ఇల్లు కట్టడం కష్టమే!

ABN , First Publish Date - 2021-04-12T05:18:05+05:30 IST

సొంతింటి కల.. ఇక కలగానే మారే అవకాశం ఉంది.

ఇల్లు కట్టడం కష్టమే!

  • ఆకాశాన్నంటుతున్న నిర్మాణ రంగ సామగ్రి ధరలు
  • స్టీలు, సిమెంట్‌, ఇసుక, బ్రిక్స్‌కు రోజురోజుకూ పెరుగుతున్న రేటు
  • కంపెనీల రింగ్‌తోనే సిమెంటు ధరలకు రెక్కలు


సొంతింటి కల.. ఇక కలగానే మారే అవకాశం ఉంది.  నిర్మాణరంగ సామగ్రి సిమెంటు, స్టీలు, ఇసుక, ఇటుకల ధర అమాంతం పెరిగిపోతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ధరల కారణంగా నిర్మాణాల జోలికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు.  ప్రధానంగా స్టీలు ధర ఆకాశాన్నంటుతోంది. గతేడాదితో పోల్చితే రెండింతలు పెరిగింది.


తాండూరు : వేసవి కాలంలో ఇంటి నిర్మాణం చేపడుదామనుకునే సామాన్యులకు ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణ రంగానికి సంబంధించి స్టీలు, సిమెంటు, ఇసుక, బ్రిక్స్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. స్టీలు ధర గతంతో పోలిస్తే రెండింతలైంది. సిమెంటు ధర రూ.50 నుంచి రూ.70 వరకు పెరిగింది.  దీంతో ఇంటి నిర్మాణానికి ముందుకు వేసుకున్న అంచనా పూర్తయ్యే సరికి రెండింతలవుతుంది. నిర్మాణ రంగంలో ముఖ్యమైన స్టీలు, సిమెంటు ధర పెరగడానికి కంపెనీల యాజమాన్యాలు రింగ్‌ అవడమే కారణమని వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తాండూరు పరిసర ప్రాంతంలోనే సిమెంటు కంపెనీలు ఉన్నప్పటికీ ధరలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. స్థానిక ముడి సరుకులను తీసుకుని కంపెనీలు సిమెంటును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఇతర ప్రాంతాల ప్రజలకు అమ్మే ధరకే ఇక్కడ కూడా విక్రయిస్తుండటంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. 



పెరిగిన స్టీలు, ఇసుక ధర

స్టీలు ధర గతంలో క్వింటాలు రూ.3వేల నుంచి రూ.3,500 వరకు ఉండేది. ప్రస్తుతం 8ఎంఎం, 10ఎంఎం స్టీలు క్వింటాలు ధర రూ.5,600 ఉండగా.. 12ఎంఎం, 16ఎంఎం స్టీలు క్వింటాలు ధర రూ.5,500కు పెరిగింది. దీంతో స్టీలు ధర రెండింతలైందని చెప్పవచ్చు. ఇసుక క్వింటాలు గతంలో రూ.800 ఉండగా, ప్రస్తుతం రూ.1250 పలుకుతుంది. బ్రిక్స్‌ గతంలో రూ.6 ఉండగా, ప్రస్తుతం రూ.8కి పెరిగింది. ధరలపై నియంత్రణ లేకపోవడం కూడా ధరలు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. సిమెంటు వ్యాపార రంగంలో జీరో వ్యాపారం కూడా కొనసాగుతుంది. రెండు రాష్ట్రాలకు కేంద్రంగా ఉన్న తాండూరులో నిర్మాణ రంగంలో సామగ్రి అమ్మకం విషయంలో ధరల  నియం త్రణలో చర్యలు తీసుకోకపోవడం, ఇష్టానుసారంగా స్టీలు, సిమెంటు ధరలు పెంచుతున్నారు.


జీరో వ్యాపారాన్ని అరికట్టాలి

తాండూరులో సిమెంటు జీరో వ్యాపారం కొనసాగుతుంది. దీనివల్ల డీలర్లు నష్టాన్ని చవి చూస్తున్నారు. ప్రభుత్వానికి జీఎస్టీని ఎగ్గొట్టేం దుకు, రవాణా భారం తగ్గించుకునేందుకు  స్థాని కేతర డీలర్లు సిమెంటును ఇతర ప్రాంతాలకు తరలించ కుండా తాండూరులోనే విక్రయిస్తున్నారు. కంపెనీలు కూడా వ్యాపారాన్ని పెంచుకునేందుకే ప్రయత్నిస్తున్నాయి తప్ప డీలర్లకు అండగా ఉండటం లేదు. ఇప్పటికే అనేక సిమెంటు దుకాణాలు ఎత్తివేశారు.

- రవికుమార్‌, సిమెంట్‌ వ్యాపారి, తాండూరు


ధరలపై నియంత్రణ అవసరం

ధరలపై నియంత్రణ చాలా అవ సరం. ధరలు పెరగడంతో సామా న్యుడు గూడు నిర్మించు కోవడానికి కష్టాలు పడుతున్నాడు. ప్రభుత్వం నిర్మాణ రంగానికి సంబంధించిన స్టీలు, సిమెంటు ధరలపై ఎప్పటికప్పుడు సమీక్షించి నియంత్రించాలి. ఇసుకను సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలి. 

 - అనిల్‌కుమార్‌గౌడ్‌, తాండూరు


సిమెంటు ధరలు

కంపెనీ పాత ధర(బస్తా) ప్రస్తుతం ధర(బస్తా) పెరిగింది

సీసీఐ రూ.270 రూ.340 రూ.70

అల్ర్టాటెక్‌ రూ.335 రూ.395 రూ.60

రాంకో రూ.340 రూ.390 రూ.50

పెన్నా రూ.270 రూ.320 రూ.50

చెట్టినాడు రూ.270 రూ.320 రూ.50


Updated Date - 2021-04-12T05:18:05+05:30 IST