సమాఖ్య పద్ధతిపై సమ్మెట పోటు

ABN , First Publish Date - 2022-05-28T06:20:22+05:30 IST

‘కేంద్ర–రాష్ట్ర సంబంధాలు ప్రస్తుతమున్నంత బలహీనంగా ఇంతకుముందెన్నడూ లేవు’ అని గత వారం ఇదే కాలమ్ (మే 21, ‘పునర్నవంగా ఆర్థిక సంస్కరణలు’)లో రాశాను.

సమాఖ్య పద్ధతిపై సమ్మెట పోటు

‘కేంద్ర–రాష్ట్ర సంబంధాలు ప్రస్తుతమున్నంత బలహీనంగా ఇంతకుముందెన్నడూ లేవు’ అని గత వారం ఇదే కాలమ్ (మే 21, ‘పునర్నవంగా ఆర్థిక సంస్కరణలు’)లో రాశాను. ఈ పరిస్థితిని మరింతగా విషమింపచేసే మరో పరిణామం ఒకటి సంభవించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 21న పెట్రోల్ ధర లీటర్‌కు రూ.8 చొప్పున, డీజిల్ ధర లీటర్‌కు రూ.6 చొప్పున తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఇంధన ధరల తగ్గింపునకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆ రోజు రాత్రి చాలా పొద్దు పోయిన తరువాత మాత్రమే విడుదల చేశారు. ఫలితంగా అన్ని ఛానెల్స్, వార్తా పత్రికలు ఆ తగ్గింపును ‘ఎక్సైజ్ సుంకాల’లో తగ్గింపుగా భావించి, తదనుగుణంగా వార్తలు నివేదించాయి. వాస్తవానికి తగ్గించినవి ఎక్సైజ్ సుంకాలు కావు, అదనపు ఎక్సైజ్ సుంకాలు మాత్రమే (ఎక్సైజ్ సుంకాల ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇస్తారు. అదనపు ఎక్సైజ్ సుంకాల ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వరు).

నిర్మలా సీతారామన్ మే 22న రాష్ట్రాలకు ఒక సవాల్ విసిరారు: ‘నేను సుంకాలను తగ్గించాను, ఇక ఇప్పుడు మీరు వ్యాట్ (వ్యాల్యూ ఏడెడ్ ట్యాక్స్– వస్తుసేవల ధరకు అదనంగా కలిపే పన్ను) తగ్గించండి’. ప్రజా హిత నిర్ణయాలు తీసుకోవడంలో రాష్ట్రాల కంటే కేంద్రం చాలా మెరుగ్గా వ్యవహరిస్తుందని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఆమె ఈ సవాల్ విసిరారు. ఇంధన రంగంలో కేంద్రానికి పన్నుల రూపేణా లభిస్తున్న ఆదాయాన్ని పరిశీలిస్తే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని రాష్ట్రాలను కోరడం సమంజసం కాదని చెప్పి తీరాలి.


అంకెలు అబద్ధాలు చెప్పవు కదా. తొలుత ఇంధన సుంకాల ‘తగ్గింపు’ను విశ్లేషిద్దాం. అదనపు ఎక్సైజ్ సుంకం (దీన్నే రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ అని కూడా అంటారు), స్పెషల్ ఎడిషినల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఎఇడి), అగ్రికల్చర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్‌మెంట్ సెస్ (ఎఐడిసి) నుంచి నుంచి సమకూరే ఆదాయంలో కేంద్రం ఎటువంటి వాటాను రాష్ట్రాలకు ఇవ్వదు. 2014లో లీటర్ పెట్రోల్ ధరలో అన్ని ఎక్సైజ్ సుంకాల మొత్తం రూ.9.48 కాగా, లీటర్ డీజిల్ ధరలో వాటి మొత్తం రూ.3.56‍గా ఉండేది. 2022 మే 21న కేంద్రం ఆ సుంకాల మొత్తాన్ని లీటర్ పెట్రోల్ ధరలో రూ.27.90కి, లీటర్ డీజిల్ ధరలో రూ.21.80కి పెంచింది. రెండిటి మీదా కలిపి సుంకాల పెరుగుదల సగటున రూ.18కి పైగా ఉంది. ఉమ్మడి పన్ను ఆదాయాలలో 59 శాతం కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుండగా మిగతా 41 శాతాన్ని అన్ని రాష్ట్రాలు (ఫైనాన్స్ కమిషన్ నిర్ణయించిన శాతాల ప్రకారం)పంచుకోవల్సి ఉన్నది. పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాల నుంచి రాష్ట్రాలకు లభించే మొత్తం అతి స్వల్పం. లీటర్ పెట్రోల్‌కు రూ.57.4 పైసలు, లీటర్ డీజిల్‌కు 73.8 పైసలు మాత్రమే రాష్ట్రాలకు లభిస్తాయి. ప్రాథమిక ఎక్సైజ్ సుంకం ద్వారా చెప్పుకోదగిన లాభమూ సమకూరదు, చెప్పుకోదగిన నష్టమూ వాటిల్లదు. ఉమ్మడి ఎక్సైజ్ సుంకాలు నిజమైన రాబడి సాధనాలు కానేకావు. పెట్రోల్, డీజిల్ విషయంలో వాటిని రూ.18కి పైగా పెంచిన ప్రభుత్వం మే 22న పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.8, రూ.6 చొప్పున తగ్గించింది! రెండు చేతులా తీసుకుని ఒక చేత్తో ఇవ్వడమంటే ఇదే కాదూ?!


పెట్రోల్, డీజిల్ విక్రయాల నుంచి కేంద్రం ఆర్జిస్తున్న రాబడిలో రాష్ట్రాలకు ఇసుమంత వాటా కూడా లభించడం లేదన్నది స్పష్టం. రాష్ట్రాల ప్రధాన ఆదాయ వనరు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ (మరో ఆదాయ వనరు మద్యంపై పన్నులు). రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం ఆదాయంలో సొంత ఆదాయ వనరుల నిష్పత్తి క్రమంగా క్షీణించిపోవడం గమనార్హం). ఈ పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించమని రాష్ట్రాలను అడగడం వాటికి యాచించక తప్పని పరిస్థితి కల్పించడమే. ప్రధాన ఆదాయ వనరు అయిన వ్యాట్‌ను తగ్గించడమంటే ఆదాయాన్ని కోల్పోవడమే. అప్పుడు మరిన్ని రుణాలు తీసుకోవడం (ఇందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవలసి ఉంది) లేదా భిక్షాపాత్ర పట్టుకుని కేంద్రం వద్దకు వెళ్ళి మరిన్ని సహాయక నిధులు మంజూరు చేయమని యాచించడం రాష్ట్రాలకు అనివార్యమవుతుంది. ఇదే జరిగితే రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్ర్యం హరించుకుపోతుంది. అయినా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అడిగినట్టుగా నాలుగు రాష్ట్రాలు– తమిళనాడు, కేరళ, మహరాష్ట్ర, రాజస్థాన్– వ్యాట్‌లో కోత విధించాయి.


ఇవి విపత్కర పరిస్థితులు కావూ? కనుకనే కేంద్ర–రాష్ట్రాల ఆర్థిక సంబంధాలు, అధికారాలను సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిష్పాక్షిక పరిశీలకులు వాదిస్తున్నారు. మరీ ముఖ్యంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చట్టాలకు సంబంధించిన అధికరణలు 246ఎ, 269ఎ, 279ఎ లను సమీక్షించి తీరాలని వారు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. తమ సొంత ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు రాష్ట్రాలకు మరిన్ని ఆర్థిక అధికారాలు ఉండి తీరాలని పలువురు ఆర్థికవేత్తల సునిశ్చితాభిప్రాయంగా ఉంది. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే విధంగానే రాష్ట్రాలు స్థానిక స్వపరిపాలనా సంస్థలకు నిధులు ఇవ్వాలి. ఇది వాటి రాజ్యాంగ బాధ్యత. అయితే అసలు ఆదాయ వనరులు అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్రాలు పట్టణ, గ్రామీణ స్వపరిపాలనా సంస్థలకు నిధులు ఇవ్వలేకపోతున్నాయి. ఫలితంగా పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ఉద్దేశించిన 73వ, 74వ రాజ్యాంగ సవరణ లక్ష్యం నెరవేరనే లేదు. నిధులూ లేని, అధికారాలూ లేని స్థానిక స్వపరిపాలనా సంస్థలు ప్రజాశ్రేయస్సుకు ఏం చేయగలుగుతాయి?


ఆర్థిక అధికారాలపై కేంద్రం గుత్తాధిపత్యం వహిస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఇతర అధికారాల కేంద్రీకరణకు దారితీస్తోంది. రాష్ట్రాల శాసన నిర్మాణ అధికారాలను కేంద్రం దురాక్రమిస్తోంది. కొత్త సాగు చట్టాలే ఇందుకొక నిదర్శనం. అలాగే పన్నులు విధించడంలో సైతం కేంద్రం మితిమీరిన అధికారాన్ని చెలాయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వాహక అధికారాలను త్రోసిపుచ్చేందుకు కేంద్రం తన కార్యనిర్వాహక అధికారాలను వినియోగిస్తోంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని ఆయన పదవీ విరమణ రోజున బదిలీ చేయడం ఇందుకొక ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వ విధానాలు దేశ వ్యాప్తంగా ఏక రూపతను విధిస్తున్నాయి. ‘నీట్’ ఇందుకొక నిదర్శనం. సమాఖ్య విధాన సూత్రాలకు అనుగుణంగా దేశ పాలన జరగడం లేదు. ఏదో ఒకనాటికి సమాఖ్య విధానం అంతమై ఏక కేంద్రక రాజ్య వ్యవస్థ (యూనిటరీ స్టేట్)గా భారత్ ఆవిర్భవించే ప్రమాదమున్నది. ఏక కేంద్రక రాజ్య వ్యవస్థ ప్రతిపాదనను మన రాజ్యాంగ సభ నిర్ద్వంద్వంగా తిరస్కరించిందన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. మీకు ఏ తరహా రాజ్య వ్యవస్థ కావాలి? అమానవీయ ఏకత్వం, కేంద్రానికి లోబడి ఉండే రాష్ట్రాలతో కూడిన ఏక కేంద్రక భారతదేశమా లేక సహకార భావం, పోటీ తత్వంతో పురోగమించే భారత సమాఖ్య రాజ్యమా? మీరే నిర్ణయించుకోండి.



పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-05-28T06:20:22+05:30 IST