‘సెల్’ సేల్!

ABN , First Publish Date - 2022-03-17T08:55:30+05:30 IST

పెట్టుబడుల ఉపసంహరణ అనే గౌరవనామంతో సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సెల్) ను ప్రైవేటుకు అమ్మేస్తున్న వ్యవహారానికి సంబంధించి సోమవారం లోక్ సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి ఓ ప్రకటన చేశారు...

‘సెల్’ సేల్!

పెట్టుబడుల ఉపసంహరణ అనే గౌరవనామంతో సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సెల్) ను ప్రైవేటుకు అమ్మేస్తున్న వ్యవహారానికి సంబంధించి సోమవారం లోక్ సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి ఓ ప్రకటన చేశారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థను నందల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ అనే అస్మదీయ సంస్థకు చవుకగా అమ్మేశారన్న ఆరోపణల నేపథ్యంలో, ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన కొన్ని వివరణలు ఇచ్చారు. వేలంలో అత్యధిక మొత్తానికి ఈ ఎలక్ట్రానిక్స్ సంస్థను పాడుకున్న సదరు ప్రైవేటుసంస్థకు దాని నిర్వహణకు అవసరమైన సాంకేతిక, యాజమాన్య సమర్థతలు ఉన్నాయా? అన్నది ప్రశ్న. వేలానికి సంబంధించిన నిబంధనల్లో బిడ్డర్లకు ఈ అర్హతలుండాలని అసలు నిర్ణయించనేలేదన్నది మంత్రి సమాధానం. ఈ ‘వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ’ వెనుక అక్రమాలు, అన్యాయాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.


పెట్టుబడుల ఉపసంహరణ తాము ఆశించిన రీతిలో విజయం సాధించాలన్నా, వేలంపాడుకొనేవారు ఎక్కువ సంఖ్యలో ముందుకు రావాలన్నా ఈ రకమైన నిబంధనలు ఉండకూడదన్నది తమ విధానమని మంత్రి చెబుతున్నారు. కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చేవారికి విస్తృతమైన అవకాశాలు దక్కేట్టు చేయడం తమ లక్ష్యమని ఆయన వాదన. యాభైయేళ్ళ ఈ ప్రభుత్వరంగ సంస్థ సోలార్ ఫోటో వోల్టాయిక్ రంగంలో స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడమే కాక, రైల్వే సిగ్నలింగ్ సహా పలు వ్యవస్థల అభివృద్ధికి పాటుపడింది. దేశ రక్షణరంగానికి ఈ సంస్థ అందించిన సహకారం ఎంతో ఉంది. సీఎస్ఐఆర్, డిఆర్డీవో వంటి సంస్థలతో కలసి అనేక పరికరాలు అభివృద్ధి పరచింది. అటువంటి సంస్థను వేలానికిపెడితే, ఓ మూడు సంస్థలు ముందుకొస్తే, అంతిమంగా ఒకటి నిర్ణాయక ధర 194 కోట్ల కంటే ఓ నాలుగు కోట్లు తక్కువ కోట్ చేయడంతో, 210 కోట్లకు నందన్ ఫైనాన్స్ దీనిని దక్కించుకుంది. కొనుగోలు చేస్తున్న కంపెనీ నెట్ వర్త్ యాభైకోట్లు ఉంటే సరిపోతుందని సర్కారువారు ఉదారంగా నియమాన్ని విధించడంతో కంపెనీ సునాయాసంగా దాటింది. లాభాల్లో ఉన్న కంపెనీని అమ్మేయడం అన్యాయం, అక్రమం అని వాదిస్తే గత కాలంలో పాలకులు నీళ్ళునమిలేవారు, విధిలేకపోతే వెనక్కుతగ్గేవారు. అన్నీ అమ్మేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రస్తుత పాలకులు తాము ఎవరికీ జవాబుదారీ కాబోమని నిర్ణయించుకున్నారు. అందుకే, వేలకోట్ల విలువైన సంస్థను రెండువందలకోట్లకు అమ్మేసే దుస్సాహసానికి ఒడిగట్టారు. సంస్థ విక్రయానికి సంబంధించిన నిర్ణయం జరిగినప్పటికీ దానిచేతిలో ఉన్న ఆర్డర్ల విలువ దాదాపు పదహారువందలకోట్లు. తనవద్ద ఉన్న ఆర్డర్లతో అది భారత ప్రభుత్వానికి సుమారు ఏడువందలకోట్ల రూపాయల లాభం అందివ్వగలదని అంచనా. అలాగే, ఈ సంస్థకు చెందిన భూమి విలువ 440 కోట్ల రూపాయలని అంచనా. మేకిన్ ఇండియా, రక్షణలో స్వదేశీ వంటి మాటలు చెబుతున్న, సెమీ కండక్టర్ల తయారీలో 76వేల కోట్లు పెట్టుబడి పెడతామంటున్న పాలకులు కీలకమైన దశలో దీనిని అమ్మేయాలనుకోవడం చాలామందిని నిర్ఘాంత పరుస్తున్నది. ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో కలసి దేశరక్షణ అవసరాలను తీర్చగలిగే సమర్థత దీనికి ఉందనీ, ఉత్పత్తి నాణ్యతకు మారుపేరైన ఈ సంస్థ అమ్మకం తగనిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


ఇక, దీనిని కొనుగోలు చేస్తున్న నందన్ ఫైనాన్స్ కంపెనీ చరిత్ర సవ్యంగా లేకపోవడంతో, ఈ లావాదేవీ కేవలం పైస్థాయిలో ఇచ్చిపుచ్చుకొనే లక్ష్యంతోనే జరిగిందన్న వాదనలకు బలం చేకూరుతోంది. నందన్‌ కంపెనీకి నికరమైన ఆస్తిపాస్తులు లేవనీ, భూములు భవనాల వంటి స్థిరాస్తులు లేవనీ, లాభసాటి వ్యాపారం కూడా చేయడం లేదనీ, సదరు కంపెనీలో 99శాతం షేర్లు ఓ ఫర్నీచర్ కంపెనీ పేరిట ఉన్నాయని అంటున్నారు. అందువల్ల, ఎంతో కీలకమైన ఈ ప్రభుత్వ సంస్థను కొనుగోలు చేస్తున్న ప్రైవేటు కంపెనీకి ఆ రంగంలో ప్రవేశం కానీ, నిర్వహించే సమర్థత కానీ, సాంకేతిక అనుభవం కానీ లేకపోయినా దానిని ఇచ్చేయడం ఆశ్చర్యం కలిగించకమానదు. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ను నందన్ ఫైనాన్స్ కంపెనీ నిర్వహించదనీ, దానిని ముక్కలు చెక్కలు చేసి అమ్ముకుంటుందనీ, దాని భూములూ భవనాలూ రియల్ ఎస్టేట్ కు పోతాయని ఈ సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల భయం, ఆవేదన. దేశభక్తి, భద్రత, రక్షణ, జాతీయత వంటి మాటలను అలవోకగా ప్రయోగించేవారికి ఇదేమీ పట్టడం లేదు.

Updated Date - 2022-03-17T08:55:30+05:30 IST