అమ్మకం ఆగదు

ABN , First Publish Date - 2021-08-03T09:33:21+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేసే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

అమ్మకం ఆగదు

  • విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రం స్పష్టీకరణ
  • పునఃసమీక్ష ప్రసక్తే లేదని పార్లమెంటుకు వెల్లడి 
  • నూరు శాతం జరిపి తీరుతామని ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేసే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం లోక్‌సభలో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్‌ రావు కిషన్‌ రావు కరాడ్‌ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించే ప్రతిపాదన ఏదీ లేదని మంత్రి చెప్పారు. జనవరి 27న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలోనే విశాఖ ఉక్కు ప్లాంట్‌, దాని అనుబంధ సంస్థలు, ఉమ్మడి సంస్థలలో నూటికి నూరు శాతం పెట్టుబడుల ఉపసంహరణ జరపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సంస్థల్లో ప్రస్తుత ఉద్యోగులు, ఇతర లబ్ధిదారుల న్యాయపూరిత ఆందోళనలకు వాటాల కొనుగోలు ఒప్పందాల ద్వారా తగిన పరిష్కారం లభించేలా చూస్తామన్నారు. 2021లో ప్రవేశపెట్టిన నూతన ప్రభుత్వ రంగ సంస్థల విఽధానం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్ని వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర సంస్థలుగా వర్గీకరించామని, వ్యూహాత్మక సంస్థల్లో కొన్నిటికి మాత్రమే ప్రస్తుత ప్రభుత్వ రంగ సంస్థలకు హోల్డింగ్‌ కంపెనీ స్థాయిలో కనీస ఉనికి ఉంటుందని, మిగతా వాటిని ప్రైవేటీకరించడమో, ప్రస్తుత సంస్థల్లో విలీనం చేయడమో, మూసివేయడమో జరుగుతుందని వివరించారు. వ్యూహాత్మకేతర సంస్థల్లో సాధ్యమైనన్నింటిని ప్రైవేటీకరిస్తామని, మిగతా వాటిని మూసేస్తామని చెప్పారు. ఉక్కు పరిశ్రమ వ్యూహాత్మకేతర రంగం కిందకు వస్తుందని, విశాఖ ఉక్కు రూ.1369.01 కోట్ల నష్టాల్లో ఉందని తెలిపారు.


దురుద్దేశంతోనే ప్రైవేటీకరణ..

ఘన చరిత్ర గల విశాఖ ఉక్కును కేంద్రం దురుద్దేశంతోనే ప్రైవేటీకరిస్తోంది.   విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. సొంత గనులు కేటాయించాలి. రూ.22వేల కోట్ల అప్పును ఈక్విటీ కింద మార్చాలి. ప్రైవేటీకరించాల్సిన అవసరం లేద ు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ కలిసి పోరాడాలి.

-విజయసాయిరెడ్డి, వైసీపీ ఎంపీ


ప్రైవేటీకరణను అడ్డుకుంటాం..

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోడానికి ఏ స్థాయిలోనైనా పోరాడేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. ఉద్యోగుల పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. పార్లమెంటు లోపల, బయట చిత్తశుద్ధితో పోరాడుతున్నాం. 

-గల్లా జయదేవ్‌, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత 


ప్రైవేటీకరిస్తే ఊరుకోం..

విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోం. లాభాలతో నడిచే ప్లాంటును నష్టాల పేరిట అమ్మకానికి పెట్టడం ఎంతవరకు సమంజసం? వేలాది కార్మికుల జీవితాలతో ముడిపడిన అంశం. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. 

-కనకమేడల రవీంద్రకుమార్‌, టీడీపీ రాజ్యసభ సభ్యుడు 


నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి..

విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఊరుకోం. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా రాజీలేని పోరు చేపడతాం. 

-గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, కాంగ్రెస్‌ నేతలు


సీఎం నేతృత్వంలో ఢిల్లీకి అఖిలపక్షం..

రాష్ట్రంలోని అన్ని రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలను కలుపుకొని ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవడానికి ముఖ్యమంత్రి నాయకత్వం వహించాలి. తాను కూడా వస్తానని విపక్ష నేత చంద్రబాబు కూడా ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా వెళ్తే కచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి పెరిగి, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. 

-వరసాల శ్రీనివాసరావు, విశాఖ ఉక్కు జేఏసీ నేత 

Updated Date - 2021-08-03T09:33:21+05:30 IST