సమ్మిళిత అభివృద్ధికి కులగణన కీలకం

Published: Fri, 27 May 2022 00:40:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సమ్మిళిత అభివృద్ధికి కులగణన కీలకం

దేశంలో అమ‌ల‌వుతున్న అంబేడ్కర్ రాజ్యాంగానికి వ్యక్తి స్వేచ్ఛే పునాది. అంద‌రూ స‌మాన‌మే అన్న సిద్ధాంతంపైనే ఈ రాజ్యాంగం నిర్మిత‌మైంది. పుట్టుక‌తోనే ఒక సామాజిక వ‌ర్గం వారు ఎక్కువ‌, మ‌రొక‌రు త‌క్కువ అన్న పాత‌కాల‌పు విశ్వాసాల‌ను పూర్తిగా తిరస్కరించి నూత‌న శ‌కానికి బాట‌లు వేసిన ధర్మశాస్త్రం ఇది. ప్రభుత్వమైనా, ప్రజలైనా దీన్ని అనుస‌రించాల్సిందే. ఏ నిర్ణయమైనా దీనికి లోబ‌డే తీసుకోవాలి.


ప్రస్తుతం కులాలవారీగా జ‌నాభా లెక్కల సేక‌ర‌ణ రాజ్యాంగబద్ధమా కాదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. అంద‌రూ స‌మాన‌మ‌ని రాజ్యాంగ‌మే చెబుతున్నప్పుడు కులాలవారీ లెక్కలు ఎందుకన్న వాద‌న ప్రధానంగా విన‌బ‌డుతోంది. మ‌రో వైపు కులం జన్మతః వ‌చ్చేది. ఏ కులంలో పుట్టాలన్నది ఎవ‌రికి వారు నిర్ణయించుకునేది కాదు. దీంట్లో వ్యక్తుల ప్రమేయం ఏమీ ఉండ‌దు. ఎంత‌ వద్దనుకున్నా దేశంలో ఇదొక వాస్తవం. ఏ నిర్ణయాన్నయినా వాస్తవాల ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది కాబ‌ట్టి, కులాల వివ‌రాలు తెలుసుకుంటే త‌ప్పేమిటి, న‌ష్టం ఏమిట‌న్న ప్రతివాదనలు వినిపిస్తున్నాయి.


ప్రస్తుత సమాజ స్థితిగ‌తుల‌ను ప‌రిశీలిస్తే కుల‌గ‌ణన రాజ్యాంగబద్ధమే అవుతుంది. రాజ్యాంగం ఆశించిన స్వేచ్ఛ‌, స‌మాన‌త్వాలు ఎంత‌వ‌ర‌కు ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చాయ‌ని తెలుసుకోవ‌డానికి కులాల వివ‌రాలు ఓ గీటురాయిగా నిలుస్తాయి. ఆర్థిక ప్రగతి, ఆ కార‌ణంగా జ‌రిగే స‌మాజంలో వ‌చ్చిన మార్పుల గురించి తెలుసుకోవ‌డానికి ఇవి ఉప‌క‌రిస్తాయి. కుల‌గ‌ణన ద్వారా స‌మాజంలో విభేదాలు త‌లెత్తుతాయన్న ఆందోళ‌న‌లను, అపోహ‌ల‌ను పక్కనపెట్టి పాజిటివ్‌గా ఆలోచించాల్సిన స‌మ‌యం ఆసన్నమయింది.


కులాన్ని రెండు కోణాల్లో ప‌రిశీలించాలి. ఒక‌టి సామాజికపర‌మైన‌ది. రెండోది ఆర్థిక అంశాల‌కు సంబంధించిన‌ది. కులాన్ని ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే స‌మూహం, వ‌స్తు–సేవ‌లు అందించే బృందంగా భావించ‌వ‌చ్చు. కుల‌వృత్తికి ఆర్థిక రంగంలో ఉన్న ప్రాధాన్యం ఇంతా అంతా కాదు. ప్రస్తుతం ఎవ‌రైనా కుల‌వృత్తిని మాత్రమే చేప‌ట్టాల‌న్న నిబంధ‌న ఏమీ లేదు. న‌చ్చిన వృత్తి చేప‌ట్టుకోవ‌చ్చు. ఇది అంబేడ్కర్ రాజ్యాంగం క‌ల్పించిన సువ‌ర్ణ అవ‌కాశం. అదే స‌మ‌యంలో ఎవ‌రైనా కుల‌వృత్తిని చేసుకోవాల‌ని అనుకుంటే దాన్నీ కాద‌న‌లేరు. దానిని మ‌రింత ఆధునిక పద్ధతుల్లో, లాభ‌సాటిగా, న‌వీన సాంకేతిక విధానాల్లో నిర్వహించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఇందుకు ప్రభుత్వ చేయూత‌ తప్పనిస‌రి. ప్రభుత్వ సాయం అందాలంటే ఏ కుల‌వృత్తి స్వరూపం ఏమిటి? దాంట్లో ఎన్ని పద్ధతులు, ఎన్ని స్పెష‌లైజేష‌న్లు ఉన్నాయి? ఏ విధానాన్ని ఎంతమంది అనుస‌రిస్తున్నారు? వీటిని అభివృద్ధి చేయ‌డానికి మార్గాలేమిటి? మొత్తంగా కావాల్సిన ప్రణాళిక ఏమిటి– ఈ స‌మాచారం మొత్తం ప్రభుత్వం వ‌ద్ద ఉండాలి. అంటే ఆ కుల‌వృత్తి చేస్తున్నవారి వివ‌రాలు ప్రభుత్వం వ‌ద్ద ఉండాలి. ఇవ‌న్నీ కావాలంటే కుల‌గ‌ణ‌న జ‌ర‌గాలి.


కులాన్ని ఒక ఆర్థికాభివృద్ధి ఇంజ‌నుగా ప‌రిగ‌ణించిన‌ప్పుడు దాని గ‌ణాంకాల‌ను సేక‌రించ‌డం తప్పనిసరి అవుతుంది. ప్రణాళికల రూపకల్పనకు ఇది పునాదిగా ఉంటుంది. మ‌న దేశంలో ప్రణాళికా ర‌చ‌న రెండు రూపాల్లో జ‌రుగుతుంది. ఒక‌టి ‘ప్లానింగ్ ఫ్రం ఎబౌ’. అంటే దేశాన్ని ఒక యూనిట్‌గా ప‌రిగ‌ణించి ఎలాంటి వ‌స‌తులు క‌ల్పించాలి? ఏయే ప్రాంతాల‌కు ప్రాధాన్యం ఇవ్వాలి? త‌దిత‌ర విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. మౌలిక వ‌స‌తుల కల్పనకు ఈ విధానాన్ని అనుస‌రిస్తారు. మొత్తం దేశ ప్రయోజనాలను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉన్నందున ఈ పద్ధతే స‌రైన‌ది. ఉమ్మడి సౌక‌ర్యాల కల్పనకు ఇది మేలైన విధానం.


రెండోది ‘ప్లానింగ్ ఫ్రం బిలో’. ఇది ప్రజలకు వ్యక్తిగతంగా ల‌బ్ధి క‌లిగించి, వారి ఆర్థిక ఉన్నతికి ఉద్దేశించిన‌ది. ముందుగా క్షేత్రస్థాయిలో ప్రజల స్థితిగ‌తుల‌ను సేక‌రించి, ఆ వివ‌రాలను జాతీయ స్థాయిలో క్రోడీక‌రించి, అందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించ‌డం. దీని ద్వారా పేద‌రికం వివ‌రాలు తెలుస్తాయి. తిండిలేని వారు ఎందరు? ఇళ్లు లేని వారు ఎందరు? త‌దిత‌ర స‌మాచారాన్ని సేక‌రించ‌వ‌చ్చు. రేష‌న్ పంపిణీ, గృహ నిర్మాణం వంటి ప‌థ‌కాల‌కు ఈ వివ‌రాలు స‌రిపోతాయి. ఆధునిక కాలంలో ఇలాంటి ‘మైక్రో ప్లానింగ్‌’ ఫ‌లితాలు అందించే ఆచరణాత్మక విధానంగా మారింది.


క్షేత్ర స్థాయిలో ఉపాధి క‌ల్పించాలంటే ఏమి చేయాలి? ఏ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయాలి? ఇదే పెద్ద స‌మ‌స్య. దీని ప‌రిష్కారానికి మొద‌ట కింది స్థాయిలో ఉన్నవారు ప్రస్తుతం ఏ ప‌నులు చేస్తున్నారో తెలియాలి. వారి ఆలోచ‌న‌లు ఏమిటి? ఏమి కోరుకుంటున్నారు? ఏ విధంగా సాయం అందించాలి? త‌దిత‌ర వివ‌రాలన్నీ తెలుసుకోవాలి. అప్పుడే ఆచరణాత్మక ప‌థ‌కాల రూపకల్పన సాధ్యమవుతుంది. ఇది జ‌ర‌గాలంటే సులువైన‌ మార్గం కుల‌గ‌ణ‌నే. కొన్ని ఉత్పత్తి కులాలు దేశ‌మంత‌టా ఉన్నా, అన్ని చోట్లా ఒకే త‌ర‌హా ప‌రిస్థితులు లేవు. ఎంతో వైవిధ్యం ఉంది. ఇది తెలియాలంటే ఏ వృత్తివారు ఎక్కడ ఎంద‌రు ఉన్నారో తెలియాలి క‌దా! ఇందుకు కుల‌గ‌ణ‌న త‌ప్ప ఇంకే మార్గం ఉంది?


స‌మాన‌త్వ సాధ‌న‌లో మ‌రో అంశం న‌చ్చిన వృత్తిని, ఉపాధిని ఎంచుకోవ‌డం. ఎవ‌రి ఆస‌క్తి, శ‌క్తి సామ‌ర్థ్యాల‌కు అనుగుణంగా వారు ఇష్టమైన ప‌ని చేసుకోవ‌చ్చు. ఈ రాజ్యాంగ ఆశయం ఎంత‌వర‌కు అమ‌ల‌వుతోంద‌ని తెలుసుకోవ‌డానికి కులాల వారీ జ‌నాభా గ‌ణ‌న ఒక మార్గం. ఏదైనా ఒక కులం వివ‌రాలు సేక‌రించే సంద‌ర్భంలో కులవృత్తి చేస్తున్నవారు ఎందరు? ప్రభుత్వం, ప్రయివేటు ఉద్యోగాలు పొందినవారు ఎంద‌రు? వ్యాపారాల్లో ఎంద‌రు స్థిర‌ప‌డ్డారు? త‌దిత‌ర వివ‌రాలు సేక‌రిస్తే ఆ సామాజిక వ‌ర్గం ప‌రిస్థితి అర్థమవుతుంది. స‌మ స‌మాజ స్థాప‌న దిశ‌గా అడుగులు పడుతున్నదీ లేనిదీ తెలుస్తుంది. ప్రస్తుతం జ‌రుగుతున్న అభివృద్ధి స‌మ్మిళ‌తంగా లేదు. ఈ అంత‌రాల కార‌ణంగానే ఎస్టీ, ఎస్సీ వ‌ర్గీక‌రణ జ‌ర‌గాల‌న్న డిమాండ్లు వ‌స్తున్నాయి. దీనిని వద్దనడానికిగానీ, ఆమోదించ‌డానికిగానీ ప్రభుత్వం వ‌ద్ద ఆయా కులాల స‌మాచారం ఉండాలి క‌దా!


ఆర్థికంగా, సామాజికంగా ఏ రూపంలో అభివృద్ధి సాధించాల‌న్నా తొలుత ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక రూపొందించాలంటే అందుకు విశ్వసనీయమైన గ‌ణాంకాలు అత్యవసరం. కులాల లెక్కింపు ద్వారా ఈ వివ‌రాలు తెలుస్తున్నప్పుడు దానికి అడ్డు చెప్పడం ఎందుకు?


రాజ్యాంగంలోని మ‌రో ప్రధాన ఆశ‌యం ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు, అన్ని ద‌శ‌ల్లోనూ ప్రజలకు ప్రమేయం ఉండాలి. అది ఎంత‌వ‌ర‌కు ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చింద‌ని తెలుసుకోవ‌డానికి కులాల లెక్కలు ఒక ప్రమాణంగా ఉంటాయి. వివిధ కార‌ణాలు, ప‌రిమితుల కార‌ణంగా అన్ని సామాజిక వ‌ర్గాల వారికీ ప‌రిపాల‌న‌లో అవ‌కాశాలు రాక‌పోవ‌చ్చు. కానీ ప్రణాళికల రూపకల్పనలోనూ, ఇత‌ర సంద‌ర్భాల్లోనూ వారికి తప్పకుండా చోటు క‌ల్పించాల్సి ఉంటుంది. ఇది ఎంత‌వ‌ర‌కు జ‌రుగుతోందో తెలుసుకోవాలంటే లెక్కలు తీయాలి క‌దా! సాంకేతిక ప‌రిజ్ఞానం విస్తరించిన ఆధునిక కాలంలో ఎవ‌రు ఏ ప‌న‌యినా చేసుకోచ్చు. ఇందుకు కులం ప్రాతిప‌దిక కాకూడ‌దు. ఇది రాజ్యాంగం చెబుతున్న సూత్రమే. దీని అమ‌లును అంచ‌నా వేయ‌డానికి కూడా కులాల వారీ లెక్కలు సేక‌రించాల్సి ఉంటుంది. 


బ్రిటిషు కాలంలో కులాల వారీగా జ‌నాభా లెక్కల సేక‌ర‌ణ జ‌రిగింది. కులాల జ‌నాభా శాతాలు కొంచెం అటూఇటూగా అవే కొన‌సాగుతాయ‌న్న అభిప్రాయాలు ఉన్నాయి. శాతాలు తెలిసినప్పుడు క‌చ్చిత‌మైన సంఖ్యను లెక్కించ‌డానికి అభ్యంత‌రం ఎందుకు? ప్రస్తుతం పార్టీల‌న్నీ ‘బూత్ లెవ‌ల్ మేనేజ్‌మెంట్‌’ పేరుతో కులాలు, ఉప కులాల వివ‌రాలు సేక‌రించి, ఎవ‌రు ఎంత శాతం ఉన్నారో లెక్కలు తీస్తున్నాయి. అందువ‌ల్ల కులాల స‌మాచారం రహస్యమేమీ కాదు. అంద‌రికీ తెలిసిన స‌మాచారాన్ని అధికారికంగా లెక్కిస్తే ఇబ్బంది ఏముంది? అభ్యంత‌రాలు ఎందుకు?

గోసుల శ్రీనివాస్ యాదవ్

చైర్మన్, జన గణన వేదిక

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.