Nebraska: ఈతకు వెళ్లొచ్చాక చిన్నారి మరణం.. మెదడు తినేసే సూక్ష్మజీవి బారిన పడటంతో..

ABN , First Publish Date - 2022-08-21T00:35:58+05:30 IST

అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో ఇటీవల ఓ బాలుడు.. మెదడు తిసేసే(Brain-eating) స్కూక్ష్మజీవి బారిన పడి మరణించాడు.

Nebraska: ఈతకు వెళ్లొచ్చాక చిన్నారి మరణం.. మెదడు తినేసే సూక్ష్మజీవి బారిన పడటంతో..

ఎన్నారై డెస్క్: అమెరికాలోని నెబ్రాస్కా(Nebraska) రాష్ట్రంలో ఇటీవల ఓ బాలుడు.. మెదడు తిసేసే(Brain-eating) స్కూక్ష్మజీవి బారిన పడి మరణించాడు. అమెరికా అంటువ్యాధుల అధ్యయన సంస్థ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ-CDC) తాజాగా ఈ విషయాన్ని ధృవీకరించింది. నెగ్లేరియా ఫౌలెరీ(Naegleria fowleri) జాతికి చెందిన అమీబా(Amoeba) బారిన పడి అతడు మరణించినట్టు సీసీడీ తాజాగా ప్రకటించింది. ఈ అమీబా కారణంగా మరణం సంభవించడం నెబ్రాస్కా రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. నదులు, మంచినీటి సరస్సుల్లో ఈ సూక్ష్మజీవి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నీటిలో మునిగిన సమయంలో ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని హెచ్చరించారు. దీని బారిన పడిన వారు మరణించే అవకాశం దాదాపు 97 శాతమని చెప్పారు. 


స్థానిక మీడియా కథనాల ప్రకారం.. డగ్లస్ కౌంటీకి చెందిన ఆ చిన్నారి ఆగస్టు 8న సమీపంలోని ఎల్క్‌హార్న్ నదిలో ఈతకు వెళ్లివచ్చాడు. ఆ తరువాత ఐదు రోజులకు అతడిలో అనారోగ్య లక్షణాలు బయటపడ్డాయి. కుటుంసభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇటీవల అతడు ప్రాణాలు విడిచాడు. అతడి నమూనాలను పరీక్షించిన సీడీసీ.. బాలుడి శరీరంలో నెగ్లేరియా ఫౌలెరీ ఉన్న విషయాన్ని గుర్తించింది. ఈ రకం అమీబాతో కలుషితమైన నీరు ముక్కుద్వారా లోపలికి వెళ్లినప్పుడు.. సూక్ష్మజీవి మెదడుకు చేరుకుంటుదని వైద్యులు చెబుతున్నారు. దీని కారణంగా ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్‌సెఫలైటిస్ వస్తుందని చెప్పారు. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ బారిన పడతారని చెప్పారు. అమెరికాలో ఏటా కొన్ని లక్షల మంది సరదా కోసం ఈతకు వెళ్లినా..సగటున ఎనిమిది మందికి మాత్రమే అమీబా ఇన్ఫెక్షన్‌ సోకుతోంది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో అమెరికాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో సరస్సులు, నదుల్లో ఈ అబీమాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో ఉత్తర రాష్ట్రాల్లో కంటే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 


ఈ క్రమంలో నెబ్రాస్కా రాష్ట్రా ఆరోగ్య శాఖ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ఈతకు వెళ్లిన సందర్భాల్లో ముక్కులోకి నీళ్లు వెళ్లేలాగా పైనుంచి నీటిలోకి దూకడం, తలమునిగిపోయేలా నీటిలోపలికి ఈదుకుంటూ వెళ్లడం వంటివి చేయద్దని సూచించింది. శుభ్రంగా ఉండే స్విమ్మింగ్‌‌ పూల్స్‌లో ఈదితే ఈ అమీబా బారినపడరని సూచించింది. అంతేకాకుండా.. సరస్సులో ఈతకు వెళ్లిన సందర్భాల్లో నీటి అడుగున ఉన్న వాటిని బయటకు తీసే ప్రయత్నాలు చేయవద్దని సూచించింది. 

Updated Date - 2022-08-21T00:35:58+05:30 IST