ఇంటి బయట పార్క్ చేసిన స్కూటీ మిస్సింగ్.. సీసీ కెమెరాలో చెక్ చేస్తే జరిగిందేంటో తెలిసి..

Jul 20 2021 @ 11:44AM

ఇంటర్నెట్ డెస్క్: ఇంటి బయట స్కూటీ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లాడా వ్యక్తి. కాసేపాగి బయటకు వస్తే తన స్కూటీ కనిపించడం లేదు. అది ఏ అర్ధరాత్రో అయితే దొంగతనం జరిగిందని అనుమానించేవాడే.. కానీ అది పట్టపగలు. కాలనీలో ఎవరో ఒకరు చూడకుండా దొంగతనం చేయడం కుదరదు. మరి ఏం జరిగింది? తన స్కూటీ ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానం అతనికి దొరకలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, అక్కడ కొంచెం దూరంలో ఉన్న సీసీ కెమెరాను గుర్తించారు. దాని ఫుటేజీని పరిశీలించి పోలీసులే ఆశ్చర్యపోయారు.


ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు పట్టపగలే స్కూటీ దొంగతనం చేయడం ఆ వీడియోలో రికార్డయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా పట్టణంలో వెలుగు చూసింది. స్థానికంగా జరిగిన ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతోంది. వీడియోలో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నిలబడి, కాసేపు అటూ ఇటూ చూశారు. వీధిలో ఎవరూ లేరని నిర్ధారణ కాగానే, ఒకడు స్కూటీ తాళం పగలగొట్టేశాడు. ఆ వెంటనే డైరెక్ట్ చేసి స్కూటీ స్టార్ట్ చేయడం, రెండో వ్యక్తిని వెనక కూర్చోపెట్టుకొని వెళ్లిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...