం లేదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. 


కేసులు మూసేస్తున్నారు..

నగరంలో వివిధ తరహా నేరాల కింద కనీసం వంద నుంచి రెండు వందల ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అవుతుంటాయి. దర్యాప్తులో పోలీసులు ప్రధానంగా సీసీ కెమెరాలపైనే ఆధారపడుతుంటారు. అనేక చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. మరోవైపు యూఐ మేళాలో కేసులు పరిష్కరించాలని ఉన్నతాధికారుల ఒత్తిడి ఫలితంగా అనేక ఫైల్స్‌ ఆధారాలు లేవు అని మూత పడుతున్నాయి. పెద్ద దొంగతనాలు, సంచనాల సృష్టించిన కేసులు, హత్యలు వంటి వాటి విషయంలో పోలీసులు సీసీ కెమెరాలు పనిచేయకపోయినా పాత పద్ధతిలో దర్యాప్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, పాత నేరస్థుల గుర్తింపు తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. కానీ రోడ్డు ప్రమాదాలు, గొడవలు వంటి వాటి విషయంలో సీసీ కెమెరాల దృశ్యాలు నమోదు కాకపోతే ఆధారాలు లేవని మూసేస్తున్నారు. దీంతో అనేక మంది ఫిర్యాదుదారులకు న్యాయం జరగడం లేదు. 

Updated Date - 2021-11-17T17:50:48+05:30 IST