కాలువలోకి సిమెంట్‌ లారీ : డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2021-07-27T04:45:57+05:30 IST

సిమెంట్‌ లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి మురుగు కాలువలోకి దూసుకెళ్లడంతో డ్రైవర్‌ మృతి చెందాడు.

కాలువలోకి సిమెంట్‌ లారీ : డ్రైవర్‌ మృతి

చినగంజాం, జూలై 26 : సిమెంట్‌ లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి మురుగు కాలువలోకి దూసుకెళ్లడంతో డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ సంఘటన చినగంజాం 216 నెంబరు జాతీయ రహదారి జంక్షన్‌ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ పి.అంకమ్మరావు తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా జమ్మలమడుగులోని దాల్మియా సిమెంట్‌ కంపెనీ నుంచి ఏపీ04టీటీ6667 నెంబరు గల లారీ సిమెంట్‌ లోడుతో కృష్ణా జిల్లా అవనిగడ్డకు వెళ్తోంది. ఆదివారం సాయంత్రం కంపెనీ వద్ద నుంచి సిమెంట్‌ లోడుతో కూరకు ప్రభాకర్‌ (40) బయలుదేరాడు. సిమెంట్‌ లోడుతో వస్తున్న లారీ సోమవారం వేకువజామున 4 గంటల సమయంలో చినగంజాం 216 నెంబరు జాతీయ రహదారి జంక్షన్‌ సమీపంలోని రహదారిపై గల డివైడర్‌ను ఢీకొని ఎడమవైపు గల మురుగుకాలువలోకి దూసుకెళ్లింది. మురుగుకాలువలోని మట్టిదిబ్బలు, చిల్లచెట్లలోనికి పూర్తిగా లారీ మందు భాగం కూరుకుపోవడంతో లారీలోని సిమెంట్‌ బస్తాలు అన్ని క్యాబిన్‌పై పడి  డ్రైవర్‌ ప్రభాకర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ క్యాబిన్‌ పూర్తిగా ధ్వంసం కావడంతో ఎక్స్‌కవేటర్‌ సహాయంతో డ్రైవర్‌ను బయటకు తీశారు. మృతి చెందిన  ప్రభాకర్‌ది ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి గ్రామంలోని వివేకాందనగర్‌. మృతుడి కుమారుడు నాగేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. నిద్రమత్తు వలనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-07-27T04:45:57+05:30 IST