Central Finance Ministry Serious On Jagan Govt: జగన్ సర్కార్ తీరుపై కేంద్ర ఆర్థిక శాఖ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-05-14T22:28:37+05:30 IST

ఏపీ సర్కార్ తీరుపై కేంద్ర ఆర్థిక శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్‌పై వెంటనే వివరాలు పంపాలని లేఖ రాసింది. గతంలో అప్పులపై రాసిన లేఖకు..

Central Finance Ministry Serious On Jagan Govt: జగన్ సర్కార్ తీరుపై కేంద్ర ఆర్థిక శాఖ ఆగ్రహం

న్యూఢిల్లీ: ఏపీ సర్కార్ తీరుపై కేంద్ర ఆర్థిక శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్‌పై వెంటనే వివరాలు పంపాలని లేఖ రాసింది. గతంలో అప్పులపై రాసిన లేఖకు ఏపీ సర్కార్ సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో.. డీఓపీటీ అధికారులపై ఫిర్యాదు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది. తాజాగా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్‌పై ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం వివరాలు అడిగింది. కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా తీసుకున్న రుణాలపై కేంద్ర ఆర్థిక శాఖ వివరాలు కోరింది. కేంద్రం కన్నుగప్పి అప్పులు తెచ్చారని పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. ఆయా బ్యాంకుల నుంచి వివరాలు సేకరించారు. రూ.75వేల కోట్ల పైబడి ఉందని బ్యాంకుల నుంచి సమాచారం అందింది. కేంద్రం నుంచి లేఖ రావడంతో ఏపీ ఆర్థిక శాఖలో ఆందోళన మొదలైంది. 10 రోజుల్లో సమాధానం పంపాలని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.



2021-22లో కేంద్రం ఏపీకి రూ.42,472 కోట్లు అప్పు చేసుకోవడానికి అనుమతిచ్చింది. అయితే... గత మూడేళ్లలో రాష్ట్రం కేంద్రం ఇచ్చిన అనుమతి కంటే అదనంగా రూ.17వేల కోట్లు అప్పు చేసింది. దీంతో... ఆ మొత్తానికి కోత పెట్టి ఈ ఆర్థిక సంవత్సరం రూ.25,472 కోట్లకు మాత్రమే కేంద్రం అనుమతించింది. అయితే... ‘ఒకేసారి అంత కోస్తే భరించలేం. దానిని మూడేళ్లకు సర్దుబాటు చేయండి’ అని రాష్ట్రం కోరింది. ఇందుకు కేంద్రం అనుమతించిందా, లేదా అనే సంగతి పక్కనపెడితే... రాష్ట్ర సర్కారు యథేచ్ఛగా అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం సహకరిస్తూనే ఉంది. ఇప్పటి వరకు తెచ్చిన అప్పులు చాలవన్నట్టు జనవరి, ఫిబ్రవరి, మార్చి కోసం అదనంగా రూ.27,325 కోట్ల అప్పు కావాలని సీఎం జగన్‌ కోరడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం ఫిబ్రవరి 8వ తేదీ వరకు అనుమతిచ్చిన రూ.40,655 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆర్‌బీఐలో సెక్యూరిటీలు వేలం వేయడం ద్వారా మాత్రమే తెచ్చింది. ఈఏపీలు, నాబార్డు, ఎన్‌సీడీసీ రూపంలో తీసుకున్న అప్పులను, ఉద్యోగులకు సంబంధించి వాడుకున్న జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ నిధులను కూడా కలిపితే... మరో రూ.20వేల కోట్ల వరకు ఉంటాయి. 2021 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు 9 నెలల్లో జగన్‌ ప్రభుత్వం రూ.58,142 కోట్ల అప్పులు చేసినట్టు డిసెంబరు నెలకు సంబంధించిన నివేదికలో ‘కాగ్‌’ వెల్లడించింది. అంటే, కేంద్రం ఇచ్చిన అనుమతులకంటే వైసీపీ ప్రభుత్వం రూ.18,000 కోట్ల అప్పులు అదనంగా చేసింది.



రూ.4.13 లక్షల కోట్లకు పబ్లిక్‌ డెట్‌ ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం 2021 మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్ర పబ్లిక్‌ డెట్‌ రూ.3.55 లక్షల కోట్లుగా ఉంది. ఆ తర్వాతి 9 నెలల్లో రూ.58,142 కోట్ల అప్పు చేసినట్టు కాగ్‌ స్వయంగా వెల్లడించింది. వెరసి... ప్రస్తుతం రాష్ట్ర పబ్లిక్‌ డెట్‌ రూ.4.13 లక్షల కోట్లకు చేరుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3) ప్రకారం ఈ అప్పు మొత్తానికి కౌంటర్‌ గ్యారంటీ ఉన్నట్టే. రాష్ట్రంలో కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని జగన్‌ సర్కార్‌ చేస్తున్న అప్పుల స్కామ్‌పై కేంద్రానికి ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయి. అయినప్పటికీ కేంద్రం ఏపీకి ధారాళంగా అప్పులకు అనుమతి ఇస్తోంది. అవి కూడా చాలవని... మళ్లీ మళ్లీ అప్పుల కోసం ఎప్పటికప్పుడు రాష్ట్రం కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది.


కొత్త అప్పు 2వేల కోట్లు..ఓడీ కింద జమ

ఆర్‌బీఐలో రాష్ట్ర సెక్యూరిటీలు వేలం వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్లు అప్పు చేసింది. అవి రాష్ట్ర ఖజానాకు రాకుండానే పాత అప్పుల చెల్లింపు కింద జమ అయ్యాయి. ఆర్‌బీఐ వద్ద రాష్ట్రం దాదాపు రూ.2,000 కోట్లకు పైగా ఓడీలో ఉంది. దీంతో ఆర్‌బీఐ ఆ డబ్బులను ఓడీ కింద జమ చేసుకుంది. ఈ అప్పులో రూ.1000 కోట్లకు కాలపరిమితి 16 ఏళ్లు కాగా, మరో రూ.1000 కోట్లకు కాలపరిమితి 20 ఏళ్లు. ఈ రూ.2,000 కోట్లపై అత్యధికంగా 7.37 శాతం వడ్డీ పడింది. రాష్ట్ర క్రెడిట్‌ రేటింగ్‌ పాతాళానికి దిగజారడంతో అధిక వడ్డీ ఆశజూపితేగానీ ఇన్వెస్టర్లు ఏపీ సెక్యూరిటీలు కొనడానికి ముందుకు రావడం లేదు.

Read more