రైల్వే స్టేషన్లలో సీసీ కన్ను

ABN , First Publish Date - 2022-07-07T06:11:24+05:30 IST

గుంతకల్లు డివిజనలోని తొమ్మిది రైల్వే స్టేషన్లలో వీడియో సర్వైలెన్స సిస్టంను (వీడియో నిఘా వ్యవస్థ) ఏర్పాటు చేస్తామని రైల్వే అధికారులు బుధవారం తెలియజేశారు.

రైల్వే స్టేషన్లలో సీసీ కన్ను

డివిజన పరిధిలో తొమ్మిది చోట్ల ఏర్పాటు

గుంతకల్లు, జూలై 6: గుంతకల్లు డివిజనలోని తొమ్మిది రైల్వే స్టేషన్లలో వీడియో సర్వైలెన్స సిస్టంను (వీడియో నిఘా వ్యవస్థ) ఏర్పాటు చేస్తామని రైల్వే అధికారులు బుధవారం తెలియజేశారు. దేశవ్యాప్తంగా 756 రైల్వే స్టేషన్లలోను, దక్షిణ మధ్య రైల్వేలో 76 స్టేషన్లలోను ఈ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. గుంతకల్లు రైల్వే డివిజన పరిధిలో గుంతకల్లు, అనంతపురం, చిత్తూరు, కడప, మంత్రాలయం రోడ్డు, నందలూరు, పాకాల, యర్రగుంట్ల, రాయచూరు స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ప్రత్యేక నిఘా ఉంచుతారు. నిర్భయ నిధుల నుంచి ఈ వీడియో నిఘా వ్యవస్థను (వీఎ్‌సఎస్‌) ప్రధాన రైల్వే స్టేషన్లలో వ్యవస్థీకరించనున్నారు. రైల్వే స్టేషన్లలోని విశ్రాంతి గదులు, రిజర్వేషన కౌంటర్లు, పార్కింగ్‌ స్థలాలు, ప్రవేశ ద్వారాలు, బుకింగ్‌ కౌంటర్లు, ప్లాట్‌ఫాంలు, పాదచారుల వంతెనలపై వీడియో కెమెరాలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా రైల్వేలు, ప్రయాణికుల భద్రత పటిష్టమౌతుందని అధికారులు తెలియజేశారు. ఈ వీడియో క్లిప్పింగులు నెలరోజులపాటు నిల్వ ఉంచుతారు. ఈ వ్యవస్థద్వారా అనుమానితులను గుర్తించడం, వారిపై నిఘా ఉంచడం, చొరబాట్లను నియంత్రించడం, టికెట్‌ లెస్‌ జర్నీలను అరికట్టడం, ప్రమాద బాధితులను సత్వరమే గుర్తించడం, స్టేషనకు వచ్చి వెళుతున్న వాహనాలను గుర్తించడం తదితర ప్రయోజనాలు చేకూరుతాయి.

Updated Date - 2022-07-07T06:11:24+05:30 IST