కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: సీపీఐ

ABN , First Publish Date - 2020-07-07T07:54:18+05:30 IST

కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: సీపీఐ

కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: సీపీఐ

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కరోనాను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ విమర్శించారు. ప్రభుత్వాస్పత్రికి చెందిన వైద్యాధికారిణి వద్ద ఒక్కరోజు చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రి 1.5లక్షలు డిమాండ్‌ చేయడం దారుణమని మండిపడ్డారు. కరోనా నియంత్రణ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని ఆయన దుమ్మెత్తిపోశారు. మరోవైపు.. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో, ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో అన్ని రాజకీయపార్టీలను కలుపుకుని పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాంతో కలిసి ఆయన మలక్‌పేటలోని మహబూబ్‌ మాన్షన్‌, దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం పర్యటించారు. కరోనా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పేదలు ఉపాధి దొరుకుతుందని ఆశపడ్డారని.. కానీ తిండి గింజలు కూడా దొరకని దుస్థితి దాపురించిందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు 12కిలోల బియ్యం, పప్పులు, నూనెతోపాటు రూ. 7500 నగదు సాయం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా.. రాజోలి బండ డైవర్షన్‌ స్కీం(ఆర్‌డీఎస్‌) 29వ డిస్ట్రిబ్యూటర్‌ నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరం పాటు కాలువలో పూడిక నిండిపోయిందని తెలుపుతూ చాడ వెంకట్‌రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాశారు. వెంటనే పూడిక తీత పనులు చేపట్టాలని వారికి లేఖలో విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. రాష్ట్రంలో విస్తృత స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించి, ప్రజలకు భరోసానివ్వాలని సీపీఎం రాష్ట్ర  కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయనకు ఒక లేఖ రాశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే, చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం వైద్యుల్ని, సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-07T07:54:18+05:30 IST