
నిజామాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. పట్టణంలో జరిగిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వమే వారి ధాన్యం కొనుగోలు చేయాలని సభ్యులు ఏకగ్రీవ తీర్మానాన్నీ ఆమోదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి జిల్లా పరిషత్ వరకు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. ప్రజలు, రైతులు ఏలాంటి ఎబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. విభజన చట్టంలోని అనేక హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. నీతి అయోగ్ ప్రాజెక్ట్‌లకు నిధులు మంజూరు చేయాలని చెప్పినా ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ప్రతి గింజను కేంద్రం కొనిపించే బాధ్యత తనది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారని, కానీ ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేయించే బాధ్యతను తీసుకోవాలని సంజయ్‌కు సూచించారు. సమావేశంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి