కేంద్రం సహకరించట్లేదు!

ABN , First Publish Date - 2022-04-06T07:22:36+05:30 IST

సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి జీనోమ్‌వ్యాలీ

కేంద్రం సహకరించట్లేదు!

  • జీనోమ్‌వ్యాలీ లింక్‌ ప్రతిపాదనలపై స్పందించడం లేదు
  • ‘జాంప్‌ ఫార్మా’ ప్రారంభోత్సవంలో కేటీఆర్‌ వ్యాఖ్యలు
  • తెలంగాణలో పరిశ్రమలకు రాచబాట
  • టీఎ్‌సఐపాస్‌ ద్వారా రూ.2.2లక్షల కోట్ల పెట్టుబడులు
  • విప్రో కన్జ్యూమర్‌కేర్‌ కంపెనీ ప్రారంభంలో కేటీఆర్‌
  • తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు: అజీమ్‌ ప్రేమ్‌జీ

 

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి జీనోమ్‌వ్యాలీ అనుసంధానానికి తాము ఎన్నో ప్రతిపాదనలు చేసినా కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చెప్పారు. నిధులు కేటాయించేందుకూ సిద్ధంగా ఉన్నట్లు తెలిపామన్నారు. అయినా కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం కర్కపట్లలో నూతనంగా నిర్మించిన జాంప్‌ ఫార్మా కంపెనీని కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్షణ శాఖ భూముల కోసం కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నామన్నారు.


జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట్‌ రోడ్డును విస్తరించాలనేది తమ లక్ష్యమని చెప్పారు. సుచిత్ర నుంచి పాట్నీ, ప్యారడైజ్‌ రోడ్డు కోసం కూడా భూములు అడుగుతున్నామని గుర్తు చేశారు. తాము నిధులు, ప్రణాళికలతో సిద్ధంగా ఉండి ఆరేడేళ్ల నుంచి కేంద్రానికి వినతులు పంపుతున్నా.. ఎలాంటి స్పందన లేదని తెలిపారు. అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లో జీనోమ్‌ వ్యాలీ క్లస్టర్‌ వంటి వాటిని కేంద్రం ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణలో రూ.250 కోట్లతో జాంప్‌ ఫార్మా కంపెనీని నెలకొల్పడం సంతోషకరమైన విషయమన్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా 200 మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. కంపెనీ నిర్వాహకులు ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. ఈ కంపెనీ కెనడా తర్వాత హైదరాబాద్‌లోనే మరో శాఖను ఏర్పాటు చేయడం మనకు గర్వకారణమన్నారు.


గుజరాత్‌ పారిశ్రామికవేత్తలు అహ్మదాబాద్‌ కంటే హైదరాబాద్‌నే ఎక్కువగా ఇష్టపడుతున్నారని చెప్పారు. జీనోమ్‌ వ్యాలీ ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా మారిందని చెప్పారు. ప్రస్తుతం 50 బిలియన్‌ డాలర్లుగా ఉన్న జీనోమ్‌ వ్యాలీ పెట్టుబడులు.. 2030 కల్లా 100 బిలియన్‌ డాలర్లకు చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గ్లోబల్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ వాటా 33 శాతం ఉందని కేటీఆర్‌ గుర్తుచేశారు. అనేక ప్రతిష్ఠాత్మక ఫార్మా కంపెనీలు జీనోమ్‌ వ్యాలీలో ఉన్నాయన్నారు. దీనికి దగ్గరలోనే ఫైవ్‌ స్టార్‌ హోటళ్లూ రానున్నాయని మంత్రి తెలిపారు. బీ-హబ్‌ ప్రారంభించి బయోలాజికల్‌ పరిశోధనలకు తోడ్పాటు అందించనున్నట్లు చెప్పారు.


లైఫ్‌సైన్సె్‌సలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ 1గా ఉందన్నారు. జీనోమ్‌వ్యాలీ కోసం మరో 400 ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు మంచి సహకారాన్ని అందిస్తోందని జాంప్‌ ఫార్మాగ్రూప్‌ సీనియర్‌ వైస్‌ చైర్మన్‌ సుకంద్‌ జునేజా తెలిపారు. ప్రభుత్వంతో కలిసి పని చేసి, రాష్ట్ర ప్రగతికి కృషి చేస్తామన్నారు. విప్రోసంస్థ రాకతో మహేశ్వరం రూపురేఖలు మారిపోనున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పెట్టుబడులు వచ్చేవిధంగా స్థానికులు సహకరించినప్పుడే వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. 



మీ జీవితం అందరికీ ఆదర్శం: కేటీఆర్‌

తెలంగాణలో పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నందున పెట్టుబడులు పెట్టేందుకు బడా పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. మహేశ్వరం కేసీ తండాలో నెలకొల్పిన విప్రో కన్జ్యూమర్‌ కేర్‌ కంపెనీని విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ, మంత్రి సబితారెడ్డితో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. టీఎ్‌సఐపాస్‌ ద్వారా వేగంగా అనుమతులు ఇవ్వడంతో రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం వల్లే అజీమ్‌ ప్రేమ్‌జీ లాంటి వారు మహేశ్వరంలో రూ.300 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేశారన్నారు.  కంపెనీ ఏర్పాటుతో 900 మంది స్థానికులకు ఉపాధి దొరికిందన్నారు. అజీమ్‌ ప్రేమ్‌జీ జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన తత్వం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్రంలో ఎల్‌ఈడీ పరిశ్రమతో పాటు విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించాలని ప్రేమ్‌జీని కోరారు. 


మరిన్ని పెట్టుబడులు: ప్రేమ్‌జీ

తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు మంచి ప్రోత్సహకాలు కల్పిస్తోందని అజీమ్‌ ప్రేమ్‌జీ కొనియాడారు. పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం వల్ల మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు. తాము తెలంగాణలో నిరంతర పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నామని, తద్వారా స్థానికులకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.


Updated Date - 2022-04-06T07:22:36+05:30 IST