మళ్లీ సిమెంట్‌ మంట

ABN , First Publish Date - 2022-05-28T06:51:17+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్‌ ధర మరింత ప్రియం కానుంది.

మళ్లీ సిమెంట్‌ మంట

బస్తాపై రూ.55 భారం.. జూన్‌ 1 నుంచే బాదుడు

ఇండియా సిమెంట్స్‌ ఎండీ శ్రీనివాసన్‌ 

చెన్నై: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్‌ ధర మరింత ప్రియం కానుంది. ఉత్పత్తి ఖర్చుల భారం పేరుతో మరో విడత ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇండియా సిమెంట్స్‌ ఇందుకు నాంది పలుకుతోంది. జూన్‌ 1 నుంచి జూలై 1 మధ్య మూడు విడతలుగా బ్యాగ్‌ (50 కిలోలు) సిమెంట్‌ ధర రూ.55 వరకు పెంచుతామని కంపెనీ వైస్‌ చైర్మన్‌, ఎండీ ఎన్‌ శ్రీనివాసన్‌ చెప్పారు. జూన్‌ 1న రూ.20, జూన్‌ 15న రూ.15, జూలై 1న రూ.20 చొప్పున ఈ పెంపు ఉంటుదన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్లో బస్తా సిమెంట్‌ ధర కంపెనీని బట్టి రూ.330 నుంచి రూ.380 వరకు పలుకుతోంది. ఇండియా సిమెంట్స్‌ నిర్ణయంతో ఇది మరో రూ.55 పెరగనుంది. దీంతో సొంతింటి నిర్మాణం మరింత ప్రియం కానుంది. స్టీల్‌ ధరలు తగ్గుముఖం పట్టిన తరుణంలో సిమెంట్‌ కంపెనీలు ధరల పెంపునకు సిద్ధమవడం విశేషం. 


ఖర్చులన్నా రావాలి: ఉత్పత్తి ఖర్చులైనా రాబట్టుకునేందుకే ఈ పెంపునకు సిద్ధమైనట్టు శ్రీనివాసన్‌ చెప్పారు. మిగతా కంపెనీల సంగతి ఎలా ఉన్నా ఇండియా సిమెంట్స్‌ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ధరలు పెంచకపోతే నష్టాలు పెరిగిపోతాయన్నారు. మార్కెట్లో తమ బ్రాండ్‌కు మంచి పేరున్నందున, ధర పెంచినా తమ అమ్మకాలకు ఢోకా ఉండదన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇండియా సిమెంట్స్‌ అతి పెద్ద కంపెనీ. 

Updated Date - 2022-05-28T06:51:17+05:30 IST