త్వరలో సిమెంట్‌ ధరలకు రెక్కలు!

ABN , First Publish Date - 2021-12-03T07:38:54+05:30 IST

సిమెంట్‌ ధర మరింత చుక్కలంటనుంది. ప్రస్తుతం రూ.380 నుంచి రూ.385 వరకు ఉన్న 50 కిలోల సిమెంట్‌ బస్తా ధర వచ్చే కొద్ది నెలల్లో రూ.15 నుంచి రూ.20 మేర పెరగనుందని క్రిసిల్‌ అంచనా వేస్తోంది.

త్వరలో సిమెంట్‌ ధరలకు రెక్కలు!

బస్తాపై రూ.20 వరకు భారం : క్రిసిల్‌

న్యూఢిల్లీ : సిమెంట్‌ ధర మరింత చుక్కలంటనుంది. ప్రస్తుతం రూ.380 నుంచి రూ.385 వరకు ఉన్న 50 కిలోల సిమెంట్‌ బస్తా ధర వచ్చే కొద్ది నెలల్లో రూ.15 నుంచి రూ.20 మేర పెరగనుందని క్రిసిల్‌ అంచనా వేస్తోంది. అదే జరిగితే బస్తా సిమెంట్‌ ధర.. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.400కు చేర నుంది. ఈ ఏడాది ఆగస్టు, అక్టోబరులోనూ కంపెనీలు సిమెంట్‌ ధరను బ్రాండ్‌ను బట్టి రూ.20 నుంచి రూ.30 వరకు పెంచాయి.


ముడి పదార్ధాల పోటు : సిమెంట్‌ తయారీలో ప్రధాన ముడి పదార్ధాలైన బొగ్గు, పెట్‌కోక్‌ల ధరలు ఇటీవల విపరీతంగా పెరిగాయి. దిగుమతి చేసుకునే బొగ్గు ధరైతే గత  ఏడాదితో పోలిస్తే 120 శాతం పెరిగింది. పెట్‌ కోక్‌ ధరా 80 శాతం వరకు పెరిగింది. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టన్ను సిమెంట్‌ ఉత్పత్తి వ్యయం రూ.350 నుంచి రూ.400 వరకు పెరిగింది. దీనికి తోడు రవాణా చార్జీలూ 5 నుంచి 10 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని కంపెనీలు చెబుతున్నాయి.

లాభాలకూ గండి: ఉత్పత్తి ఖర్చులు బారీగా పెరిగినా, ఆ భారం మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేయలేకపోతున్నట్టు కంపెనీలు చెబుతున్నాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం టన్ను సిమెంట్‌పై స్థూల లాభం రూ.100 నుంచి రూ.150 వరకు తగ్గనుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం దేశంలో సిమెంట్‌ అమ్మకాలు 11 నుంచి 13 శాతం పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఒక్కటే పరిశ్రమకు ఉపశమనం కలిగిస్తున్నాయి.  


Updated Date - 2021-12-03T07:38:54+05:30 IST