రాష్ట్ర రహదారులపై..ప్రమాదాల నివారణకు కేంద్రం కసరత్తు

ABN , First Publish Date - 2022-05-24T09:09:25+05:30 IST

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.

రాష్ట్ర రహదారులపై..ప్రమాదాల నివారణకు కేంద్రం కసరత్తు

  • 12 రాష్ట్రాలకు రూ. 7,700 కోట్లు
  • జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌
  • రూ. 360 కోట్లు ఖర్చుచేయనున్న తెలంగాణ


హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర రహదారులపైనా దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రమాదాలు అధికంగా జరుగుతున్న 12 రాష్ట్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఈ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉన్నాయి. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను.. రాష్ట్ర రహదారులపైనా అమలు చేసేలా రెండు నెలల్లో మార్గదర్శకాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ బాధ్యతలను ఆయా రాష్ట్రాల్లోని రోడ్లు-భవనాల శాఖ, పోలీసు, వైద్యఆరోగ్యం, విద్య, రవాణా శాఖలకు అప్పగించనుంది. 

 

ఐదేళ్లకు రూ. 7,700 కోట్ల నిధులు

రాష్ట్ర రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల లక్ష్యాన్ని నిర్ధారించుకుంది. అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న 12 రాష్ట్రాలకు ఈ ఐదేళ్లలో రూ. 7,700 కోట్లు కేటాయించనుంది. రాష్ట్రాలు కూడా కొంత మొత్తాన్ని కేటాయించాల్సి ఉంటుంది. కేంద్రం ఇవ్వనున్న మొత్తం నిధుల్లో 50ు కేంద్ర రహదారులు, రవాణా శాఖ ఇవ్వనుంది. మిగతా మొత్తంలో 25ు ప్రపంచ బ్యాంకు, మరో 25% ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)ల నుంచి రుణంగా పొందనుంది. తెలంగాణ ప్రభుత్వం తన వాటాగా ఏటా రూ.72 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ. 360 కోట్లను భరించాల్సి ఉంటుంది. రాష్ట్రాల వాటా విషయంలో ప్రపంచబ్యాంకు, ఏడీబీలతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒప్పందాలు కుదరాల్సి ఉందని  అధికారులు తెలిపారు.

నివారణ చర్యలు ఇలా..


జాతీయ రహదారులపై తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను భారత జాతీయ రహదారుల సాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించింది. ఈ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ఇంజనీరింగ్‌ డిజైన్లలో మార్పులు చేసింది. ఇదే విధంగా రాష్ట్రాలకు చెందిన రోడ్లు-భవనాలు, పోలీసు, రవాణా, వైద్య ఆరోగ్యం, విద్యాశాఖలు కూడా సంయుక్తంగా రాష్ట్ర రహదారులపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బ్లాక్‌స్పాట్ల గుర్తింపు, ఇంజనీరింగ్‌ డిజైన్లలో పునఃపరిశీలన, వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు, ట్రామాకేర్‌ సెంటర్లు, అంబులెన్సులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పైన పేర్కొన్న శాఖల నుంచి నోడల్‌ అధికారిని నియమించి, నివేదికలు అందిస్తారు. బ్లాక్‌స్పాట్ల గుర్తింపులో పోలీసు శాఖది కీలక పాత్ర. 

Updated Date - 2022-05-24T09:09:25+05:30 IST