మళ్లీ రైతు సంఘాలతో నేడు కేంద్ర ప్రభుత్వం చర్చలు

ABN , First Publish Date - 2021-01-22T15:11:43+05:30 IST

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం మళ్లీ రైతు సంఘాల నేతలతో చర్చలు జరపనుంది.

మళ్లీ రైతు సంఘాలతో నేడు కేంద్ర ప్రభుత్వం చర్చలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం మళ్లీ రైతు సంఘాల నేతలతో చర్చలు జరపనుంది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాల నేతలు పట్టుపట్టారు. అయితే సాగు చట్టాలను ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామని కేంద్రం తెలియజేయగా ఆ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. దీంతో ఇవాళ కొత్త ప్రతిపాదనలతో రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది.


నిన్న జరిగిన చర్చల వివరాలు..

కొత్త వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామని, సమస్యల పరిష్కారానికి సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. కేంద్రం ప్రతిపాదనపై గురువారం ఢిల్లీలో రైతు సంఘాల నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ‘‘సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పూర్తిస్థాయి జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రతిపాదనను తిరస్కరించింది’’ అని ఎస్‌కేఎం ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘ఈ ఉద్యమంలో ఇప్పటి వరకు ప్రాణాలొదిలిన 143 మంది రైతులకు ఎస్‌కేఎం నివాళులర్పించింది. వారి త్యాగాలను వృథా కానివ్వం. కొత్త సాగు చట్టాలను రద్దు చేసే వరకు వెనక్కి తగ్గం’’ అని ఎస్‌కేఎం స్పష్టం చేసింది. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ రైతు సంఘాల నేతలతో చర్చలు ప్రారంభించింది. గురువారం ఉత్తరప్రదేశ్‌ సహా 8 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది.


మూడు చట్టాల అమలును తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 11న ఆదేశాలు జారీ చేయడంతో పాటు రైతు సంఘాలు, కేంద్రం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు నలుగురు నిపుణులతో కమిటీని నియమించింది. ప్రస్తుతం ఈ కమిటీలో ముగ్గురు సభ్యులే ఉన్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు భూపీందర్‌సింగ్‌ మాన్‌ కమిటీ నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. గురువారం వేర్వేరు రైతు సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైనట్లు కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిసా, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 10 రైతు సంఘాలు ఈ భేటీలో పాల్గొన్నట్లు వెల్లడించారు. చర్చలో పాల్గొన్న ప్రతినిధులు తమ వాస్తవ అభిప్రాయాలను తెలిపారని, సాగు చట్టాల అమలులో మెరుగుపర్చాల్సిన అంశాలపై సలహాలు కూడా ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం కమిటీలో మహారాష్ట్రకు చెందిన షేట్కారీ సంఘటన అధ్యక్షుడు అనిల్‌ ఘన్వాత్‌, వ్యసాయ ఆర్థికవేత్త అశోక్‌ గులాటి, ప్రమోద్‌కుమార్‌ జోషి సభ్యులుగా ఉన్నారు.  

Updated Date - 2021-01-22T15:11:43+05:30 IST