
న్యూఢిల్లీ : చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ అసలు సిసలు దేశభక్తుడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్లాఘించారు. జనరల్ రావత్ గొప్ప ప్రతిభాపాటవాలుగల సైనికుడని బుధవారం ఇచ్చిన ట్వీట్లో పేర్కొన్నారు. మన సాయుధ దళాలను, భద్రతా ఉపకరణాలను ఆధునికీకరించేందుకు ఆయన విశేషంగా కృషి చేశారని తెలిపారు. వ్యూహాత్మక అంశాల పట్ల ఆయనకు గొప్ప పరిజ్ఞానం ఉందని, ఆయన దృక్పథం, ఆలోచనలు అసాధారణమైనవని పేర్కొన్నారు. ఆయన దివంగతులు కావడం తనను తీవ్రంగా కలచివేసిందని, తాను తీవ్రంగా విచారిస్తున్నానని తెలిపారు.
భారత దేశ తొలి సీడీఎస్‌గా జనరల్ రావత్ మన సాయుధ దళాలకు సంబంధించిన అనేక వైవిద్ధ్యభరితమైన అంశాలపై కృషి చేశారన్నారు. రక్షణ రంగంలో సంస్కరణల కోసం ఆయన విశేషంగా కృషి చేసినట్లు తెలిపారు. భారత సైన్యంలో సేవలందించిన గొప్ప అనుభవం ఆయనకు ఉందన్నారు. ఆయన అందించిన అసాధారణ సేవలను భారత దేశం ఎన్నటికీ మర్చిపోదని పేర్కొన్నారు.
జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా ఇతర సాయుధ దళాల సిబ్బంది తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని మోదీ పేర్కొన్నారు. వీరు భారత దేశానికి అత్యంత శ్రద్ధతో, కర్తవ్య దీక్షతో సేవలందించారని కొనియాడారు. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు.
జనరల్ రావత్ తదితరులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని కునూర్ సమీపంలో బుధవారం కూలిపోయింది. ఈ దారుణ సంఘటనలో ఆయనతోపాటు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆయన సతీమణి మధులిక కూడా ఉన్నారు. ఈ హెలికాప్టర్లో ప్రయాణించినవారిలో ఒకరు మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.