కొత్త కరోనా వేరియంట్‌తో గుబులు.. అప్రమత్తమైన భారత్.. ఇకపై విదేశీ ప్రయాణికులను..

ABN , First Publish Date - 2021-11-26T23:39:47+05:30 IST

బోత్సువానా, దక్షిణాఫ్రికా, హాంగ్‌కాంగ్‌లో ఇటీవల ఉనికిలోకి వచ్చిన కొత్త కరోనా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుబులు రేపుతోంది. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందనుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిందన్న వార్త ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ క్రమంలో భారత్ కూడా అప్రమత్తమైంది. ఇకపై...

కొత్త కరోనా వేరియంట్‌తో గుబులు.. అప్రమత్తమైన భారత్..  ఇకపై విదేశీ ప్రయాణికులను..

ఇంటర్నెట్ డెస్క్: బోత్సువానా, దక్షిణాఫ్రికా, హాంగ్‌కాంగ్‌లో ఇటీవల ఉనికిలోకి వచ్చిన కొత్త కరోనా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుబులు రేపుతోంది. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందనుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిందన్న వార్త ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ క్రమంలో భారత్ కూడా అప్రమత్తమైంది. అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసింది. భారత్‌కు వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులు, ముఖ్యంగా ఆఫ్రికా ఖండం మీదుగా వచ్చిన వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు సెక్రెటరీ రాజేష్ భూషన్ రాష్ట్రాలకు గురువారం లేఖ రాశారు. 


లేఖలో ఏముందంటే..

కొత్త కరోనా వేరియంట్ బీ. 1.1.1529 కారణంగా బోత్సువానాలో నాలుగు కేసులు, దక్షిణాఫ్రికాలో 22 కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. హాంకాంగ్‌లో కూడా రెండు కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయన్నారు. ఇతర వేరియంట్ల కంటే బీ. 1.1.1529 వైరస్‌లో జన్యుమార్పులు అధికంగా ఉన్న విషయాన్ని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి నిబంధనలు సరళతరం చేసిన ప్రస్తుత తరుణంలో ఈ వైరస్ ప్రజారోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 


అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో కట్టుదిట్టంగా నిబంధనల అమలు!

ఇకపై అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో టెస్టింగ్, ట్రేసింగ్  నిబంధనలు మరింత పటిష్టంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ముఖ్యంగా కొత్త వేరియంట్ కారణంగా రిస్క్ ఎదుర్కొంటున్న దేశాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించనుంది. ఆయా దేశాల నుంచి, లేదా వాటి మీదుగా వచ్చే ప్రయాణికులు, వారిని కలుసుకున్న వారి విషయంలో కాంటాక్ట్ ట్రేసింగ్ పటిష్టంగా నిర్వహించనుంది. 


కొత్త వేరియంట్‌పై నిఘా ఇలా.. 

ఇండియన్ సార్స్ కొవ్-2 జెనెటిక్స్ కన్సార్షియమ్ ప్రస్తుతం దేశంలో వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్లతో పాటూ కొత్త వేరియంట్లనూ నిశితంగా పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం తాజా మార్గదర్శకాల ప్రకారం.. అంతర్జాతీయ ప్రయాణికుల రక్తనమూనాలను ఈ కన్సార్షియమ్ ఆధ్వర్యంలోని పరిశోధనశాలలకు పంపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. రాష్ట్రల అధికారులు ఈ కన్సార్షియమ్‌‌తో సమన్వయపరుచుకుంటూ కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్ చేపట్టాల్సి ఉంటుంది. 


ఇప్పటివరకూ కొత్త వైరస్ గురించి అధికారులు ఏమన్నారంటే..

కొత్త వేరియంట్ కారణంగా మొత్తం 22 కేసులు నమోదయ్యాయని దక్షిణాఫ్రికా అంటువ్యాధుల అధ్యయన సంస్థ గురువారం నాడు ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి సమాజంపై ఎటువంటి ప్రభావం చూపించబోతోందని తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తున్నామని పేర్కొంది. పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, అయితే.. తాజా పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని పేర్కొంది. తమ దేశంలో రెండు కేసులు వెలుగు చూశాయని హాంగ్‌కాంగ్ ప్రభుత్వం పేర్కొనగా.. బోత్సువానా ప్రభుత్వం నాలుగు కేసులు బయటపడ్డాయని పేర్కొంది. అంతేకాకుండా.. కొత్త వేరియంట్ బారినపడ్డ నలుగురు వ్యక్తులూ గతంలో కరోనా టీకా తీసుకున్న వారేనని పేర్కొంది. 

 

Updated Date - 2021-11-26T23:39:47+05:30 IST