కొవిడ్ ఎఫెక్ట్.. గల్ఫ్‌లో సందడి లేని బతుకమ్మ, దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-10-26T20:21:45+05:30 IST

కరోనా మహమ్మరి కారణంగా ఈసారి గల్ఫ్ దేశాలలో బతుకమ్మ, దసరా ఉత్సవాలకు మునుపటి సందడి తగ్గింది. ఉద్యోగాలు కోల్పోయి కొందరు స్వదేశాలకు వెళ్ళిపోగా మరికొందరు కరోనా నిబంధనల వల్ల పండుగల సంబరాలకు దూరంగా ఉన్నారు. అంత మాత్రాన పండుగల ఉత్సహాం, ఉత్తేజం తగ్గిందని కాదు.

కొవిడ్ ఎఫెక్ట్.. గల్ఫ్‌లో సందడి లేని బతుకమ్మ, దసరా ఉత్సవాలు

గల్ఫ్‌లో సందడి లేని బతుకమ్మ సద్దులు

ఆన్‌లైన్ అనుసంధానంతో చెరిగిన హద్దులు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కరోనా మహమ్మరి కారణంగా ఈసారి గల్ఫ్ దేశాలలో బతుకమ్మ, దసరా ఉత్సవాలకు మునుపటి సందడి తగ్గింది. ఉద్యోగాలు కోల్పోయి కొందరు స్వదేశాలకు వెళ్ళిపోగా మరికొందరు కరోనా నిబంధనల వల్ల పండుగల సంబరాలకు దూరంగా ఉన్నారు. అంత మాత్రాన పండుగల ఉత్సహాం, ఉత్తేజం తగ్గిందని కాదు. గత దశాబ్ద కాలంగా గల్ఫ్ దేశాలలో ఘనంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలు ఈ సారి సామాజిక దూరపు నిబంధనల కారణంగా భిన్నంగా జరుపుకున్నారు. అత్యధిక ప్రవాసీ కుటుంబాలు తమ ఇళ్లలోనే బతుకమ్మలు జరుపుకోగా... కొందరు ఆన్‌లైన్ విధానంలో ఇతరులతో కలిసి డిజిటల్ పండుగలను జరుపుకున్నారు. అందరితో కలిసి మెలిసి కాకుండ వేర్వేరుగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించుకోవాల్సి రావల్సిన పరిస్ధితులపై ప్రవాసీ తెలుగు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారి అందరు కలిసి అంగరంగ వైభవంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలను ఈసారి వేర్వేరుగా ఇళ్లలో నిర్వహించుకోవడం వెలితిగా ఉందని దుబాయిలో నివసించే వరంగల్ జిల్లాకు చెందిన రేవూరి సరితా రెడ్డి అన్నారు.


ఆన్‌లైన్ విధానంలో కాకుండా తాము సంప్రదాయబద్దంగా ఎంగిలి పూల బతుకమ్మను భక్తిశ్రద్ధతో జరుపుకొంటున్నట్లుగా మస్కట్‌లో ఉండే జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన పన్నీరు ఉమాదేవి చెప్పారు. సాముహికంగా కాకుండా ఇంటిలో పండుగను జరుపుకోవడం బాధగా ఉందని ఆమె పేర్కొన్నారు. కరోనా కాటుకు ఉద్యోగాలు కోల్పోయి అనేక కుటుంబాలు స్వదేశానికి తిరిగి వెళ్లడంతో సంబరాల నిర్వహణపై ప్రభావం పడిందని ఉమాదేవి అన్నారు.


బహ్రెయిన్‌లో ఈసారి తాము ఐదు వివిధ ప్రదేశాలలో బతుకమ్మ పండుగను నిర్వహించి జూమ్ ద్వార కలిసి జరుపుకున్నట్లుగా ఖమ్మం జిల్లాకు చెందిన సీహెచ్ శ్రీలత తెలిపారు. అలాగే ఖతార్‌లో కూడా తెలుగు ప్రవాసీ సంఘాలు వేర్వేరుగా బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించాయి. డాక్టర్ మిథిలా రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు కళా సమితి పక్షాన గ్లోబల్ బతుకమ్మ కార్యక్రమంలో మహిళలు పాల్గొనడం జరిగింది. మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అబ్బగోని నందిని ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన బతుకమ్మ కార్యక్రమంలో భారతీయ రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్ ఇతర భారతీయ ప్రముఖులు హాజరయ్యారు. గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఉన్న తెలంగాణ ప్రవాసీ సంఘాలు ఆన్‌లైన్ విధానంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించుకోగా వారిని ఉద్దేశించి ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత, శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ తదితరులు ప్రసంగించారు.    

Updated Date - 2020-10-26T20:21:45+05:30 IST