ఉక్కుపై ముందుకే...!

ABN , First Publish Date - 2021-03-09T06:55:00+05:30 IST

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ కుండ బద్దలు కొట్టేశారు.

ఉక్కుపై ముందుకే...!

వెనక్కి తగ్గని కేంద్రం

100 శాతం ప్రైవేటీకరిస్తాం

లోక్‌సభలో స్పష్టంచేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

ఏపీ ప్రభుత్వం సాయం కోరినట్టు ప్రకటన

బీజేపీ తీరుపై నిరసన వెల్లువ

ప్లాంటు ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించదని

వైసీపీ పెద్దలు ప్రకటన చేయాలని విపక్షాల డిమాండ్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ కుండ బద్దలు కొట్టేశారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్లాంటుపై పార్లమెంటులో సోమవారం ప్రశ్నించగా, ఆమె చాలా స్పష్టంగా, సూటిగా ఈ విషయం వెల్లడించారు. విశాఖపట్నం ప్లాంటులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి వాటాలు లేవని, ప్రైవేటీకరణతో సంబంధం కూడా లేదని స్పష్టంచేశారు. అయితే, దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించామని, సహకారం కోరామని ఆమె వివరించారు. ప్రైవేటీకరణపై కేంద్రం వైఖరి స్పష్టం కావడంతో రాష్ట్రంలో బీజేపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ భగ్గుమంటున్నాయి. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్లాంటు పరిరక్షణ పోరాట కమిటీ ప్రకటించింది. విశాఖ స్టీల్‌ప్లాంటు పరిపాలన భవనాన్ని మంగళవారం ముట్టడిస్తామని తెలిపింది. 


రాష్ట్ర బీజేపీ ఇప్పుడే ఏమంటుంది?


స్టీల్‌ప్లాంటుని ప్రైవేటీకరిస్తారని ఎవరు చెప్పారు? అంతా కలిసి బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రైవేటీకరణ ఆపాలంటూ రాష్ట్ర నాయకులంతా కలిసి పలు మార్లు ఢిల్లీ వెళ్లి అగ్రనేతలను కలిశారు. ఎవరూ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ప్రధాని నరేంద్ర మోదీ అయితే వారికి అపాయింట్‌మెంటే ఇవ్వలేదు. చేసేదేమీ లేక ఇక్కడికి వచ్చి...ప్లాంటు ప్రైవేటీకరణ జరగదంటూ కబుర్లు చెప్పుకొచ్చారు. విశాఖలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అయితే, స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ ఇప్పుడే జరగదని, చాలాకాలం పడుతుందని పేర్కొన్నారు. కానీ ప్లాంటు ఆస్తుల అమ్మకాల ప్రక్రియ మరోవైపు వేగవంతమైంది. హెచ్‌బీ కాలనీలో క్వార్టర్లను తొలగించి ఆ భూములను విక్రయించడానికి ఎన్‌బీసీసీఎల్‌తో ఒప్పందం చేసుకుంది. అక్కడ 22.19 ఎకరాలు అమ్మితే వేయి కోట్ల రూపాయలు వస్తాయని అంచనా కూడా వేశారు. ఇలా ఓ వైపు ఆస్తుల విక్రయం జరిగిపోతుంటే...తాము ఎలాగైనా అడ్డుకుంటామని  రాష్ట్రంలో అధికారంలో వున్న వైసీపీ నాయకులు, రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. వీటిని ఇతర రాజకీయ పార్టీలు ఏవీ విశ్వసించడం లేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన నేపథ్యంలో...ఇప్పుడు బీజేపీ దీనికి ఏమి సమాధానం చెబుతుందని వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రైవేటీకరణకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని కేంద్ర మంత్రి చాలా స్పష్టంగా చెప్పారని, దానికి ఇప్పుడు వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించదని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన చేయాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు.  


ఉక్కుపై టీడీపీ ఎంతవరకైనా వెళుతోంది

పల్లా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఎంతవరకైనా వెళుతుంది. అయితే అధికార పార్టీ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాలి. గతంలో ఒకసారి ప్లాంటును కాపాడుకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసింది. అటువంటి పోరాటం ఇప్పుడు అధికార వైసీపీ చేయాలి. విశాఖలో పాదయాత్రలు చేయడం కాదు. ఢిల్లీలో పాదయాత్రలు చేసి ఉద్యమం నిర్వహించాలి. వైసీపీ చేపట్టే ఉద్యమానికి తెలుగుదేశం మద్దతు ఇస్తోంది.


సొంత గనులు ఎందుకు ఇవ్వలేదో ప్రకటించాలి

సీహెచ్‌.నరసింగరావు, చైర్మన్‌ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

స్టీల్‌ప్లాంటును ఎందుకు ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారో, ఇప్పటివరకు సొంత గనులు ఎందుకు ఇవ్వలేదో కేంద్రం తక్షణమే ప్రకటించాలి. ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిని కేంద్రంలోని బీజేపీ విడిచిపెట్టాలి. ఉభయ రాష్ట్రాల ప్రజలు వ్యతిరేకిస్తున్నా ముందుకువెళ్లడం తగదు. మంగళవారం అడ్మిన్‌ ఆఫీసు ముట్టడిస్తాం. ఆ తరువాత బీజేపీకి వ్యతిరేకంగా మూడు భారీ కార్యక్రమాలు చేపడతాం. ఛలో పార్లమెంటు కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్ర మంత్రి చెప్పడం అవాస్తవం. కార్మిక సంఘాలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయం. 


రాజకీయాలకు అతీతంగా పోరాటం

జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఐ నాయకులు

కేంద్ర మంత్రి ప్రకటనతో బీజేపీ ద్వంద్వ వైఖరి బయట పడింది. స్టీల్‌ప్లాంటును రక్షించుకోవడానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి పోరాటం ఉధృతం చేయాలి. కేంద్రం ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి కార్యాచరణ రూపొందించాలి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించామని మంత్రి పేర్కొన్నారు. అంటే ఈ ద్రోహంలో ఇక్కడి ప్రభుత్వానికి వాటా ఉంది.


Updated Date - 2021-03-09T06:55:00+05:30 IST