చచ్చినా కష్టమే!

ABN , First Publish Date - 2021-03-09T05:45:50+05:30 IST

వైకుంఠధామాల నిర్మాణానికి ఉపాధిహామీ పథకం కింద అవసరమైన

చచ్చినా కష్టమే!

  • రంగారెడ్డి జిల్లాలో కొన.. సాగుతున్న శ్మశానవాటికల నిర్మాణ పనులు  
  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : వైకుంఠధామాల నిర్మాణానికి ఉపాధిహామీ పథకం కింద అవసరమైన నిధులు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు వాటి నిర్మాణాలపై శ్రద్ధచూపకపోవడంతో నిధులు వెనక్కి పోయే పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 558 గ్రామ పంచాయతీలకుగాను ఇప్పటివరకు 557 గ్రామ పంచాయతీలకు వైకుంఠధామాలు మంజూరయ్యాయి. 221 గ్రామ పంచాయతీల్లో నిర్మాణాలు పూర్తి చేయగా, ఇంకా 336 గ్రామ పంచాయతీల్లో పనులు కొనసాగుతోన్నాయి.

శ్మశాన వాటికల నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఎంతకీ నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో బాధ్యతలను పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించారు. ఉపాధిహామీ పథకం కింద గతంలో ఒక్కో నిర్మాణానికి రూ.10.36 లక్షలు మంజూరు చేశారు. ధరల పెరుగుదలతో నిర్మాణాలకు నిధులు సరిపోవని కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో ఒక్కోదానికి రూ.12.60 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో చుట్టూ ప్రహరీ, స్నానపు గదులు, దహనపు రెండు గద్దెలు, వేచి ఉండే గది నిర్మాణాలు చేపట్టాలి. అయితే నిర్మాణ పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పనులు నిర్ధేశించుకున్న లక్ష్యానికి తగినట్లు జరగడం లేదు. జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఇప్పటివరకు పలుమార్లు సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. నత్తనడకన జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ పనుల పురోగతిని తెలుసుకోవాలని, నిర్మాణ  పనుల్లో వేగం పెంచేలా చూడాలని ఆదేశించినా ఫలితం లేకుండా పోతుంది. 


పర్యవేక్షిస్తున్నాం..

క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు శ్మశాన వాటిక నిర్మాణాలను పరిశీలిస్తున్నాం. పనిచేయని అధి కారులు, సర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికే చేవెళ్ల మండలం బస్తేపూర్‌ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారిపై చర్యలు తీసుకున్నాము. జిల్లా అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాము. 

- శ్రీనివాస్‌రెడ్డి, డీపీవో 


ఈనెలాఖరు వరకు పూర్తయ్యేలా చర్యలు 

జిల్లాలో వైకుంఠధామాల నిర్మాణ  పనుల్లో వేగం పెంచేలా చర్యలు తీసుకుంటున్నాము. ఈనెలాఖరు వరకు నిర్మాణాలు పూర్తి చేసే విధంగా ముందుకు సాగుతున్నాము. జిల్లా గ్రామీణాభివృద్దిశాఖ నుంచి పంచాయతీరాజ్‌ శాఖకు పనులు అప్పగించిన్పటి నుంచి చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. 

- సురేష్‌ చంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ ఈఈ

Updated Date - 2021-03-09T05:45:50+05:30 IST