వామ్మో.. సి‘మంట’..!

ABN , First Publish Date - 2021-10-11T06:13:07+05:30 IST

జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, పులివెందుల, రాయచోటి, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు, రైల్వేకోడూరు, కమలాపురం పట్టణాలతో పాటు కీలక మండల కేంద్రాల్లో భవన నిర్మాణాలు అధికంగా ఉన్నాయి.

వామ్మో.. సి‘మంట’..!

భారీగా పెరిగిన సిమెంట్‌, స్టీల్‌ ధరలు

ఓపీసీ రకం బస్తా రూ.485.. బస్తాపై రూ.70 పెరుగుదల

స్టీల్‌ టన్ను రూ.78 వేలు పైమాటే

వారం రోజుల్లో టన్నుపై రూ.5-6 వేలు పెరుగుదల

కొనగలమా.. ఇల్లు కట్టగలమా..?

ఆందోళన చెందుతున్న సామాన్యులు


సుబ్బయ్య (పేరు మార్చాం) రిటైర్డ్‌ చిరుద్యోగి. సొంత ఇల్లు కట్టుకోవాలని రూ.15 లక్షల అంచనాతో ఇంటి నిర్మాణం చేపట్టాడు. స్లాబ్‌ వేయాల్సిన కీలక సమయంలో సిమెంట్‌ ధరలు అమాంతంగా పెరిగాయి. ఇంటి నిర్మాణ వ్యయం అంచనా తారుమారైంది. కారణం సిమెంట్‌, స్టీల్‌ ధరలు భారీగా పెరగడమే. అప్పు కూడా పుట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇల్లు కట్టేదెలా..? సుబ్బయ్య ఒక్కడి పరిస్థితే కాదు.. సొంతిల్లు నిర్మాణం చేపట్టిన ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. సిమెంట్‌ కంపెనీలు వ్యాపారులకు పంపిన మెసేజ్‌ ప్రకారం ఓపీసీ రకం సిమెంట్‌ బస్తా రూ.485 పలుకుతుంది. పది రోజుల్లో బస్తాపై రూ.70.. స్టీల్‌ టన్నుపైన రూ.5 నుంచి 6 వేలు పెరిగింది. చుక్కలు తాకుతున్న ధరలతో నిర్మాణదారులు కుదేలవుతున్నారు. ఈ స్థాయిలో ధరలు పెరగడం నా 25 ఏళ్ల వ్యాపార అనుభవంలో ఎన్నడూ చూడలేదని కడపకు చెందిన ఓ సిమెంట్‌ వ్యాపారి పేర్కొనడం కొసమెరుపు. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, పులివెందుల, రాయచోటి, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు, రైల్వేకోడూరు, కమలాపురం పట్టణాలతో పాటు కీలక మండల కేంద్రాల్లో భవన నిర్మాణాలు అధికంగా ఉన్నాయి. పల్లెల్లో ఇళ్ల నిర్మాణాలపై మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో భవన నిర్మాణాల వేగం తక్కువే. డిమాండ్‌ సప్లయ్‌ సూత్రం ప్రకారం డిమాండ్‌ తక్కువగా ఉన్నప్పుడు ధరలు కూడా తగ్గుతాయి.. ఈ ప్రకారమైతే సిమెంట్‌, స్టీల్‌ ధరలు తగ్గాలి. ఇందుకు విరుద్ధంగా వాటి ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో సామాన్యులే కాదు.. బిల్డర్స్‌ (భవన నిర్మాణదారులు) ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే. వేసవిలో ఎలా ఉంటుందో..? ఇలా అయితే కొనగలమా.. ఇల్లు కట్టగలమా..? అంటున్నారు. ఒక్క కడప నగరంలో 40కి పైగా స్టీల్‌, 150 వరకు సిమెంట్‌ దుకాణాలు ఉన్నాయి. కరోనా వల్ల సగానికి పైగా పతనమైన వ్యాపారాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తరుణంలో ధరల పంటతో నిర్మాణాలు కుదేలై వ్యాపారాలు కూడా తగ్గిపోతున్నాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క ఉపాధి అవకాశాలపై భారీ దెబ్బ పడిందని, నిర్మాణాలు లేక పనులు దొరకడం లేదని భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. 


వారంల్లో బస్తాపై రూ.70 పెంపు

ప్రముఖ బ్రాండెడ్‌ సిమెంట్‌ కంపెనీలు రెండు మూడు రోజులకు ఒకసారి ధరలు పెంచుతున్నాయి. కంపెనీల సేల్స్‌ మేనేజర్లు ధరలు పెరుగుతున్నట్లు నాలుగైదు రోజు ముందే మెసేజ్‌ పెట్టి.. ఆరోజు ధరలకే డీడీలు తీయమంటూ ఆదేశాలు ఇస్తున్నారు. ధర పెరుగుతుందని వడ్డీలకు అప్పులు చేసి డీలర్లు ఆర్డర్లు బుక్‌ చేస్తున్నట్లు ఓ వ్యాపారి తెలిపారు. గత శనివారం నుంచి ఈ వారం రోజుల్లో ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీలు మూడు పర్యాయాలు ధర పెంచారు. ఈ లెక్కన బస్తాపై రూ.70 వరకు పెరిగింది. డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు కట్టుకోవాలంటే 950 బస్తాలకు పైగా సిమెంట్‌ అవసరమని ఓ బిల్డర్‌ తెలిపారు. సొంతంగా ఇల్లు కట్టుకుంటే వెయ్యి బస్తాలకు పైగా అవసరం. ఈ లెక్కన కొత్త ఇల్లు కట్టుకునేవారికి వారం రోజుల్లోనే రూ.65 వేల నుంచి రూ.70 వేలు సిమెంట్‌ రూపంలో అదనపు భారం తప్పడం లేదు. 


టన్నుపై రూ.5 వేలు పెరిగిన స్టీల్‌

స్టీల్‌ ధరలు వారంలో టన్నుపై రూ.5 నుంచి 6 వేలు పెరిగిందని ఓ వ్యాపారి తెలిపారు. ప్రముఖ కంపెనీల గ్రేడ్‌-1 రకం స్టీల్‌ వారం క్రితం టన్ను రూ.73 వేలు ఉంటే.. శనివారం రూ.78 వేలకు చేరింది. టన్నుపై రూ.5 వేలు పెరిగింది. విశాఖ స్టీల్‌ రూ.65 వేల నుంచి రూ.71 వేలకు చేరింది. అంటే.. రూ.6 వేలు పెరిగింది. అలాగే.. సాధారణ కంపెనీలకు చెందిన గ్రేడ్‌-2 రకం స్టీల్‌ రూ.56 వేల నుంచి రూ.61 వేలకు చేరింది. టన్నుపై రూ.5 వేలు పెరిగింది. డబుల్‌ బెడ్‌రూం ఇంటికి 2.5 నుంచి 3 టన్నులు అవసరమని ఇంజనీర్లు అంటున్నారు. ఈ లెక్కన పెరిగిన ధరలతో పోలిస్తే రూ.15 వేలకు పైగా భారం తప్పడం లేదు. అలాగే గతంలో ఇంటి నిర్మాణ ఇటుక రూ.6 ఉంటే తాజాగా నాణ్యతను బట్టి రూ.8-10పైమాటే. ఇసుక బంగారం అయింది. బ్లాక్‌లో కొంటే టిప్పరు రూ.30 వేలకు పైగా పలుకుతుంది. పెట్రో ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరిగాయని భవన నిర్మాణాలకు కావాల్సిన చెక్క సామాగ్రి, ఎలకి్ట్రకల్స్‌, పెయింట్స్‌ (రంగులు), టైల్స్‌, గ్రానైట్‌ బండలు.. ఇలా అన్ని రకాల సామాగ్రి ధరలు పెరిగాయని బిల్డర్లు అంటున్నారు. పెరిగిన ధరల వల్ల ఒక ఇంటి నిర్మాణానికి ఆరు నెలలు క్రితంతో పోలిస్తే.. రూ.2.50 నుంచి 3 లక్షలు అదనపు భారం తప్పడం లేదని వాపోతున్నారు. 


స్టీల్‌ టన్నుపై రూ.5 వేలు పెరిగింది

- శ్రీనివాసులు, స్టీల్‌, సిమెంట్‌ వ్యాపారి, కడప

కరోనా కారణంగా స్టీల్‌, సిమెంట్‌ వ్యాపారాలు సగానికిపైగా పడిపోయాయి. ఇప్పుడిప్పుడే వ్యాపారాలు మెరుగుపడ్డాయి. ఈ సమయంలో స్టీల్‌ కంపెనీలు ధరలు పెంచాయి. వారం క్రితం ప్రముఖ కంపెనీల గ్రేడ్‌-1 స్టీల్‌ టన్ను రూ.73 వేల నుంచి రూ.78 వేలకు చేరింది. విశాఖ స్టీల్‌ రూ.65 వేల నుంచి రూ.71 వేలకు పెరిగింది. గ్రేడ్‌-2 స్టీల్‌ టన్ను రూ.56 వేల నుంచి రూ.61 వేలకు చేరింది. ధరలు పెరగడంలో నిర్మాణాలు తగ్గిపోయి వ్యాపారాలు పతనం అవుతున్నాయి.


వారం రోజుల్లో సిమెంట్‌ ధర పెరుగుదల బస్తాపై రూ.లల్లో: 


తేదీ పీపీసీ ఓపీసీ


సెప్టెంబరు 30న 395 415

అక్టోబరు 2న 415 435

4వ తేదీ 430 450

9వ తేదీ 465 485


స్టీల్‌ ధరలు టన్నుపై రూ.వేలల్లో:


తేదీ గ్రేడ్‌-1 గ్రేడ్‌-2

4వ తేదీ 65-73 56

9వ తేదీ 71-78 61

Updated Date - 2021-10-11T06:13:07+05:30 IST