రీలింగ్ చేస్తున్న సెలెబ్రిటీలు.. అభిమానులకు పండగే

ABN , First Publish Date - 2020-07-10T23:02:29+05:30 IST

ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్.. సరికొత్త వీడియో షేరింగ్ ఫీచర్‌ ‘రీల్స్’ను లాంచ్ చేసింది.

రీలింగ్ చేస్తున్న సెలెబ్రిటీలు.. అభిమానులకు పండగే

హైదరాబాద్: చైనా ఉత్పత్తులపై బ్యాన్ విధించడంలో భాగంగా ఆ దేశానికి సంబంధించిన 59 యాప్స్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. వాటిలో ప్రజల్లో బాగా పాపులర్ అయిన వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ కూడా ఉంది. దీంతో దానిపై కూడా బ్యాన్ వేటు పడింది. టిక్‌టాక్‌లో వీడియోలు షేర్ చేస్తూ పాపులరైన వారికి, ఇవి చూస్తూ కాలక్షేపం చేసినవారికి ప్రభుత్వ నిర్ణయంతో ఏం చేయాలో తోచకుండా పోయింది. వీరి ఇబ్బందిని తొలగించి నెటిజన్ల ఆకలి తీర్చడం కోసం ఇతర యాప్స్ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్.. సరికొత్త వీడియో షేరింగ్ ఫీచర్‌ ‘రీల్స్’ను లాంచ్ చేసింది. దీనిలో 15 సెకన్ల వ్యవధి ఉండే వీడియోలను షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా దీనిలో జాయిన్ అయిపోయి తమ ‘రీల్స్’ షేర్ చేశారు. ఇలా చేసిన వారిలో ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ఉంది.


ఈ నేపథ్యంలో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి కూడా కొందరు సెలెబ్రిటీలు ‘రీల్స్’లో చేరిపోయారు. వారిలో ప్రముఖ నటి సమంతా అక్కినేని, హీరోయిన్స్ హన్సికా మోత్వానీ, ప్రగ్యా జైస్వాల్, సింగర్ గీతా మాధురి, యూట్యూబ్ స్టార్ జాహ్నవి దాసెట్టి ఉన్నారు. వీరంతా తమ తమ రీల్స్(15 సెకన్ల నిడివి ఉండే వీడియోలు)ను షేర్ చేశారు. ఈ వారమే ఇన్‌స్టాగ్రామ్ ఈ సరికొత్త ఫీచర్‌ను కొత్తగా పరిచయం చేసింది. దీన్ని హైదరాబాద్‌లో తొలుత ఉపయోగించిన వారిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని జాహ్నవి తెలిపారు. సమంత, గీతా మాధురి తదితరులు కూడా తమ రీల్స్ వీడియోలను షేర్ చేశారు.


ఈ వీడియోలు వారి ఫాలోవర్లందరికీ కనిపిస్తాయి. పబ్లిక్ అకౌంట్‌లో గనుక రీల్స్ షేర్ చేస్తే.. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లందరూ చూసే ఆస్కారం ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ రీల్స్‌లో వీడియోలకు ప్రత్యేక ఎఫెక్ట్‌లు కూడా వేసుకోవచ్చట. దీని కోసం రీల్స్‌లో ప్రత్యేక ఆప్షన్లు కూడా ఉన్నాయి. టిక్‌టాక్‌పై బ్యాన్ విధించిన సమయంలో ఇన్‌స్టాగ్రామ్ అందుబాటులోకి తెచ్చిన ఈ రీల్స్.. వినియోగదారులకు కచ్చితంగా నచ్చుతుందని మార్కెట్ నిపుణుల అంచనా.

Updated Date - 2020-07-10T23:02:29+05:30 IST