20,398.61 కోట్లే ఇస్తాం!

ABN , First Publish Date - 2021-01-25T08:33:24+05:30 IST

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2013-14 అంచనాల ప్రకారం రూ.20,398.61 కోట్లకు మించి ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేస్తోంది.

20,398.61 కోట్లే ఇస్తాం!

  • పోలవరం వ్యయంపై కేంద్రం స్పష్టీకరణ 
  • కేంద్ర కేబినెట్‌ తీర్మానానికే పరిమితం 
  • అంతకు మించి ఇచ్చేది లేదని  స్పష్టం
  • భూసేకరణ, పునరావాసంపై అసంతృప్తి 
  • రాష్ట్ర జల వనరుల శాఖలో ఆందోళన 
  • 41.15 మీటర్ల కాంటూరుకే సరిబుచ్చే యత్నం 


పోలవరంపై కేంద్ర ఆర్థికశాఖ సమాచారం.. కేబినెట్‌ తీర్మానించిన మొత్తానికే పరిమితం 

అంతకు మించి ఇచ్చేది లేదని స్పష్టం.. భూసేకరణ, సహాయ పునరావాసంపై అసంతృప్తి 


(అమరావతి-ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2013-14 అంచనాల ప్రకారం రూ.20,398.61 కోట్లకు మించి ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేస్తోంది. 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్‌ తీర్మానించిన ఈ మొత్తానికే పరిమితమవుతామని ఇటీవల రాష్ట్ర జల వనరులశాఖ వర్గాలకు వెల్లడించింది. మరోవైపు ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 45.72మీటర్ల ఎత్తుకు సరిపడా భూసేకరణ, పునరావాస కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా చేయకపోవడంపై కేంద్ర జలశక్తి శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 41.15 కాంటూరుకు సరిపడా భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు మార్చి నాటికి పూర్తి చేస్తామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జలశక్తి శాఖలకు జల వనరులశాఖ లిఖిత పూర్వక హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలైన పునరావాస కార్యక్రమాల్లో ముందడుగు పడలేదు. శాశ్వత గృహాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పూర్తి కాలేదు. పోలవరం తుది అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారులను ఇటీవల రాష్ట్ర జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి కోరారు. దీనికి వారు సమ్మతించినా, కేంద్ర ఆర్థికశాఖ మాత్రం 2017 నాటి తీర్మానం మేరకు రూ.20,398.61 కోట్లకే పరిమితమవుతామని, అంతకుమించి నిధులు మంజూరు చేయబోమని స్పష్టం చేసింది.


 41.15కాంటూరుకు సరిపడా భూసేకరణ ఇప్పటికే పూర్తయినందున సహాయ, పునరావాస పనుల కోసం వచ్చే 2నెలల్లో రూ.3,383.81 కోట్లు వ్యయం చేయాల్సి ఉందని జలవనరుల శాఖ చెబుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసే స్థితిలో లేకపోవడం ప్రతిబంధకంగా మారిందని పేర్కొంటోంది. ప్రాజెక్టు గరిష్ఠ కాంటూరు 45.72 మీటర్ల మేర భూసేకరణ, సహాయ పునరావాసం కోసం రూ.26,585.28 కోట్లు అవసరమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో ఇప్పటి వరకూ 3,110 కుటుంబాలనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు, ఇంకా 1,02,491 కుటుంబాలను తరలించాల్సి ఉంది. ముంపు బాధితుల కోసం 213 కాలనీలను నిర్మించాల్సి ఉండగా 26 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 187 కాలనీలు నిర్మించాల్సి ఉంది. మొత్తం 1,05,601 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ పూర్తయ్యే వరకూ పోలవరం గేట్లు ఎత్తేది లేదని పీపీఏ చెబుతోంది. జల వనరులశాఖ మాత్రం 41.15 మీటర్ల కాంటూరుకే మమ అనిపించే యత్నంలో ఉంది. కానీ కేంద్రం మాత్రం 45.72 మీటర్ల గరిష్ఠ మట్టానికి భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టాల్సిందేనని స్పష్టం చేస్తోంది. నిధులు మాత్రం కేంద్ర కేబినెట్‌ సమావేశం తీర్మానం మేరకు రూ.20,398.61 కోట్లేకే పరిమితం అవుతామని పేర్కొనడంపై రాష్ట్ర జల వనరుల శాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 


నేడు వైసీపీపీపీ సమావేశం

రాష్ట్రంలో పోలవరం సహా ఇతర ప్రాజెక్టులకు నిధులు రాబట్టడమే ప్రధాన అజెండాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సోమవారం జరగనుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 11గంటలకు ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు 2017-18 నాటి అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు కేంద్రం ఆమోదముద్ర వేసేలా ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యతను ఎంపీలకు అప్పగిస్తారు. అంతేకాకుండా ఆర్థిక లోటు భర్తీ, ఆర్థికసంఘం నిధులు, ఉపాధి హామీ పథకం, జీఎస్టీ ఇతరత్రా రాష్ట్రానికి రావాల్సిన వాటాలను రాబట్టడంతో పాటు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం చేస్తారు.

Updated Date - 2021-01-25T08:33:24+05:30 IST